వన్యప్రాణుల దాహార్తికి.. వనాల్లో చర్యలు | Forest Department has initiated Drinking water to Animals | Sakshi
Sakshi News home page

వన్యప్రాణుల దాహార్తికి.. వనాల్లో చర్యలు

Published Mon, May 6 2019 4:16 AM | Last Updated on Mon, May 6 2019 4:16 AM

Forest Department has initiated Drinking water to Animals - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వేసవిలో వన్యప్రాణుల దాహం తీర్చేందుకు అటవీశాఖ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అడవులు, అభయారణ్యాల్లో జంతువులు తాగునీటికి ఇబ్బందులు పడకుండా ఈసారి పకడ్బందీ చర్యలు చేపట్టింది. నీటి ఎద్దడి కారణంగా ఏ ఒక్క జంతువూ మరణించకుండా.. తాగునీటి ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఇప్పటికే 50 శాతం వరకు పనులు పూర్తయ్యాయి. ఈ వేసవి ముగిసే లోగా అటవీ జంతువుల తాగునీటి వసతికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అడవుల్లో 75 శాతం ఏర్పాట్లు పూర్తిచేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. వచ్చే ఏడాదికి 100 శాతం తాగునీటిని ఏర్పాటు చేయాలని తెలంగాణ అటవీశాఖ లక్ష్యంగా పెట్టుకుంది.

వేసవి ఉష్ణోగ్రతలు పెరగడంతో...
ఈసారి కూడా ఎండలు దంచికొడుతున్నాయి. ఇప్పటిదాకా గరిష్టంగా 45 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. అటవీ పరిసరాల్లోని వాగులు, వంకలు, కాలువలు ఎండిపోతున్నాయి. దీంతో వాటి పరిసరాల్లో చెలిమెలు తీసేపనిలో ఉన్నారు అటవీ శాఖ అధికారులు. ఇక సహజంగా నీటి వనరులు లేనిచోట సోలార్‌ బోర్‌పంపుల్ని ఏర్పాటు చేస్తున్నారు. వీటిద్వారా అందుబాటులో ఉన్న కుంటల్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఏడాది తెలంగాణవ్యాప్తంగా మొత్తం 153 సోలార్‌ బోరు బావులను వేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఇప్పటిదాకా 100 సోలార్‌ బావులను పూర్తి చేశారు. కీకారణ్యాల్లో చెరువులు, కుంటల్లో పూడిక తీత, ఇసుక నేలలు తోడడం వంటి చర్యలు చేపట్టారు. ఇక మనిషి చేరుకునేందుకు వీలుగా రోడ్డు మార్గాలున్న చోట సాసర్‌పిట్స్‌ ఏర్పాట్లు చేస్తున్నారు. 800 నుంచి 1000 లీటర్ల సామర్థ్యంతో వీటిని నిర్మిస్తున్నారు. ఇందులో నీరు త్వరగా ఇంకిపోకుండా అడుగుభాగాన టార్పిలిన్‌ ఉంచుతున్నారు. వీటిలో ట్యాంకర్ల ద్వారా ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం నీటిని నింపుతున్నారు.  

ఇన్‌ఫ్రారెడ్‌ కెమెరాలతో జంతువుల పరిశీలన..
వేసవిలో జంతువులు అడవి మొత్తంలో నీటి వనరుల వద్దకు తప్పకుండా వస్తాయి. అందుకే, జంతువులు నీళ్లు తాగే చోట ఇన్‌ఫ్రారెడ్‌ కెమెరాలు అమర్చారు. జంతువుల శరీర ఉష్ణోగ్రత కారణంగా.. అవి సమీపంలోకి రాగానే.. యాక్టివ్‌ అయి వీడియోరికార్డింగ్‌ మొదలు పెడతాయి. వీటి ద్వారా రోజుకు ఎన్ని జంతువులు నీరు తాగేందుకు వస్తున్నాయి? వాటి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? సంఖ్యలో పెరుగుదల– తగ్గుదల ఉందా? అన్న విషయాలను ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నారు.  

వేటగాళ్లపై నిఘా ..
ఇవే నీటి వనరుల వద్ద వేటగాళ్ల సంచారం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. అడవిలో అధి కంగా సంచరించే.. అడవి పందులు, దుప్పులు, జింకలు, ఎలుగుబంట్లు, నెమళ్లకు ఉచ్చులు బిగించి వేటగాళ్లు చంపుతున్నారు. వీటితోపాటు అప్పుడప్పుడూ.. పులులు, జాగ్వార్లు కూడా వేటగాళ్ల బారిన పడుతున్నాయి. వీరిపై నిఘా పెంచే చర్యలు చేపడుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement