Warwick University Scientists
-
సిద్ధాంతాలకు సవాల్!
లండన్: ఇప్పటి వరకు ఉన్న అనేక ఖగోళ సిద్ధాంతాలను సవాల్ చేస్తున్న ఓ భారీ గ్రహాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. చిన్న నక్షత్ర మండలాల చుట్టూ భారీ గ్రహాలు ఏర్పడవని ఇప్పటి వరకు ఉన్న అనేక సిద్ధాంతాలు చెబుతున్నా యి. కానీ ఈ సిద్ధాంతాలన్నీ తప్పని నిరూపిస్తూ చిన్న నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తున్న ఎన్జీటీఎస్–1బీ అనే ఓ భారీ గ్రహాన్ని బ్రిటన్లోని వార్విక్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు గుర్తించారు. నక్షత్రం, గ్రహం పరిమాణాల నిష్పత్తి, వాటి మధ్య దూరం తదితర అంశాల్లో ఇప్పుడున్న సిద్ధాంతాలను ఈ నూతన గ్రహం సవాల్ చేస్తోంది. గురుగ్రహం పరిమాణంలో ఈ ఎన్జీటీఎస్–1బీ ఉన్నట్లు, ఓ చిన్న నక్షత్రం చుట్టూ ఇది పరిభ్రమిస్తున్నట్లు గుర్తించామని వార్విక్ వర్సిటీకి చెందిన పీటర్ వీట్లే వివరించారు. భూమి, సూర్యుడి మధ్య దూరంతో పోల్చితే ఈ చిన్న నక్షత్రానికి, ఎన్జీటీఎస్–1బీ మధ్య ఉన్న దూరం కేవలం మూడు శాతమేనని చెప్పారు. ఈ గ్రహం ఉపరితలంపై ఉష్ణోగ్రతలు చాలా అధికంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ గ్రహం తన పరిభ్రమణాన్ని 2.6 రోజుల్లో పూర్తి చేస్తోంది. -
ధనగ్రహం
వానొస్తే... ఏమొస్తుంది? ఆ.. ఏముంది.. నాలుగు చినుకులు పడతాయి. అప్పటివరకూ మలమల మాడిన మట్టి కమ్మటి పరిమళం అందిస్తుంది. కాసేపు ఆహా.. ఓహో అనుకుంటాం. ఆ తరువాత మరచిపోతాం. అంతే! ఇప్పుడు భూమికి కొంచెం దూరం.. కాదు కాదు చాలా దూరంగా వెళదాం. ఎంత దూరమంటే... దాదాపు వెయ్యి కాంతి సంవత్సరాల దూరం. అక్కడే ఉంటుంది ఈ ఫొటోలో కనిపిస్తున్న గ్రహం. వార్విక్ వర్సిటీ శాస్త్రవేత్తలు ఈ మధ్యే దీన్ని గుర్తించారు. పేరు ‘హ్యాట్ పీ–7బీ’. సైజు.. మన భూమికి దాదాపు 16 రెట్లు ఎక్కువ. మనకు లాగానే అక్కడా కొన్ని వాతావరణ పొరలు ఉన్నాయి. సౌర కుటుంబానికి ఆవల ఇలాంటి గ్రహం ఒకదాన్ని గుర్తించడం ఇదే తొలిసారి. డాక్టర్ డేవిడ్ ఆర్మ్స్ట్రాంగ్ అతడి బృందంలోని సైంటిస్ట్లు నాలుగేళ్లుగా ఈ వాతావరణాన్ని అందులోని మేఘాలను పరిశీలిస్తూ ఉన్నారు. ఎందుకో తెలుసా? హ్యాట్ పీ –7బీ వాతావరణంలో అల్యూమినియం ఆక్సైడ్ స్ఫటికాలు ఉన్నాయి. అయితే ఏంటి అంటారా? ఇవే స్ఫటికాలు భూమ్మీద నేల పొరల్లో ఉంటే వాటిని కెంపులని, నీలాలని పిలుస్తారు మరి! నిజమండీ.. దీనిపై వర్షం కురిస్తే అది ఎర్రటి కెంపులు, నీలాలతో ఉంటుందన్నమాట! ఈ కెంపు, నీలాల మేఘాలు కూడా ఉన్నట్టుండి భారీ సైజులో ఏర్పడుతూ అ తరువాతి క్షణంలోనే మాయమైపోతున్నాయట. ఇదేదో బాగానే ఉందే.. ఇప్పుడు కాకపోతే మరో వందేళ్లకైనా మనవాళ్లు అక్కడికెళ్లి సెటిలైతే బాగుండు అనుకుంటున్నారా? మన పప్పులేం ఉడకవు! ఎందుకంటే అక్కడ మనిషి తట్టుకోలేనంత స్థాయిలో వేడి కూడా ఉందట! రాశుల కొద్దీ కెంపులు, లారీల కొద్దీ నీలాలు వృథాగా పడి ఉన్నాయి అన్నమాట...ప్చ్! -
పీడకలలేగా అని తీసిపారేయొద్దు!
లండన్: పీడ కలలతో చిన్నారులు ఉలిక్కిపడి నిద్రలోంచి లేస్తున్నారా? ఏం కాదులే..! అంటూ తీసిపారేయకండి. అలాంటి కలలే వారిలో మానసిక సమస్యలకు దారితీస్తాయని వార్విక్వర్సిటీ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. 12 ఏళ్ల వయసులో పిల్లలకు పీడ కలలు వస్తుంటే వారు కౌమారంలో మానసిక రుగ్మతలకు గురయ్యే అవకాశాలు మూడున్నర రెట్లు ఎక్కువగా ఉంటాయని వీరు గుర్తించారు. రాత్రివేళ భయపడే చిన్నారులు కూడా కౌమారంలో రెండు రెట్లు అధికంగా భ్రమలు, ఆలోచనలకు విఘాతం వంటి మానసిక సమస్యలకు గురయ్యే అవకాశం ఉందంటున్నారు. ‘పీడకలలు నిద్రలో రెండో భాగంలో వస్తాయి. అప్పుడు భయంతో నడచి వెళుతున్నట్లు అనిపిస్తుంది. గుండె వేగంగా కొట్టుకుంటుంది’ అని శాస్త్రవేత్తలు తెలిపారు. అదే, నిద్రించగానే తొలి భాగం(గాఢ నిద్ర)లో ఉన్నప్పుడు భయంతో కేకలు పెట్టి లేచి కూర్చుంటారని వివరించారు.