లెఫ్ట్‌లో ‘గాలి’ దుమారం
వరంగల్ అభ్యర్థి విషయంలో వామపక్షాల మధ్య విభేదాలు
సాక్షి, హైదరాబాద్: కొంతకాలంగా ఐక్యతారాగం విన్పిస్తున్న లెఫ్ట్ పార్టీల మధ్య మళ్లీ అభిప్రాయభేదాలు పొడసూపుతున్నాయి. తాజాగా వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల అభ్యర్థి అంశం సీపీఐ, సీపీఎంల మధ్య స్పర్ధలకు కారణమవుతోంది. వరంగల్ నుంచి ఉమ్మడి అభ్యర్థిగా గద్దర్‌ను ఒప్పించేందుకు వామపక్షాల ముఖ్యనేతలు ప్రయత్నించారు. అయితే ఆ ప్రయత్నాలు సాగుతుండగానే.. ఓయూ లా కాలేజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్‌ను పది వామపక్షాల తరఫున అభ్యర్థిగా నిలపాలని సీపీఎం విడిగా ప్రయత్నించడంపై సీపీఐ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు.
వామపక్షాల అభ్యర్థనపై గద్దర్ తన నిర్ణయాన్ని ప్రకటించకముందే, ఎంబీభవన్‌లో సీపీఎం జాతీయ ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరితో గాలి వినోద్‌ను సమావేశపరచడం ఏమిటని సీపీఐ నేతలు ప్రశ్నిస్తున్నారు. శనివారం జరిగిన సీపీఐ రాష్ట్ర కమిటీ భేటీలో గాలి వినోద్‌కుమార్‌కు అనుకూలంగా సీపీఎం నేతలు పావులు కదపడాన్ని తప్పుపట్టినట్టు తెలిసింది.
గతంలో జరిగిన తొమ్మిది వామపక్షాల భేటీలో వరంగల్ ఉప ఎన్నిక అభ్యర్థి ఖరారు బాధ్యతను సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి, సీపీఎం నేత తమ్మినేని వీరభద్రంకు కట్టబెడుతూ నిర్ణయం తీసుకున్నారు. తమ పక్షాన ఖమ్మం జిల్లాకు చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డా. ఎంఎఫ్ గోపీనాథ్‌ను తెరమీదకు తీసుకురావాలని సీపీఐ నేతలు యోచిస్తున్నట్టు తెలిసింది.