
పీడకలలేగా అని తీసిపారేయొద్దు!
లండన్: పీడ కలలతో చిన్నారులు ఉలిక్కిపడి నిద్రలోంచి లేస్తున్నారా? ఏం కాదులే..! అంటూ తీసిపారేయకండి. అలాంటి కలలే వారిలో మానసిక సమస్యలకు దారితీస్తాయని వార్‌విక్‌వర్సిటీ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. 12 ఏళ్ల వయసులో పిల్లలకు పీడ కలలు వస్తుంటే వారు కౌమారంలో మానసిక రుగ్మతలకు గురయ్యే అవకాశాలు మూడున్నర రెట్లు ఎక్కువగా ఉంటాయని వీరు గుర్తించారు.
రాత్రివేళ భయపడే చిన్నారులు కూడా కౌమారంలో రెండు రెట్లు అధికంగా భ్రమలు, ఆలోచనలకు విఘాతం వంటి మానసిక సమస్యలకు గురయ్యే అవకాశం ఉందంటున్నారు. ‘పీడకలలు నిద్రలో రెండో భాగంలో వస్తాయి. అప్పుడు భయంతో నడచి వెళుతున్నట్లు అనిపిస్తుంది. గుండె వేగంగా కొట్టుకుంటుంది’ అని శాస్త్రవేత్తలు తెలిపారు. అదే, నిద్రించగానే తొలి భాగం(గాఢ నిద్ర)లో ఉన్నప్పుడు భయంతో కేకలు పెట్టి లేచి కూర్చుంటారని వివరించారు.