నేతలకు తిర‘కేసు’
మోర్తాడ్(బాల్కొండ): ‘ముందస్తు’ జోష్‌లో ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్న టీఆర్ఎస్ నేతలకు నిరసన సెగ తగలనుందా..? పల్లెలకు వచ్చే నాయకులపై రైతుల నుంచి ఒత్తిడి ఎదురుకానుం దా? అంటే తాజా పరిస్థితులు చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. ఎస్సారెస్పీ కాకతీయ కాలువ పరివాహక ప్రాంత రైతులు ఇటీవల చేపట్టిన సాగునీటి ఉద్యమం ప్రజాప్రతినిధులకు కొత్త తలనొప్పులు తెచ్చి పెట్టే పరిస్థితి కనిపిస్తోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువకు నీటి విడుదల కోసం ఉద్యమించిన పలువురు రైతులపై పోలీసులు అప్పట్లో కేసులు నమోదు చేశారు.
అయితే, ముందస్తు ఎన్నికలకు సిద్ధమైన అధికార టీఆర్ఎస్ పార్టీకి ఈ కేసులు ఇరకాటంగా మారుతున్నాయి. గ్రామాలకు వస్తున్న నేతలకు నిరసన సెగలు తగులుతున్నాయి. మిషన్ భగీరథ వైస్ చైర్మన్, తాజా మాజీ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి రెండ్రోజుల క్రితం మెండోరా మండలంలో పర్యటనకు వెళ్లగా, రైతులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. తాజాగా ఆదివారం ఏర్గట్లలో సమావేశమైన ఆ గ్రామ రైతులు కేసుల ఎత్తివేత కోసం పలు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించుకున్నారు. తాజా పరిస్థితులు గమనిస్తుంటే రానున్న రోజుల్లో ‘కాకతీయ కేసులు’ టీఆర్ఎస్కు సంకటంగా మారనున్నాయనే భావన వ్యక్తమవుతోంది.
సాగునీటి కోసం ఉద్యమం..
కాకతీయ కాలువ పరివాహక ప్రాంతాలైన ఏర్గట్ల, తిమ్మాపూర్, ఉప్లూర్, తొర్తి, వెంచిర్యాల్, వెల్కటూర్, మెండోరా, బట్టాపూర్, రాజరాజేశ్వర్ నగర్ తదితర గ్రామాల రైతులు సాగు చేస్తున్న పంటలకు లీకేజీ నీరే ప్రాణాధారం. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువ ద్వారా దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేయకపోయినా జిల్లాలోని రైతాంగానికి లీకేజీల ద్వారా వచ్చే నీరు ఎంతో ఉపయోగపడేది. కాకతీయ కాలువకు ఇరువైపులా ఉన్న గ్రామాల రైతులు కాలువలో పంపుసెట్లు ఏర్పాటు చేసుకుని వాటి ద్వారా పంటలకు నీరు అందించుకుంటున్నారు.
ఈసారి వర్షాలు ఆలస్యంగా కురువడంతో రైతులు గత్యంతరం లేని పరిస్థితిలో కాకతీయ కాలువ నీటి కోసం ఉద్యమ బాట పట్టారు. అయితే, నీటి విడుదల కుదరదని ప్రభుత్వం స్పష్టతనివ్వడం, రైతులు ఉద్యమాన్ని ఉద్ధృతం చేయడం, పల్లెల్లో పోలీసుల మోహరింపుతో అప్పట్లో ఈ వివాదం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పోచంపాడ్‌లో రాస్తారోకో సందర్భంగా చెలరేగిన ఘటనను దృష్టిలో ఉంచుకుని పోలీసులు పలువురిపై క్రిమినల్ కేసులను నమోదు చేశారు. 25 మంది రైతులతో పాటు వారికి మద్దతిచ్చిన ఐదుగురు నేతలపై కేసులు నమోదయ్యాయి.
అనువైన సమయమని..
పోలీసులు కేసులలో నిందితులుగా ఉన్న రైతులు పోలీసు స్టేషన్, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. వ్యవసాయాన్ని నమ్ముకుని బతికే తాము పంట పొలాలను వదలి కోర్టులు, స్టేషన్ల చుట్టూ తిరిగితే మా పనులు ఏమి కావాలని రైతులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలోనే.. ముందస్తు ఎన్నికలు మంచి అవకాశంగా కలిసి వచ్చాయని వారు భావిస్తున్నారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహిస్తూనే ప్రచార పర్వానికి ఏకకాలంలో టీఆర్ఎస్ నాయకులు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా బాల్కొండ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి మూడు రోజుల నుంచి నియోజకవర్గంలో విస్తృత పర్యటన చేస్తున్నారు.
అయితే, తమపై నమోదైన కేసుల ఎత్తివేతకు ఇదే అనువైన సమయమని గుర్తించిన బాధిత రైతులు నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మెండోరా మండల కేంద్రంలో ప్రశాంత్‌రెడ్డి పర్యటించగా, నల్లబ్యాడ్జీలు ధరించి కేసులు ఎత్తివేయాలని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఏర్గట్ల మండల కేంద్రానికి చెందిన రైతులు కూడా కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కేసులు ఎత్తివేయక పోతే భవిష్యత్తులో మరిన్ని నిరసన కార్యక్రమాలు చేపడతామని రైతులు స్పష్టం చేస్తున్నారు.
బేషరతుగా కేసులు ఎత్తి వేయాలి
రైతులపై పెట్టిన కేసులను బేషరతుగా ఎత్తి వేయాలి. ప్రభుత్వం స్పందించక పోతే మరో ఉద్యమం తప్ప దు. రైతులను హిం సించిన ఏ ప్రభుత్వం బాగు పడలేదు. రైతులు అన్నం పెట్టే వారే తప్ప మరొకరిని ఇబ్బంది పెట్టేవారు కాదు. ప్రభుత్వం పునరాలోచన చేయాలి. కేసులను ఎత్తి వేయాలి. – అశోక్, రైతు, మెండోరా
రైతులకు మద్దతిస్తే కేసులా..?
రైతులు నీటి కోసం ఆందోళన చేపడితే మద్దతు ఇచ్చిన వారిపైనా పోలీసులు కేసులను నమోదు చేయడం ఎంత వరకు సమంజసం. పోలీసుల తీరు సరికాదు. ప్రభుత్వం స్పందించి కేసులను ఎత్తివేయడానికి చర్యలు తీసుకోవాలి. – శివన్నోల్ల శివకుమార్, ఏర్గట్ల
నీళ్లడిగితే కేసులు పెడతారా..?
మేము న్యాయబద్ధంగా నీటి కోసం ఉద్యమించాం. నీళ్లడిగిన రైతులపై కేసులా..? ఎన్నో నేరాలు చేస్తున్న వారిని వదిలి, సాగు నీటి కోసం ఉద్య మించిన రైతులపై కేసులు పెడతారా..? మహిళలు అని కూడా చూడకుండా మాపైనా పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇది ఎంత వరకు సమంజసం. రైతులపై పెట్టిన కేసులన్నీ ఎత్తివేయాలి. – బద్దం రజిత, రైతు, ఏర్గట్ల