నీటి కోసం మూగజీవాల తహతహ | drinking water problems for animals | Sakshi
Sakshi News home page

నీటి కోసం మూగజీవాల తహతహ

Published Sun, Aug 7 2016 6:01 PM | Last Updated on Mon, Sep 4 2017 8:17 AM

దాహాం తీర్చుకునేందుకు ఇబ్బందులు పడుతున్న పశువు

దాహాం తీర్చుకునేందుకు ఇబ్బందులు పడుతున్న పశువు

  • మరమ్మతులకు నోచుకోని నీటి తొట్లు
  • వినియోగం లేక శిథిలావస్థకు..
  • చోద్యం చూస్తున్న అధికారులు
  • తొట్లకు పైపులైన్‌ ఏర్పాటు చేయాలని ప్రజల వినతి
  • మునిపల్లి: దాహం తీర్చుకునేందుకు పశువులు నానా ఇబ్బందులు పడుతున్నాయి. చీలపల్లి, తాటిపల్లి, మేళసంగంతో పాటు ఆయా గ్రామాల్లో నీటి తొట్లు ఉన్నా నిరుపయోగంగా మారాయి. ఫలితంగా చేతి పంపులో వచ్చే నీటి చుక్కల కోసం పశువులు వెంపర్లాడుతున్నాయి. వర్షాకాలంలోనూ వర్షాలు సక్రమంగా కురవకపోవడంతో నీటి వనరుల్లో నీరు అంతంతగానే ఉంది.  

    ఇదిలా ఉంటే పశువుల దాహార్తి తీర్చేందుకు ప్రభుత్వం లక్షలు ఖర్చు చేసి నిర్మించిన తొట్లకు పైపులైన్‌ ఏర్పాటు చేయకపోవడంతో నిరుపయోగంగా ఉన్నాయి. కొన్ని నీటి తొట్లు నిర్మించిన నాటì నుంచి ఇప్పటి వరకు వినియోగంలో లేకపోవడంతో ఎక్కడికక్కడా శిథిలావస్థకు చేరాయి. మండలంలోని ఆయా గ్రామాలలో నీటి తొట్లు నిరుపయోగంగా ఉన్నాయి. తొట్లు గురించి పట్టించుకునే వారే కరువయ్యారు.

    గత ప్రభుత్వాలు ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖ నుంచి ఒక్కో తొట్టి నిర్మాణానికి  సుమారు రూ. 20 వేల చొప్పున ఖర్చు చేసి నిర్మించారు.  పెద్దచల్మెడ, పెద్దలోడి, మునిపల్లి, బుదేరా, కంకోల్, మేళసంగ్యం, అంతారం, ఖమ్మంపల్లి, పొల్కంపల్లి, మల్లారెడ్డిపేట, బుస్సారెడ్డిపల్లి, లింగంపల్లి, బొడ్చట్‌పల్లి, తదితర గ్రామాల్లో తొట్టెలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పశువుల సంతతిని బట్టి ఒక్కొక్క గ్రామంలో సుమారు 6 నుంచి 10 వరకు పశువుల తొట్లు నిర్మించారు. కానీ వీటిలో చాలా వరకు నీరు నింపుకునేందుకు సౌకర్యం లేదు. బోరు బావులు ఉన్న ప్రదేశాల్లో వృథానీరు తొట్లలోకి చేరుకునేలా నిర్మించాల్సి ఉన్నా అందుకు అనుగుణంగా నిర్మాణాలు జరగలేదు.

    ఫలితంగా పశువుల తొట్టెలు వృథాగా ఉండడమే కాకుండా వృథానీరు రోడ్డుపాలవుతోందని పశువుల కాపరులు ఆరోపిస్తున్నారు.. కొన్ని తొట్టిలు శిథిలావస్థకు చేరాయి. అంతే కాకుండా చిన్న పాటి మరమ్మతులు చేస్తే వినియోగం లోకి వచ్చే నీటి తొట్లకు బడ్జెట్‌ లేదంటూ సంబందిత అధికారులు చెతులెత్తేస్తున్నారు. ఫలితంగా పశువులు నీటి కోసం బోరు మోటార్లపైనే ఆధారపడాల్సి వస్తోంది. తక్షణం సంబంధిత శాఖ అధికారులు స్పందించి తగిన ఏర్పాట్లు చేయాలని పశువుల కాపరులు కోరుతున్నారు.

    నిధులు మంజూరు చేయాలి
    పశువులకు నీటి తొట్లు నిర్మించడానికి నిధులు మంజూరు చేయాలి. వాటర్‌ ట్యాంక్‌ నుంచి తొట్లకు పైపులైన్‌ ఏర్పాటుకు నిధులు మంజూరు చేస్తే నీటి సౌకర్యం కల్పిస్తాం. - సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు విఠల్‌రెడ్డి

    నీటి సౌకర్యం కల్పించాలి
    పశువుల కోసం గ్రామాల్లో  నీటి సౌకర్యం కల్పించాలి. కాలనీలలో నీటి తొట్లు లేకపోవడంతో పశువులకు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. - వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ప్రధానకార్యదర్శి రమేశ్‌

    సర్పంచ్‌లే ఏర్పాటు చేయాలి
    ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం మంజూరు చేసిన నిధులనుంచి పశువులకు నీటి తొట్లు ఏర్పాటు చేయాలి. వాటర్‌ ట్యాంకర్‌ ద్వారా పైపులైన్‌ నీటి సౌకర్యం కల్పించాలి. - ఇన్‌చార్జి ఈఓపీఆర్‌డీ నాగలక్ష్మి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement