అభయ హస్తానికి లైన్ క్లియర్
రూ. 32.41 కోట్లు విడుదల చేసిన సర్కారు
1.08 లక్షల మందికి 6 నెలల పింఛన్ బకాయిలు
రేపటినుంచి పంపిణీకి ఏర్పాట్లు చేసిన ‘సెర్ప్’
సాక్షి, హైదరాబాద్ : మహిళలకు సాధికారత కల్పించాలనే ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజ శేఖరరెడ్డి (2009లో) ప్రవేశ పెట్టిన ‘అభయ హస్తం’ పథకాన్ని ఇకపైనా కొనసాగించాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. లబ్ధిదారులకు గత అక్టోబర్ నుంచి(ఆర్నెల్లుగా) పింఛన్లు అందకపోవడం, పింఛన్ల పంపిణీకి సర్కారు నిధులు కూడా విడుదల చేయకపోవడంతో ఈ పథకం అమలుపై కొంతకాలంగా సందిగ్ధత నెలకొంది.
అయితే లబ్ధిదారుల ఉత్కంఠకు తెరదించుతూ అభయహస్తం పింఛన్ల పంపిణీకై ప్రభుత్వం తాజాగా రూ.32.41 కోట్లు విడుదల చేసింది. నెలకు రూ.500 చొప్పున గత ఆరునెలల పింఛన్ బకాయిలు మొత్తం కలిపి ఒక్కో లబ్ధిదారుకు రూ.మూడువేలను బుధవారం నుంచి అందజేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది జిల్లాల్లో అర్హులైన 1.08 లక్షలమంది లబ్ధిదారులకు ఆయా మండల పరిషత్/మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో పింఛన్లు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఏర్పాట్లను పూర్తి చేసింది.
‘ఆసరా’తోనే ఆలస్యం: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ‘ఆసరా’ పథకం మార్గదర్శకాలతో అభయహస్తం పింఛన్లకు ఆటంకం ఏర్పడింది. అభయ హస్తం పథకం కింద గత సెప్టెంబర్ వరకు 60ఏళ్లు దాటిన 2.28 లక్షలమంది మహిళలకు ప్రభుత్వం నెలకు రూ.500 పింఛన్‌గా ఇచ్చింది. అయితే ప్రస్తుత ప్రభుత్వం 65ఏళ్ల పైబడిన వారికే ఆసరా పింఛన్లు ఇస్తుండడంతో.. 60ఏళ్లు దాటిన మహిళలకు అభయ హస్తం పింఛన్లు ఆగిపోయాయి. అభయ హస్తం పింఛనర్లలో ‘ఆసరా’ పింఛన్లు పొందుతున్న వాళ్లు 1.20 లక్షలమంది ఉన్నట్లు ప్రభుత్వం తాజాగా నిర్ధారించింది. ‘ఆసరా’ పెన్షనర్లు పోను మిగిలిన 1.08 లక్షలమందికి అభయ హస్తం పింఛన్లు పంపిణీ చేయాలని సర్కారు తాజాగా నిర్ణయించింది.
అభయ హస్తంతో ఎంతో మేలు!
స్వయం సహాయక గ్రూపులోని పేద మహిళలకు అభయహస్తం ద్వారా పలు రకాలుగా లబ్ధి చేకూరనుంది. పద్దెనిమిదేళ్లు పైబడిన ప్రతి మహిళ ఈ పథకంలో సభ్యురాలిగా చేరవచ్చు. ఈ పథకంలో చేరిన సభ్యురాలు రోజుకు రూపాయి చొప్పున (ఏడాదికి రూ.365) ప్రీమియం చెల్లిస్తే రూ.75 వేల బీమా లభిస్తుంది. సభ్యురాలు చెల్లించిన దానికి సమానంగా ప్రభుత్వం కూడా జీవిత బీమా సంస్థకు ప్రీమియం చెల్లిస్తుంది. సభ్యురాలి ఇద్దరు పిల్లలకు ఏడాదికి రూ.1,200 చొప్పున నాలుగేళ్ల పాటు (9నుంచి 12వ తరగతి వరకు) ఎల్ఐసీ నుంచి ఉపకారవేతనం కూడా లభిస్తుంది. 60ఏళ్లు దాటిన తర్వాత నెలకు రూ.500 పింఛన్ వస్తుంది. ఒకవేళ ప్రమాదవశాత్తు సభ్యురాలు మరణించినా, అంగవైక్యలం కలిగినా రూ.75వేల బీమా అందుతుంది. సహజ మరణానికి రూ.30వేల బీమా బాధిత కుటుంబానికి లభిస్తుంది.