పైపులైను లీకేజీతో 3 రోజులుగా నీరు బంద్
బాపట్ల(గుంటూరు): రెండు శాఖల మధ్య వివాదంతో 25 గ్రామాల ప్రజలు తాగు నీరు అందక మూడు రోజులుగా అవస్థలు పడుతున్నారు. వివరాలివీ..గుంటూరు జిల్లా బాపట్ల మండలంలో అటవీ అధికారులు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా దరివాగు కొత్తపాలెం సమీపంలో శనివారం గుంతలు తీస్తుండగా మంచినీటి పైపులైనుకు రంధ్రం పడింది. నీరు వృథాగా పోతుండటంతో సరఫరాను వెంటనే ఆపివేశారు.
అటవీ శాఖ అధికారులే పైపు లీకేజికి కారణంగా కాబట్టి వాళ్లే లీకేజీని ఆపాలని ఆర్డబ్ల్యుఎస్ అధికారులు పట్టించుకోలేదు. ఆర్డబ్ల్యుఎస్ శాఖ పైపులైను సంగతి తమకెందుకని అటవీ అధికారులు మిన్నకుండిపోయారు. రెండు శాఖల మధ్య నలుగుతున్న వ్యవహారంతో ప్రజలకు మూడు రోజులుగా ఇబ్బంది తప్పటం లేదు.