water stream
-
వరద నీరు ఉధృతం.. వాగులో ప్రసవ వేదన
కడెం(ఖానాపూర్): వర్షాలకు వాగు పొంగిపొర్లడంతో ఓ నిండు గర్భిణి ప్రసవ వేదన అనుభవించింది. నిర్మల్ జిల్లా కడెం మండలం దత్తోజీపేట గ్రామానికి చెందిన రొడ్డె ఎల్లవ్వకు మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పురిటినొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు బుధవారం ఉదయం కడెం ఆస్పత్రికి తీసుకెళ్లడానికి సిద్ధమయ్యారు. బొలెరో వాహనంలో ఎల్లవ్వను తరలిస్తుండగా లద్దివాగు వద్దకు వచ్చేసరికి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాహనం అదుపు తప్పకుండా ట్రాక్టర్‌కు తాడు కట్టి వాగు దాటించారు. అయితే వాగు దాటే క్రమంలోనే ఆమెకు పురిటినొప్పులు మరింత పెరిగాయి. వాగు దాటిన వెంటనే ఎల్లవ్వ వాహనంలోనే ఆడశిశువుకు జన్మనిచ్చింది. అనంతరం మెరుగైన వైద్యం కోసం తల్లీబిడ్డలను కడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్య సిబ్బంది తెలిపారు. -
దేవుడా.. అంటూ వాగు దాటాల్సి వచ్చింది
గుండాల: కడుపులో బిడ్డ. పురిటి నొప్పులతో ఇద్దరు గర్భిణుల కష్టాలు. ఆస్పత్రికి వెళదామంటే అడ్డుకుంటున్న వాగు ఉధృతి. అన్నీ భరిసూ్తనే ఇద్దరూ కుటుంబ సభ్యుల సహకారంతో దేవుడా.. అంటూ వాగు దాటాల్సి వచ్చింది. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. మండలంలోని నర్సాపురం తండాకు చెందిన లూనావత్ మమత నిండు గర్భిణీ కావడంతో పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు ద్విచక్ర వాహనంపై మల్లన్నవాగు వద్దకు తీసుకొచ్చారు. వర్షాలకు ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో నుంచి గర్భిణిని ముగ్గురు కుటుంబ సభ్యులు అతికష్టం వీుద దాటించారు. అక్కడి నుంచి గుండాల ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత వైద్యుల సూచన మేరకు ఖమ్మం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అలాగే రోళ్లగడ్డ గ్రామానికి చెందిన ఈసం వనజ ఆరు నెలల గర్భవతి. నెలలు నిండకున్నా ఆమెకు నొప్పులు వస్తుండటంతో అదే వాగుపై నుంచి కుటుంబ సభ్యులు దాటించి ఆస్పత్రికి తరలించారు. వర్షాకాలంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తే గర్భిణులు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారి పరిస్థితి ఏమిటని పలువురు గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. గర్భిణికి మెరుగైన వైద్యం అందించాలి సూపర్‌బజార్(కొత్తగూడెం): గుండాల మండలం నర్సాపురం గ్రామానికి చెందిన నూనావత్ మమత పురిటి నొప్పులతో బాధపడుతుండగా భుజాలపై మల్లన్న వాగును దాటించిన ఘటనపై సమగ్ర వివరాలందించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎంవీ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో ఆదేశించారు. ఆమెకు మెరుగైన వైద్యసేవలు అందించాలని, ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలపాలని సూచించారు. -
పొంగి ప్రవహిస్తున్న వాగు... డ్రైవర్ నిర్లక్ష్యంతో
సాక్షి, నల్గొండ: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో తెలంగాణలోని పలు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. ఈ క్రమంలో నల్గొండ జిల్లా దేవరకొండ చింతపల్లి మండలం కిష్టారం పల్లి గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామ సమీపంలో పొంగిపొర్లుతున్న వాగులో ప్యాసెంజర్ ఆటో బోల్తా కొట్టింది. దీంతో అందులోని ప్రయాణికులు నీటిలో కొంత దూరం కొట్టుకు పోగా, రాములమ్మ అనే మహిళ నీట మునిగి మృతి చెందింది. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగిందని స్థానికులు, మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో ఆటోని పోనివ్వడంతో తమ ఇంటి దీపం ఆరిపోయిందని రాములమ్మ భర్త కన్నీటిపర్యంతమయ్యాడు. -
విద్యార్థి ప్రాణం తీసిన ఈత సరదా
ఉలవపాడు: ప్రకాశం జిల్లా ఉలవపాడులో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. కల్యాణ్(15) అనే 9వ తరగతి విద్యార్ధి వల్లూరుపాడు వంకలో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందాడు. ఆదివారం సెలవు దినం కావడంతో ఐదుగురు స్నేహితులు సరదాగా ఈత కొట్టడానికి వంకకు వెళ్లారు. వంకలో లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో కల్యాణ్ దిగడంతో నీటిలో మునిగిపోయాడు. గమనించిన తోటి విద్యార్థులు గ్రామస్థులకు సమాచారమివ్వడంతో కల్యాణ్ కోసం గాలిస్తున్నారు. అతనికి ఈత రాకపోవడం కూడా మృతికి కారణంగా తెలుస్తుంది. విద్యార్థి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.