
వీళ్లెవరూ మాకిష్టం లేదు
వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం ఉపఎన్నికలో పోటీచేసిన అభ్యర్థులెవరూ మాకు నచ్చలేదని పలువురు ఓటర్లు తేల్చిచెప్పారు. ఈ స్థానానికి జరిగిన ఉపఎన్నికల ఫలితాల్లో 7,753 మంది ఓటర్లు.. పోటీలో ఉన్న అభ్యర్థులెవరూ తమకు నచ్చలేదని చెబుతూ.. తమ ఓటును నోటా (నన్ ఆఫ్ ది ఎబో)కు వేశారు.
ఈ ఉపఎన్నికలో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు కలిపి మొత్తంగా 23 మంది బరిలో నిలిచారు. నియోజకవర్గంలో 15 లక్షల మందికి పైగా ఓటర్లు ఉండగా వారిలో 10 లక్షలకు పైగా (69 శాతం) తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారిలో 7,753 మంది పై వారెవరూ కాదు (నోటా) అన్న మీట నొక్కి అభ్యర్థులను తిరస్కరించారు. 2014 సాధారణ ఎన్నికల్లోనూ ఈ నియోజకవర్గంలో 14,034 మంది నోటా మీద ఓటు వేసి అభ్యర్థులను తిరస్కరించారు.