ట్రాక్టర్ సహాయంతో బొలెరో వాహనాన్ని వాగు దాటిస్తున్న గ్రామస్తులు, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తల్లీబిడ్డ
కడెం(ఖానాపూర్): వర్షాలకు వాగు పొంగిపొర్లడంతో ఓ నిండు గర్భిణి ప్రసవ వేదన అనుభవించింది. నిర్మల్ జిల్లా కడెం మండలం దత్తోజీపేట గ్రామానికి చెందిన రొడ్డె ఎల్లవ్వకు మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పురిటినొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు బుధవారం ఉదయం కడెం ఆస్పత్రికి తీసుకెళ్లడానికి సిద్ధమయ్యారు. బొలెరో వాహనంలో ఎల్లవ్వను తరలిస్తుండగా లద్దివాగు వద్దకు వచ్చేసరికి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది.
వాహనం అదుపు తప్పకుండా ట్రాక్టర్‌కు తాడు కట్టి వాగు దాటించారు. అయితే వాగు దాటే క్రమంలోనే ఆమెకు పురిటినొప్పులు మరింత పెరిగాయి. వాగు దాటిన వెంటనే ఎల్లవ్వ వాహనంలోనే ఆడశిశువుకు జన్మనిచ్చింది. అనంతరం మెరుగైన వైద్యం కోసం తల్లీబిడ్డలను కడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్య సిబ్బంది తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment