మరింత తగ్గిన టోకు ధరలు
2014 మార్చితో పోల్చితే 2015 మార్చిలో
ధరలు అసలు పెరక్కపోగా -2.33% తగ్గుదల
ఇదే తీరున ఉన్న ఆహారేతర వస్తువులు,
ఇంధనం-విద్యుత్, తయారీ రంగాల ఎఫెక్ట్
వరుసగా ఐదు నెలల నుంచీ ఇదే ధోరణి...
మళ్లీ ఆర్బీఐ రేట్ల కోత ‘కోరికలు’
న్యూఢిల్లీ: మార్చిలో టోకు ధరలు వార్షిక ప్రతిపదికన మరింత తగ్గాయి. 2014 మార్చితో పోల్చితే 2015 మార్చిలో ధరలు అసలు పెరక్కపోగా -2.33 శాతం తగ్గుదల కనిపించింది (ప్రతి ద్రవ్యోల్బణం). టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణంలో ప్రధానమైన తయారీ, ఇంధనం-విద్యుత్, ఆహారేతర వస్తువుల విభాగాల ధోరణి కూడా ఇదే తీరున క్షీణతలో (మైసస్)లో ఉంది. వరుసగా ఐదు నెలల నుంచీ టోకు ద్రవ్యోల్బణం తగ్గుతూ వస్తోంది. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిల్లో వరుసగా ద్రవ్యోల్బణం -0.17 శాతం, -0.50 శాతం, -0.39 శాతం, -2.06 శాతంగా ఉంది. కాగా 2014 మార్చి నెలలో టోకు ద్రవ్యోల్బణం 6 శాతం. అంటే 2013 మార్చితో పోల్చితే 2014 మార్చిలో టోకున ధరలు 6 శాతం పెరిగాయన్నమాట. బుధవారం కేంద్రం తాజా గణాంకాలను విడుదల చేసింది.
విభాగాల వారీగా చూస్తే...
ఆహార, ఆహారేతర ఉత్పత్తులతో కూడిన ప్రైమరీ ఆర్టికల్స్‌లో ద్రవ్యోల్బణం రేటు వార్షిక ప్రాతిపదికన మార్చిలో 7.31 శాతం నుంచి 0.08 శాతానికి తగ్గింది. ఇందులో ఆహార ఉత్పత్తుల ధరల పెరుగుదల రేటు 9.57 శాతం నుంచి 6.31 శాతానికి దిగివచ్చింది. ఆహారేతర ఉత్పత్తుల ధరలు మాత్రం 4.87 శాతం పెరుగుదల నుంచి -7.12 శాతం క్షీణతలోకి జారిపోయాయి.ఇంధనం-విద్యుత్ విభాగంలో కూడా ద్రవ్యోల్బణం 4.87 శాతం నుంచి - 7.12 శాతం ప్రతి ద్రవ్యోల్బణం (క్షీణత)లోకి పడింది.సూచీలో దాదాపు 65 శాతానికి పైగా వెయిటేజ్ కలిగిన తయారీ రంగం కూడా 3.70 శాతం ద్రవ్యోల్బణం స్థాయి నుంచి -0.19 శాతం ప్రతి ద్రవ్యోల్బణం (క్షీణత) బాటలోకి మళ్లింది.
పరిశ్రమల ‘వడ్డీరేట్ల’ కోత ఆశ...
తాజా పరిణామం పారిశ్రామిక వర్గాలకు మళ్లీ ఆర్బీఐ పాలసీ రేట్ల కోత ఆశలు పుట్టించింది. రెపో రేటును (ప్రస్తుతం 7.5%) మరికొంత తగ్గించడానికి ఇది తగిన సమయమని వారు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఈ ఏడాది రెండు దఫాలుగా రెపోరేటును అరశాతం తగ్గించిన ఆర్బీఐ, ఏప్రిల్ 7 పాలసీ సందర్భంగా.. తొలుత ఈ ప్రయోజనాన్ని (అంతక్రితం తగ్గించిన రెపో రేటు ప్రయోజనం) కస్టమర్లకు బదలాయించాలని బ్యాంకింగ్‌కు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీనితో ఇప్పటికే ఈ దిశలో పలు బ్యాంకింగ్ దిగ్గజాలు నిర్ణయాలు తీసుకున్నాయి. మరికొన్ని బ్యాంకులు ఈ దిశలో ఉన్నాయి.
ప్రస్తుత తరుణంలో వడ్డీరేట్లు మరింత తగ్గడం వల్ల వినియోగ విశ్వాస పునరుద్ధరణ జరుగుతుందని, పెట్టుబడులు పెరుగుతాయని వెరసి వృద్ధి మరింత పటిష్టమవుతుందని పారిశ్రామిక వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇది ఇక పూర్తిగా వృద్ధిపై దృష్టి సారించాల్సిన తరుణమని అసోచామ్ ప్రెసిడెంట్ రాణా కపూర్ అన్నారు. ఆహార ఉత్పత్తుల టోకు ధరలు మార్చిలో 6.31 శాతం పెరిగిన విషయాన్ని ఫిక్కీ ప్రెసిడెంట్ జోత్స్నా ప్రస్తావిస్తూ, ఈ ధోరణిని అరికట్టడానికి సరఫరాల వైపు సమస్యల పరిష్కారం తక్షణ అవసరమని అన్నారు.