ఆకూ ఎండిపాయే! | water level low | Sakshi
Sakshi News home page

ఆకూ ఎండిపాయే!

Published Fri, Apr 14 2017 11:53 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

ఆకూ ఎండిపాయే! - Sakshi

ఆకూ ఎండిపాయే!

అడుగంటిన భూగర్భ జలాలు
పంట సాగుకు అందని నీరు
తీవ్రంగా నష్టపోయిన ఆకుతోటల కౌలు రైతులు


తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయి. అంతకు ముందు బోరుబావుల్లో వస్తున్న నీటిపై ఆధారపడి తమలపాకుల తోటలు పెంచిన కౌలు రైతులు... పంట చేతికి వచ్చే సమయానికి బోరుబావుల నుంచి నీరు రాకపోవడంతో తడులు ఇవ్వలేకపోయారు. ఫలితంగా ఎటు చూసినా ఆకుతోటలు నిట్టనిలువునా ఎండిపోయాయి.
- పెద్దవడుగూరు (తాడిపత్రి)

పెద్దవడుగూరు మండలంలోని క్రిష్టిపాడు, కోనాపురం, రావులుడికి, భీమునిపల్లి, అప్పేచర్ల, కదరగుట్టపల్లి.. చుట్టుపక్కల గ్రామాల్లో రైతుల నుంచి భూములను కౌలుకు తీసుకున్నవారు ఆకుతోటలను విస్తారంగా పెంచారు. ఒక్క క్రిష్టిపాడు పరిధిలోనే దాదాపు ఐదు వందల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఆకుతోటలు ఉన్నాయి. మండుతున్న ఎండలకు తోడు, బోరుబావుల నుంచి చుక్కనీరు బయటకు రాకపోవడంతో వంద ఎకరాల్లో కౌలు రైతులు సాగు చేసిన ఆకు తోటలు ఎండిపోయాయి. మరో 200 ఎకరాల్లో ఆకుతోటలు విషమ పరిస్థితుల్లో ఉన్నాయి. ఇంత కాలం కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన పంట కళ్లముందే ఎండిపోవడంతో రైతులు విలవిల్లాడుతున్నారు.

రూ. 6 లక్షల పెట్టుబడి నష్టం
మా గ్రామానికి చెందిన రైతు నుంచి ఎకరాకు రూ. 50 వేలు కౌలుతో మూడు ఎకరాలను తీసుకుని ఆకుతోట పెంచాను. ఇందుకు గాను ఇప్పటి వరకు రూ. ఆరు లక్షల వరకు పెట్టుబడుల కింద ఖర్చు పెట్టాను.  ప్రస్తుతం బోరుబావిలో నీరు రావడం లేదు. పంట కూడా ఎండిపోయింది. కుటుంబ పోషణ భారంగా ఉంది. పంట సాగు కోసం ప్రైవేట్‌ వ్యక్తుల వద్ద అప్పు చేశాను. వారికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదు. ప్రభుత్వమే ఆదుకోవాలి.
- హజీపీరా, క్రిష్టిపాడు

కనీస పెట్టుబడి కూడా రాలేదు.
నాకున్న ఎకరన్నర పొలంలో ఆకుతోటను పెంచాను. సుమారు రెండు లక్షల రూపాయల వరకూ పెట్టుబడి పెట్టాను. తోటలోని బోరుబావి ఎండిపోవడంతో చేతికి వచ్చిన పంటకు సాగునీరు అందివ్వలేకపోయాను. దీంతో కనీస పెట్టుబడి కూడా దక్కలేదు.
-  శ్రీనివాసులు, క్రిష్టిపాడు గ్రామ రైతు

రెండెకరాల్లో పంట ఎండిపోయింది
నేను రెండు ఎకరాల్లో సాగు చేసిన ఆకు తోట పూర్తిగా ఎండిపోయింది. ఇప్పటి వరకూ వడ్డీ వ్యాపారుల నుంచి రూ. 3 లక్షల వరకూ అప్పు చేసి పెట్టుబడి పెట్టాను. పంట చేతికి వచ్చే సమయంలో బోరుబావిలో నీరు తగ్గిపోయింది. కళ్లముందే పంట ఎండిపోతుంటే ఏమీ చేయలేని పరిస్థితి. ప్రభుత్వం ఆదుకోకపోతే రైతుల పరిస్థితి మరీ అధ్వానంగా మారుతుంది.
- ఎర్రిస్వామి,  క్రిష్టిపాడు గ్రామ రైతు:

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement