అరణ్య రోదన
శ్రీకాకుళం, సీతంపేట: ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న అన్ని జీవరాసులకు జీవనాధారం జీవగెడ్డలే. సాధారణంగా ఏజెన్సీలో గెడ్డలు మే నెల వరకు అడుగంటవు. ఏదో ఒక గెడ్డలో నీరు ఉంటుంది. ఈ ఏడాది మార్చి వచ్చే సరికే గెడ్డలు అడుగంటుతున్నాయి. మనుషులతోపాటు మూగజీవాలకు రోదన తప్పదు. ఏజెన్సీలో కొండమేకలు, జింకలు, కుందేళ్లు, అడవి పందులు వంటివి కొండల్లో ఉంటాయి. గెడ్డల వద్దకు వచ్చి నీరు తాగుతాయి.
ఒకేసారి అన్ని గెడ్డలూ..
ఏజెన్సీలో 465 గిరిజన గ్రామాలున్నాయి. గెడ్డలకు ఆనుకుని ఉన్నవి దాదాపు 500 వరకు ఉంటా యి. వీటిలో 300లకు పైగా అడుగంటినట్టు గిరిజనుల అంచనా. ఒకేసారి ఇన్ని గెడ్డలు అడుగంటడం చూస్తే ఈ ఏడాది నీటి ఎద్దడి ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతుంది. ఇప్పటికే దోనుబా యి, తంకిడి, సీతంపేట, గొయిది, కుడ్డపల్లి, పొల్ల, కుశిమి, శంబాం, కోడిశ తదితర ప్రాంతా ల్లో ఉన్న గెడ్డలు ఇంచుమించూ అడుగంటిపోయాయి. కొండపై ఊటబావులు 150 నుంచి 200ల వరకు ఉంటాయి. వీటిలో సగం వరకు అడుగంటినట్టు సమాచారం. కొన్ని గ్రామాల గిరి జనులు తాగునీటికి ఊటబావులు, గెడ్డలపై ఆధారపడేవారు. ఇప్పుడు భూగర్భజలాలు పూర్తిగా అడుగంటడంతో ఏంచేయాలో తెలియని పరిస్థితి.
ఏనుగుల పరిస్థితి ఏంటి?
ఏజెన్సీ ప్రాంతాల్లో సంచరిస్తున్న ఏనుగుల పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్ధకమే. రోజుకు ఒక్కొ ఏనుగు 200 నుంచి 600 లీటర్ల వరకు నీటిని తీసుకుంటుంది. ఏనుగులన్ని కొండ దిగువ ప్రాంతా ల్లో ఉన్న ఊట గెడ్డల వద్ద వాటికి కావాల్సిన నీటిని తీసుకుని సంచరించేవి. గెడ్డలన్నీ అడుగంటడంతో ఇవి నీటిని వెతుక్కుంటూ గ్రామాల వైపు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. గతంలో ఇలాగే గ్రామాల వైపు వచ్చేవి. ఇప్పుడు కూడా గ్రామాలకు సమీపంలోకి వచ్చేస్తే ఏం చేయాలోనని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు.
తీవ్రతరమవుతున్న సమస్య...
ఏజెన్సీలో 50కు పైగా గ్రామాల్లో ఇప్పటికే నీటి ఎద్దడి నెలకొంది. చాలా గ్రామాల్లో నీటి కోసం గిరిజనులు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని గ్రామాల్లో అయితే రాత్రంతా నీటికోసం జాగారం చేస్తున్నట్టు గిరిజనులు చెబుతున్నారు. ఇప్పటికే గ్రామాల్లో గతంలో ఏర్పాటు చేసిన గ్రావిటేషన్ ఫ్లోలు ఎండిపోయాయి. బోర్లులో నీరు ఎంతకొట్టినా పడడం లేదు. బావుల కోసం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రతీ వారం జరిగే గిరిజన దర్బార్‌కు సైతం నీటి సమస్య ఉందని వినతులు వస్తూనే ఉన్నాయి.
ప్రతి ఏటా సమస్య తప్పడం లేదు
ప్రతి ఏటా నీటి సమస్య తప్పడం లేదు. గెడ్డలు అడుగంటడంతో మూగ జీవాలకు అవస్థలు తప్పడం లేదు. కొన్ని గ్రామాల్లో జీవగెడ్డలు అడుగంటడంతో మహిళలు కిలోమీటర్ల దూరం నీటి కోసం నడిచివెళ్లాల్సిన పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు స్పందించి నీటి ఎద్దడి తీర్చాలి.– ఎస్.మహేష్, అక్కన్నగూడ
గ్రామాల్లో నీటి సమస్య ఉంది
ముందస్తు చర్యలు లేకపోవడంతో గిరిజన గ్రామాల్లో నీటి సమస్య ఉంది. గెడ్డలు, వాగులన్నీ ఎండిపోయాయి. పలు గ్రామా ల గిరిజనులు అధికారులకు వినతులు కూడా ఇవ్వడం జరిగింది.– బి.అప్పారావు, గిరిజన సంఘం నాయకుడు