ఖాదీప్యమానం!
అర్ధరాత్రి ఒక్కసారిగా దీపాలన్నీ వెలిగినట్లు... పెద్ద కాంతితో వచ్చేసింది స్వాతంత్య్రం! ఆ వేళ ఇద్దరే ఇద్దరు విశ్వరూపమైపజ్వరిల్లారు. ఒకరు గాంధీ, ఇంకొకరు... గాంధీ తర్వాత గాంధీ అంతటి... ‘ఖాదీ’! ‘క్విట్ ఇండియా’ అని సమర వీరులు కళ్లురిమితే... ‘వియ్ డోన్ట్ వాంట్’ అని... విదేశీ వస్త్రాలను విసిరికొట్టారు ఖాదీ యోధులు. జాతీయ ఉద్యమంలో ఒక ఆయుధం... ఖాదీ. జాతీయ పతాకపు వర్ణాలకు ప్రాణాధారం... ఖాదీ. భరతజాతికి ఆత్మగౌరవం... ఖాదీ. ఆగస్ట్ 15 వచ్చేస్తోంది. ‘బ్రాండెడ్’లను కొక్కేనికి తగిలించి, మన సొంత బ్రాండ్‌తో సెల్యూట్ కొట్టేందుకు ‘ముస్తాబు’ అవండి. ఖాదీని కట్టినంత కాలం... భారత్ దేదీప్యమానం!
కర్షకుడి కృషితో పండిన పత్తిని చేనేత కార్మికుడు చరఖాపై వడికి, దారం తీసి, మగ్గం మీద నేయగా వచ్చిన వస్త్రం.. ఖాదీ! భారతీయ ఆత్మను ప్రతిబింబిస్తూ దేశభక్తిని పెంపొందింపజేసే లక్షణాలను పుష్కలంగా మూటగట్టుకొని నేటి యువత కోసం ఎదురుచూస్తున్నది ఖాదీ!!
మన ఆత్మగౌరవ పతాక!
‘ఏ దేశంలోనైనా హస్తకళలు, కుటీర పరిశ్రమల అభివృద్ధి తగినంతగా లేదంటే ఆ దేశ పౌరుల్లో తెలివి, ఆ దేశంలో సంపద లేనట్టే! దిగుమతి అయ్యే వస్తువులను బట్టి చూస్తే ఆ దేశపౌరుల సోమరితనం, పరాన్నజీవితాన్ని గడుపుతుండటం సులువుగా గ్రహించవచ్చు’ అనేది గాంధీజీ అభిప్రాయం. అందుకే స్వాతంత్రోద్యమ కాలంలో మహాత్మాగాంధీ విదేశీ వస్తువులను బహిష్కరించి, స్వదేశీ వస్తువుల తయారీని ప్రోత్సహించారు. ఇందులో భాగంగా తానే స్వయంగా నూలు వడికి, ఖాదీ వస్త్రాన్ని తయారుచేసేవారు.
ఖాదీ ఎందుకు ధరించాలంటే!
ఖాదీ దుస్తులు ఇచ్చే హుందాతనాన్ని ఇతర వస్త్రాలు ఇవ్వలేవు ఖాదీ వస్త్రాన్ని తయారుచేసే చేనేతకార్మికుడికి సహాయపడటం సామాజిక బాధ్యత చర్మానికి రక్షణగా, ఆరోగ్యదాయకంగా ఉండే ఖాదీ, సింథటిక్ మెటీరియల్ వల్ల చర్మానికి కలిగే హానిని నివారిస్తుంది పర్యావరణ సమతుల్యతను కాపాడే సుగుణాల గని ఖాదీ!
మన దేశ ఆత్మగౌరవ పతాకను ఎగురవేసే బాధ్యత మనలో ప్రతి ఒక్కరి భుజాల మీద ఉన్నదన్న విషయం మరవద్దు. ప్రతిరోజూ ఖాదీని ధరిద్దాం. స్వాతంత్య్ర దినోత్సవ వేళ మన ఘనతను మరింతగా నలుదిశలా చాటుదాం.
జైహింద్! జై ఖాదీ!
- నిర్మలారెడ్డి
సాక్షి ఫీచర్స్ ప్రతినిధి