water tubs
-
Lotus: కుండీల్లో తామరల పెంపకం.. ధర 300 నుంచి 4 వేల వరకు! నెలకు 50 వేలు
కొలనుల్లో తామరలు సూర్య నమస్కారాలు చేస్తాయి. దొరువుల్లో కలువలు చంద్రునికి మోహలేఖలు రాస్తాయి. కాని అవి పాత రోజులు. ఇప్పుడు ఇళ్లల్లో అలంకరణ కోసం తామరలు కొని నీటి తొట్లలో వదులుతున్నారు. అవి ఎక్కడి నుంచి వస్తాయి? కేరళలో అంజలి లాంటి స్త్రీలు కుండీల్లో, ప్లాస్టిక్ తొట్లలో తామరలను పెంచి అమ్ముతున్నారు. దాదాపు 40 రకాల తామరలు ఉన్నాయి. 300 నుంచి ఒక్కో పువ్వు 4000 రూపాయల వరకూ పలుకుతాయి. నెలకు 30 నుంచి 50 వేలు సంపాదిస్తూ ఉంది అంజలి. కోవిడ్ వల్ల ఎవరికి ఎన్ని కష్టాలు వచ్చినా అది అంజలికి తామరలు కూడా పూయించింది. కేరళలోని పాలక్కాడ్‌కు చెందిన 28 ఏళ్ల అంజలిని చూడండి. కోవిడ్ కాలంలో భర్తకు సంపాదన పోవడంతో తామరలను నమ్ముకుంది. ముందు మిద్దె మీద పెంచింది. ఆదాయం బాగుండటంతో ఇప్పుడు 20 సెంట్ల భూమి సంపాదించి అక్కడ తామరలు పెంచుతోంది. అన్నీ కుండీల్లోనే. లేకుంటే ప్లాస్టిక్ టబ్బుల్లో. దీనిని ‘నీటి తోట’ అనొచ్చు. నీటి మొక్క తామర. దీనితో పాటు కలువ. అంజలి జీవితం ఇప్పుడు మూడు కలువలు ఆరు తామరలుగా సాగిపోతోంది. వేసిన 15 రోజులకే పూస్తుంది ‘ముందు నాటు రకం తామరలు పెంచాను. అవి ఏడాదికి కాని పూలు పూయవు. ఇలా కాదని హైబ్రిడ్ తామరలను పెంచడం నేర్చాను. కొన్ని హైబ్రిడ్ తామర మొక్కలు నెలకే పూస్తాయి. వీటిని థాయ్‌లాండ్ వాళ్లు డెవలప్ చేశారు. అమిరి కెమిలియా అనే తామర రకం ఉంది. అదైతే వేసిన 15 రోజులకే పూస్తుంది. ఇప్పుడు నా తామర సాగులో దాదాపు 40 రకాలు ఉన్నాయి’ అంటుంది అంజలి. ఆమెకు పూలు పూయించడంతో పాటు ప్రచారం చేయడం కూడా వచ్చు. ఫేస్బుక్లో, ఇన్‌స్టాలో ఆ తామర మొక్కలు, పూలు ఫోటోలు పెడుతుంది. మొదట కేరళ నుంచి ఆర్డర్లు రావడం మొదలైంది. ఇప్పుడు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. ‘తామరలు దుంపవేరు నుంచి వస్తాయి. దుంపవేర్లు కొనేవాళ్లు ఉంటారు. కాని వాటిని పెంచడం తెలియాలి. కొందరు నేరుగా మొక్కలు కొంటారు. అవి కొన్న తర్వాత పది రోజులకు మించి బతకవు. అందుకని వెంటనే వాడుకోవాల్సి ఉంటుంది. కొందరు ఒట్టి పూలే కొంటారు’ అంటుంది అంజలి. రూ. 4000 పెడతారు కూడా! నాటు తామరలకు రెక్కలు తక్కువ ఉంటాయి. హైబ్రిడ్ తామరలకు రెక్కలు ఎక్కువ. ‘మిరకిల్’ అనే వెరైటీలో పువ్వుకు 700 రెక్కలు ఉంటాయి. ఇక సహస్రదళపద్మానికి డిమాండ్ జాస్తి. దీనిలో వేయి రెక్కలు ఉంటాయి. ‘బుద్ధ పద్మం’, ‘దుర్గపద్మం’ అని చాలా రకాలే ఉన్నాయి. ‘పసుపు రంగు తామరలకు బాగా గిరాకీ ఉంది. ఒక్కో మొక్కకు రూ. 4000 పెట్టడానికి కూడా సిద్ధమవుతారు’ అంటుంది అంజలి. నెలకు యాభైవేల వరకు సంపాదన ఆమె దగ్గర పూలు, దుంపవేర్లు, మొక్కలు రకాన్ని బట్టి 300 నుంచి మొదలవుతాయి. నెలకు అన్ని రకాలూ 100 పూల వరకూ అమ్ముతుంది. అన్నీ కుదిరితే 50 వేలు కూడా సంపాదిస్తుంది. వీటితోపాటు కలువలు కూడా సాగు చేస్తుంది. వాటి మీద ఆదాయం కూడా బాగుంది. ‘మొక్కలను జాగ్రత్తగా చూడాలి. తామరకు బాగా ఎండ తగలాలి. నీటి కుండీల్లో దోమలు చేరకుండా గుప్పీ చేపలను వదిలితే మంచిది’ అంటుంది అంజలి. తన దగ్గర మొక్కలు కొన్నవారికి వాటిని ఎలా సంరక్షించాలో చెబుతుంది. ఇప్పుడు శ్రీమంతులే కాదు మధ్యతరగతి వారు కూడా ఇంటి ముంగిలిలో ఒక తామరతావును లేదా పూలను అలంకరించడానికి ఇష్టపడుతున్నారు. ఈ సాగు నేర్చితే మహిళలు ఇంటి దగ్గరి నుంచే ఆదాయం గడించవచ్చు. చదవండి: Spineless Cactus: 5 ఎకరాల జామ తోట చుట్టూ ముళ్లు లేని బ్రహ్మజెముడు! ఈ ఉపయోగాలు తెలుసా.. కూర వండుకుని తింటే Bio Fence: వారెవ్వా.. అప్పుడు ఖర్చు 40 వేలు.. ఇప్పుడు 1500.. కోతుల బెడద లేదు! కాకర, చిక్కుడు.. అదనపు ఆదాయం కూడా.. -
నీటి కోసం మూగజీవాల తహతహ
మరమ్మతులకు నోచుకోని నీటి తొట్లు వినియోగం లేక శిథిలావస్థకు.. చోద్యం చూస్తున్న అధికారులు తొట్లకు పైపులైన్ ఏర్పాటు చేయాలని ప్రజల వినతి మునిపల్లి: దాహం తీర్చుకునేందుకు పశువులు నానా ఇబ్బందులు పడుతున్నాయి. చీలపల్లి, తాటిపల్లి, మేళసంగంతో పాటు ఆయా గ్రామాల్లో నీటి తొట్లు ఉన్నా నిరుపయోగంగా మారాయి. ఫలితంగా చేతి పంపులో వచ్చే నీటి చుక్కల కోసం పశువులు వెంపర్లాడుతున్నాయి. వర్షాకాలంలోనూ వర్షాలు సక్రమంగా కురవకపోవడంతో నీటి వనరుల్లో నీరు అంతంతగానే ఉంది. ఇదిలా ఉంటే పశువుల దాహార్తి తీర్చేందుకు ప్రభుత్వం లక్షలు ఖర్చు చేసి నిర్మించిన తొట్లకు పైపులైన్ ఏర్పాటు చేయకపోవడంతో నిరుపయోగంగా ఉన్నాయి. కొన్ని నీటి తొట్లు నిర్మించిన నాటì నుంచి ఇప్పటి వరకు వినియోగంలో లేకపోవడంతో ఎక్కడికక్కడా శిథిలావస్థకు చేరాయి. మండలంలోని ఆయా గ్రామాలలో నీటి తొట్లు నిరుపయోగంగా ఉన్నాయి. తొట్లు గురించి పట్టించుకునే వారే కరువయ్యారు. గత ప్రభుత్వాలు ఆర్డబ్ల్యూఎస్ శాఖ నుంచి ఒక్కో తొట్టి నిర్మాణానికి సుమారు రూ. 20 వేల చొప్పున ఖర్చు చేసి నిర్మించారు. పెద్దచల్మెడ, పెద్దలోడి, మునిపల్లి, బుదేరా, కంకోల్, మేళసంగ్యం, అంతారం, ఖమ్మంపల్లి, పొల్కంపల్లి, మల్లారెడ్డిపేట, బుస్సారెడ్డిపల్లి, లింగంపల్లి, బొడ్చట్‌పల్లి, తదితర గ్రామాల్లో తొట్టెలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పశువుల సంతతిని బట్టి ఒక్కొక్క గ్రామంలో సుమారు 6 నుంచి 10 వరకు పశువుల తొట్లు నిర్మించారు. కానీ వీటిలో చాలా వరకు నీరు నింపుకునేందుకు సౌకర్యం లేదు. బోరు బావులు ఉన్న ప్రదేశాల్లో వృథానీరు తొట్లలోకి చేరుకునేలా నిర్మించాల్సి ఉన్నా అందుకు అనుగుణంగా నిర్మాణాలు జరగలేదు. ఫలితంగా పశువుల తొట్టెలు వృథాగా ఉండడమే కాకుండా వృథానీరు రోడ్డుపాలవుతోందని పశువుల కాపరులు ఆరోపిస్తున్నారు.. కొన్ని తొట్టిలు శిథిలావస్థకు చేరాయి. అంతే కాకుండా చిన్న పాటి మరమ్మతులు చేస్తే వినియోగం లోకి వచ్చే నీటి తొట్లకు బడ్జెట్ లేదంటూ సంబందిత అధికారులు చెతులెత్తేస్తున్నారు. ఫలితంగా పశువులు నీటి కోసం బోరు మోటార్లపైనే ఆధారపడాల్సి వస్తోంది. తక్షణం సంబంధిత శాఖ అధికారులు స్పందించి తగిన ఏర్పాట్లు చేయాలని పశువుల కాపరులు కోరుతున్నారు. నిధులు మంజూరు చేయాలి పశువులకు నీటి తొట్లు నిర్మించడానికి నిధులు మంజూరు చేయాలి. వాటర్ ట్యాంక్ నుంచి తొట్లకు పైపులైన్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేస్తే నీటి సౌకర్యం కల్పిస్తాం. - సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు విఠల్‌రెడ్డి నీటి సౌకర్యం కల్పించాలి పశువుల కోసం గ్రామాల్లో నీటి సౌకర్యం కల్పించాలి. కాలనీలలో నీటి తొట్లు లేకపోవడంతో పశువులకు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. - వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధానకార్యదర్శి రమేశ్ సర్పంచ్‌లే ఏర్పాటు చేయాలి ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం మంజూరు చేసిన నిధులనుంచి పశువులకు నీటి తొట్లు ఏర్పాటు చేయాలి. వాటర్ ట్యాంకర్ ద్వారా పైపులైన్ నీటి సౌకర్యం కల్పించాలి. - ఇన్చార్జి ఈఓపీఆర్డీ నాగలక్ష్మి