అందాలొలికే..
జంగారెడ్డిగూడెం రూరల్: అందాలొలికే జలపాతం రూపంలో.. తామరపై నీటి బిందువు రూపంలో.. పక్కనే ఉన్న గుడిలో ఆధ్యాత్మిక సవ్వడి రూపంలో.. ఇలా నిత్యం అక్కడ కనులకు విందు. వాటర్పాల్స్ను తలపించే నీటి ప్రవాహం. మైమరపించే తామర పువ్వులు, పక్కనే సేదతీరేందుకు నాగేంద్రుడి ఆలయం. జంగారెడ్డిగూడెం మండలం తిరుమలాపురం తామర చెరువులో ఇలా అందాలు అలరిస్తున్నాయి. తామర పుష్పాలు పూయడంతో ఈ చెరువుకు తామర చెరువుగా పేరు వచ్చిందని గ్రామస్తులు చెబుతున్నారు. వర్షాకాలంలో చెరువు నిండినప్పుడు చెరువుకు అనుసంధానంగా ఉన్న డ్యామ్ ద్వారా ప్రవహించే నీరు జలపాతాన్ని తలపిస్తోంది. ఇక్కడే నాగేంద్రుడి ఆలయం కూడా ఉండటంతో ప్రజలు ఆలయం వద్ద కూర్చుని అందాలను తిలకిస్తూ ఆహ్లాదాన్ని పొందుతుంటారు.