water wasted
-
‘కడెం’ నీరు వృథా
కడెం: నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్ట్ 15వ నంబరు గేటు కౌంటర్ వెయిట్(గేటుకు అనుసంధానంగా ఉండే భారీ దిమ్మె) మంగళవారం తెల్లవారుజామున విరిగిపోవడంతో నీరు వృథాగా పోతోంది. ప్రాజెక్ట్‌లోకి 13,428 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడంతో ఇరిగేషన్ అధికారులు నీటి విడుదలకు గేటును ఎత్తే క్రమంలో కౌంటర్ వెయిట్ విరిగిపోయింది. వరద గేటు మూసివేసే అవకాశం లేనందున నీరంతా వృథాగా పోతోంది. వెంటనే మరమ్మతులు చేయలేకపోయినా, ఇన్‌ఫ్లో లేకపోయినా ప్రాజెక్ట్ మొత్తం ఖాళీ అయ్యే ప్రమాదం పొంచి ఉంది. అయితే ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం ఉండడంతోపాటు ఇన్‌ఫ్లో వస్తున్నందున ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఎస్ఈ సుశీల్‌కుమార్, ఈఈ విఠల్ తెలిపారు. బుధవారం మెకానికల్ సిబ్బంది వచ్చి మరమ్మతులు చేపడుతారని, ఆయకట్టు రైతులు ఆందోళన చెందవద్దని భరోసానిచ్చారు. ప్రస్తుత నీటిమట్టం 699అడుగులు ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 700(7.603టీఎంసీ) అడుగులు కాగా, ప్రస్తుతం 699.625(7.504టీఎంసీ) అడుగులు ఉందని, 3,461 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందని, వరద గేటు ద్వారా 3,185 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తోందని వెల్లడించారు. ఇదిలా ఉండగా ప్రాజెక్ట్ మొత్తం 18 వరద గేట్లకు గాను గతంలో 2వ నంబర్ గేట్‌కు కౌంటర్ వెయిట్ విరిగినా ఇప్పటికీ వేయలేదు. ఇప్పుడు తాజాగా 15వ నంబర్ గేట్ కౌంటర్ వెయిట్ విరగడంతో మొత్తంగా ఆ రెండింటినీ ఆపరేట్ చేసే పరిస్థితి లేదు. -
లీకేజీ.. టేకిటీజీ
సోమశిల జలాశయంలో రోజూ సుమారు 70 క్యూసెక్కులు వృథా అవుతున్న వైనం లీకేజీ అరికట్టలేక నీటి లెక్కల్లో జిమ్మిక్కులు 70 క్యూసెక్కులు.. రోజూ జిల్లా జలనిధి సోమశిల జలాశయం నుంచి వృథా అవుతున్న నీరు.. వినేందుకు నమ్యశక్యంగా లేకున్నా ఇది నిజం. లీకేజీని అరికట్టాల్సిన అధికారులు అసలు పనిచేయకుండా నీటి గణాంకాల్లో జిమిక్కులు చేస్తున్నారు. సోమశిల : సోమశిల జలాశయం పెన్నార్ డెల్టాకు నాలుగురోజుల క్రితం విడుదల నిలుపుదల చేవారు. అయితే స్లూయిజ్ గేట్ల నుంచి నిరంతరం నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ గేట్ల నుంచి సుమారు 70 క్యూసెక్కుల నీరు ధారాపాతంగా పోతోంది. ఈ విషయం ఉన్నతస్థాయి అధికారుల నుంచి కిందిస్థాయి అధికారుల వరకు తెలిసినా ఏ చర్య తీసుకోలేని దుస్థితి. ఈ స్లూయిజ్ గేట్ల ద్వారా విపరీతంగా లీకేజీ సమస్య ఉంది. గేట్ల వ్యవస్థ ప్రారంభం నుంచే ఈ సమస్య కొనసాగుతూనే ఉంది. చూసేందుకు ఇది చిన్న సమస్యే అయినా అధికారుల చిత్తశుద్ధి లోపం ఉన్నతాధికారుల నిర్లక్ష్యానికి ఇది నిరదర్శంగా ఉంటుంది. దీంతో ప్రతిసంవత్సరం నీరు వృథా అవుతూనే ఉంది. స్లూయిజ్ గేట్లు మరమ్మతులకు గురై సంవత్సరాలు గడిచిచాయి. వాటి నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో రోలర్స్ కూడా మరమ్మతులు గురియ్యాయి. ఈ నేపథ్యంలో గేటు దిగడం గగనమైపోతోంది. దీంతో సుమారు 70 క్యూసెక్కులు ఒక్క రోజులోనే లీకేజీ రూపంలో వృథా అవుతున్నాయి. ఈ తప్పిదాన్ని కప్పిపుచ్చుకునేందుకు అధికారులు ఓ మార్గం అన్వేషించారు. వృథా నీటిని ఆవిరి రూపంలో ఖర్చయ్యే నీటి లెక్కల్లో కలిపి చూపిస్తున్నారు. ఓ వైపు జలాశయం అడుగంటుతోంది. ఇంకా మరో 16 రోజులవరకు రెండో పంటకు నీరివ్వాలి. ఈ విషయాలన్నీ అధికారులకు తెలిసినా మౌనంగానే ఉంటున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం : దేశ్‌నాయక్, ఇన్చార్జి ఈఈ, సోమశిల సోమశిల గేట్ల లీకేజీ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. కొంతమంది నిపుణుల బృందం కూడా వచ్చి పరిశీలించింది. అయినా ఇది దీర్ఘకాలంగా కొనసాగుతున్న సమస్య. ఉన్నతాధికారులు దీనిని పరిశీలించారు. త్వరలోనే లీకేజీ అరికట్టేందుకు శాశ్వత పరిష్కారం మార్గాలకు అన్వేషిస్తున్నారు. -
మంత్రి హెలికాప్టర్ కోసం నీరు వృధా
ముంబై: మహారాష్ట్రలోని లాతూర్‌లో తాగేందుకు కూడా గుక్కెడు నీళ్లు దొరక్క ప్రజలు అలమటిస్తుంటే అక్కడ ఓ రాష్ట్ర మంత్రిగారి హెలికాప్టర్ దిగేందుకు అధికారులు ఏకంగా 10 వేల లీటర్ల నీటిని వినియోగించడం వివాదాస్పదమైంది. కరవు కాటకాలను ఎదుర్కొనేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో సమీక్షించడానికి వచ్చిన రెవెన్యూ మంత్రి ఎక్నాథ్ ఖడ్సే హెలికాప్టర్ కోసమే నీటిని దుర్వినియోగం చేయడం పెద్ద ఐరనీ. లాతూర్ జిల్లాలోని బెల్కుండ్ గ్రామానికి శుక్రవారం మంత్రి వచ్చినప్పుడు ఈ ఉదంతం చోటుచేసుకుంది. హెలికాప్టర్ వల్ల దుమ్మురేగకుండా ఉండడం కోసమే తాము నీటితో నేలను తడిపామని అధికారులు సమర్థించుకుంటున్నారు. నీళ్లతో హెలిపాడ్‌ను తడపకపోయినట్లయితే దుమ్మురేగి చుట్టుపక్కలున్న ప్రజలకు, హెలికాప్టర్ పెలైట్‌కు బ్రీతింగ్ సమస్యలు వచ్చేవని, పైగా ఆ సమయంలో మంత్రి కూడా అనారోగ్యంతో బాధ పడుతున్నారని బీజేపీ అధికార ప్రతినిధి ఎన్సీ షైనా వివరణ ఇచ్చారు. ఇది చిన్న విషయమని, పెద్దిదిచేసి చూపించవద్దని ఆయన మీడియాకు విజ్ఞప్తి చేశారు. కరవు కాటకాలతో అల్లాడిపోతున్న లాతూరు ప్రాంతానికి ఇటీవలనే ముంబై నుంచి ఐదు లక్షల లీటర్ల మంచినీటిని రైలులో సరఫరా చేసిన విషయం తెల్సిందే. నీటి ఎద్దడి కారణంగానే మహారాష్ట్రలో తదుపరి ఐపీఎల్ మ్యాచ్‌లను బాంబే హైకోర్టు రద్దు చేసిన విషయం తెల్సిందే. మంత్రి ఏక్నాథ్ చర్య అసమంజసమని, ఇలా నీటిని వృధా చేయడానికి బదులు ఆయన రోడ్డు మార్గాన వెళ్లి ఉండాల్సిందని కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ వ్యాఖ్యానించారు. అంతలా హెలికాప్టర్లో వెళ్లాలనుకుంటే లాతూర్ హెలిపాడ్ 47 కిలోమీటర్ల దూరంలోనే ఉందని, అక్కడ దిగి, అక్కడి నుంచి రోడ్డు మార్గాన వెళ్లాల్సిందని ఆయన విమర్శించారు.