Wearable Section
-
భారత కంపెనీల జోరు..! బొక్కబోర్లపడ్డ చైనా..!
భారత కంపెనీలు ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్ విషయంలో జోరును కొనసాగిస్తున్నాయి. స్మార్ట్‌వాచ్, బ్లూటూత్ ఇయర్ బడ్స్ ఇతర ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్ విషయంలో స్వదేశీ కంపెనీలు దుమ్మురేపుతున్నాయి. భారత మార్కెట్లలో చైనా కంపెనీలు మాత్రం బొక్కబోర్ల పడ్డాయి. గణనీయమైన వృద్ధి..! మార్కెట్ ట్రాకర్ల డేటా ప్రకారం..2021లో స్మార్ట్‌వాచ్, బ్లూటూత్ ఇయర్‌బడ్ మార్కెట్లలో బోట్, ఫైర్‌బోల్ట్, నాయిస్ లాంటి భారతీయ బ్రాండ్లు 75 శాతం కంటే ఎక్కువ వాటాను కలిగి ఉన్నాయి. వెరబుల్ గాడ్జెట్స్‌లో చైనీస్ బ్రాండ్లు మాత్రం శాసించలేకపోయాయి. స్మార్ట్‌వాచ్, టీడబ్ల్యూఎస్ బ్లూటూత్ ఇయర్‌బడ్స్ అమ్మకాలు సంవత్సరానికి 280శాతం పెరిగాయి. మార్కెట్ ట్రాకర్ ప్రకారం స్మార్ట్‌వాచ్ విభాగంలో బోట్, నాయిస్, ఫైర్‌బోల్ట్ వాల్యూమ్ ఆధారంగా మార్కెట్లో 66 శాతం వాటాతో మొదటి మూడు కంపెనీలుగా అవతరించాయి. ఈ విభాగంలో భారతీయ బ్రాండ్లు 2021లో చైనీస్ కంపెనీల గ్రోత్ రేట్ 17 శాతంతో పోల్చితే స్వదేశీ కంపెనీలు భారీగా 76 శాతం వృద్ధి రేటును నమోదు చేశాయి. తక్కువ ధరలో..ఎండోర్స్మెంట్లో దూకుడు..! వెరబుల్స్ గాడ్జెట్స్‌ను భారత స్వదేశీ కంపెనీలు తక్కువ ధరలో అందించాయి. దీంతో కొనుగోలుదారులు వీటిపైనే ఎక్కువగా మొగ్గుచూపారు. తక్కువ ధరలే కాకుండా దిగ్గజ నటులతో ఎండోర్స్మెంట్ చేస్తూ మార్కెట్లో సత్తా చాటాయి. సెలబ్రిటీ ఎండార్స్మెంట్లు, పరిచయ ధర పథకాలు, తగ్గింపు ఆఫర్లు, సరసమైన ఫీచర్-రిచ్ పరికరాలు, కొత్త లాంచ్‌ల ఫ్రీక్వెన్సీని పెంచడం వంటి వ్యూహాలు భారతీయ బ్రాండ్లకు బాగా పనిచేశాయని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ సీనియర్ విశ్లేషకుడు అన్షికా జైన్ అన్నారు. Ptron, Mivi, Boult Audio వంటి ఇతర స్థానిక బ్రాండ్లు తమ పోర్ట్‌ఫోలియోను తక్కువ-ధర విభాగంలో విస్తరించాయి.ఇవి కస్టమర్ల నుంచి సానుకూల స్పందనను పొందాయి. స్మార్ట్‌ఫోన్ రంగంలో మాత్రం చైనానే టాప్‌గా..! వెరబుల్ సెక్టార్లో భారత కంపెనీలు టాప్‌లో నిలిచిన స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో చైనా కంపెనీలే టాప్ ప్లేస్‌లో నిలిచాయి. భారత స్మార్ట్‌ఫోన్ కంపెనీలు చైనా కంపెనీలను అందుకోలేకపోయాయి. చైనా కంపెనీలు స్మార్ట్‌ఫోన్స్ విభాగంలో కొత్త వెర్షన్ స్మార్ట్‌ఫోన్ విభాగాలను తెస్తూ ముందున్నాయి. చదవండి: అతి తక్కువ ధరలకే వస్తువులను అందించే నాప్టాల్ సంచలన నిర్ణయం..! -
చేతికి స్మార్ట్‌వాచ్, చెవిలో ఇయర్ బడ్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్మార్ట్‌వాచెస్, ఇయర్‌బడ్స్ వంటి వేరబుల్స్ వినియోగం భారత్‌లో అనూహ్యంగా అధికమవుతోంది. ఈ ఏడాది జూలై-సెప్టెంబరు కాలంలో దేశవ్యాప్తంగా 1.18 కోట్ల యూనిట్ల వేరబుల్స్ అమ్ముడయ్యాయని ఐడీసీ వెల్లడించింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 165 శాతం వృద్ధి. ఇందులో ఇయర్‌వేర్ విభాగంలో 39.7 శాతం వాటా ఉన్న ట్రూ వైర్లెస్ స్టీరియో (ఇయర్‌బడ్స్) 40 లక్షల యూనిట్లు విక్రయమయ్యాయి. క్రితం సంవత్సరంతో పోలిస్తే ఇది 1,156.3 శాతం పెరుగుదల. ధరలు తగ్గుముఖం పడుతుండడమూ వేరబుల్స్ సేల్స్ దూకుడుకు కారణం అవుతోంది. 2019 సెప్టెంబరు త్రైమాసికంతో పోలిస్తే స్మార్ట్ వాచ్ సగటు ధర రూ.13,125 నుంచి రూ.8,325లకు వచ్చి చేరింది. అలాగే ఇయర్‌బడ్స్ ధర 48 శాతం తగ్గి రూ.4,275లకు వచ్చింది. అందుబాటు ధరలో.. మహమ్మారి విస్తృతి నేపథ్యంలో ఆన్లైన్ విద్య, తరగతులు, వర్క్ ఫ్రం హోమ్, వర్చువల్ సమావేశాలు, వినోదానికి సమయం కేటాయించడం వంటి అంశాలూ అమ్మకాల వృద్ధికి దోహదం చేశాయని ఐడీసీ ప్రతినిధి అనిశా డుంబ్రే తెలిపారు. ట్రెండ్‌ను తయారీ సంస్థలు క్యాష్ చేసుకుంటున్నాయని చెప్పారు. డిమాండ్ పెరిగిన నేపథ్యంలో అందుబాటు ధరలో వేరబుల్స్‌ను కంపెనీలు ప్రవేశపెడుతున్నాయి. వైర్లెస్ డివైసెస్‌కు డిమాండ్ పెరగడంతో ఇయర్ వేర్ విభాగం 260.5 శాతం వృద్ధిని సాధించింది. ఇప్పటి వరకు ఇదే ఆల్ టైం హైగా చెప్పవచ్చు. ఈ విభాగంలో 32.4 శాతం వాటాతో బోట్ ముందు వరుసలో ఉంది. వన్ ప్లస్, వివో, ఇన్ఫినిక్స్ వంటి కంపెనీల ఎంట్రీ కూడా అమ్మకాలకు బూస్ట్‌నిచ్చిందని కౌంటర్‌పాయింట్ తెలిపింది. రిస్ట్ బ్యాండ్స్ విభాగంలో 52.4 శాతం వాటాతో షావొమీ అగ్ర స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానంలో 14.6 శాతం వాటాతో రియల్మీ పోటీ పడుతోంది. భారత్‌లో రికార్డు స్థాయిలో స్మార్ట్ వాచెస్ అమ్ముడయ్యాయి. ఈ సెగ్మెంట్లో భారత బ్రాండ్ నాయిస్ 28.5 శాతం వాటాతో దూసుకెళ్తోంది. 24.2 శాతం వాటాతో రియల్మీ రెండవ స్థానంలో ఉంది. (భగ్గుమంటున్న కూరగాయల ధరలు) స్మార్ట్ వాచెస్ వైపు.. కస్టమర్లు అధునాతన వేరబుల్స్ వైపు మళ్లుతున్నారు. దీంతో రిస్ట్ బ్యాండ్స్‌కు బదులుగా స్మార్ట్ వాచెస్ కొనుగోలు చేస్తున్నారని ఐడీసీ తెలిపింది. తొలి అర్ధ సంవత్సరంలో తగ్గుదల చవిచూసిన రిస్ట్ బ్యాండ్స్ అమ్మకాలు.. ఈ ఏడాది జూన్ త్రైమాసికంతో పోలిస్తే సెప్టెంబరు క్వార్టర్లో 83.3 శాతం పెరిగాయి. గతేడాది జూలై-సెప్టెంబరుతో పోల్చి చూస్తే 2020 మూడవ త్రైమాసికంలో 20.3 శాతం క్షీణించాయి. వాచెస్ విభాగం గతేడాదితో పోలిస్తే 119.9 శాతం వృద్ధితో సెప్టెంబరు క్వార్టర్లో 7,78,000 యూనిట్లు అమ్ముడయ్యాయి. స్మార్ట్ వాచెస్ భారత్‌లో ఎంట్రీ ఇచ్చిన తరువాత ఒక త్రైమాసికంలో ఈ స్థాయిలో అమ్ముడవడం ఇదే తొలిసారి. భారత వేరబుల్స్ విపణిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాటా 6-8 శాతం ఉంటుందని కనెక్ట్ గ్యాడ్జెట్స్ సీవోవో ప్రదీప్ యెర్రగుంట్ల తెలిపారు. -
వేరబుల్ విభాగంలోకి ఫాజిల్ గ్రూప్
న్యూఢిల్లీ, సాక్షి ప్రతినిధి: అమెరికన్ లగ్జరీ వాచ్‌లు, ఫ్యాషన్ యాక్ససరీస్ల కంపెనీ ఫాజిల్... వేరబుల్ డివెజైస్ విభాగంలోకి పెద్ద ఎత్తున వస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే కంపెనీ మిస్ ఫిట్ బ్రాండ్‌ను కొనుగోలు చేసింది. మిస్ఫిట్ తాలూకు వేరబుల్ డివెజైస్ ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్నాయి కూడా. దీంతో పాటు మైకేల్ కోర్, స్కాగెన్, ఎంపోరియో అర్మానీ, చాప్స్ బ్రాండ్లు కూడా ఫాజిల్ చేతిలోనే ఉన్నాయి. ఈ బ్రాండ్లు అన్నిటినుంచీ త్వరలో వేరబుల్ డివెజైస్ మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ఫాజిల్ గ్రూప్ ఏసియా పసిఫిక్ విభాగ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జాక్ క్విన్లాన్ ప్రకటించారు. బుధవారమిక్కడ జరిగిన కార్యక్రమంలో ఈ వేరబుల్ డివెజైస్ అన్నిటినీ ప్రదర్శించారు కూడా. ఏసియా పసిఫిక్ ప్రాంతంలో తాము ఏటా 40 శాతం కాంపౌండింగ్ వృద్ధిని సాధిస్తున్నట్లు క్విన్లాన్ తెలియజేశారు. ‘‘తమ చేతికి ధరించే వస్తువు కేవలం సమయాన్ని చూపించటమే కాక మరిన్ని చేయాలని కస్టమర్లు కోరుకుంటున్నారు. పెపైచ్చు అది చాలా వైవిధ్యంగా ఉండాలనుకుంటున్నారు. ఆ సెగ్మెంట్‌ను లక్ష్యంగా చేసుకునే మేం ఈ మార్కెట్లోకి పెద్ద ఎత్తున ప్రవేశిస్తున్నాం’’ అని కంపెనీ కనెక్టింగ్ డివెజైస్ విభాగ సీటీఓ సొన్నీ వ్యూ చెప్పారు. ఇండియాలో ప్రస్తుతం ఫాజిల్‌కు 400 స్టోర్లున్నాయని, ఆసియాలో జపాన్ తరవాత ఇండియానే అతిపెద్ద మార్కెట్ అని ఫాజిల్ గ్రూప్ ఇండియా ఎండీ వసంత్ నంగియా చెప్పారు. 2020 నాటికి వాచ్‌ల అమ్మకాలను వేరబుల్ డివెజైస్ మించిపోతాయని అంచనా వేస్తున్నట్లు తెలియజేశారు. వేరబుల్ డివెజైస్‌తో ఎన్ని కేలరీస్, దూరం, నిద్ర వంటి పలు అంశాలను ఆటోమేటిక్‌గా ట్రాక్ చేయొచ్చని చెప్పారాయన. ప్రస్తుతం మిస్ఫిట్ బ్రాండ్ కింద లభిస్తున్న డివెజైస్ ప్రారంభ ధర రూ.7,495గా ఉంది. కంపెనీ ఫాజిల్ క్యూ బ్రాండ్ కింద వండర్, మార్షల్ అనే రెండు స్మార్ట్‌వాచ్‌లను మార్కెట్లోకి తెచ్చింది. వీటి ప్రారంభ ధర రూ. 21,995గా ఉంది. ఇక మైకేల్ కోర్, స్కాగెన్, ఎంపోరియో అర్మానీ, చాప్స్ బ్రాండ్లలో హైబ్రిడ్ స్మార్ట్‌వాచ్‌ల ధరలు రూ.9,995-రూ.29,495 శ్రేణిలో ఉన్నాయి.