హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్మార్ట్‌వాచెస్, ఇయర్‌బడ్స్ వంటి వేరబుల్స్ వినియోగం భారత్‌లో అనూహ్యంగా అధికమవుతోంది. ఈ ఏడాది జూలై-సెప్టెంబరు కాలంలో దేశవ్యాప్తంగా 1.18 కోట్ల యూనిట్ల వేరబుల్స్ అమ్ముడయ్యాయని ఐడీసీ వెల్లడించింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 165 శాతం వృద్ధి. ఇందులో ఇయర్‌వేర్ విభాగంలో 39.7 శాతం వాటా ఉన్న ట్రూ వైర్‌లెస్ స్టీరియో (ఇయర్‌బడ్స్) 40 లక్షల యూనిట్లు విక్రయమయ్యాయి. క్రితం సంవత్సరంతో పోలిస్తే ఇది 1,156.3 శాతం పెరుగుదల. ధరలు తగ్గుముఖం పడుతుండడమూ వేరబుల్స్ సేల్స్ దూకుడుకు కారణం అవుతోంది. 2019 సెప్టెంబరు త్రైమాసికంతో పోలిస్తే స్మార్ట్ వాచ్ సగటు ధర రూ.13,125 నుంచి రూ.8,325లకు వచ్చి చేరింది. అలాగే ఇయర్‌బడ్స్ ధర 48 శాతం తగ్గి రూ.4,275లకు వచ్చింది.
అందుబాటు ధరలో..
మహమ్మారి విస్తృతి నేపథ్యంలో ఆన్‌లైన్ విద్య, తరగతులు, వర్క్ ఫ్రం హోమ్, వర్చువల్ సమావేశాలు, వినోదానికి సమయం కేటాయించడం వంటి అంశాలూ అమ్మకాల వృద్ధికి దోహదం చేశాయని ఐడీసీ ప్రతినిధి అనిశా డుంబ్రే తెలిపారు. ట్రెండ్‌ను తయారీ సంస్థలు క్యాష్ చేసుకుంటున్నాయని చెప్పారు. డిమాండ్ పెరిగిన నేపథ్యంలో అందుబాటు ధరలో వేరబుల్స్‌ను కంపెనీలు ప్రవేశపెడుతున్నాయి. వైర్‌లెస్ డివైసెస్‌కు డిమాండ్ పెరగడంతో ఇయర్ వేర్ విభాగం 260.5 శాతం వృద్ధిని సాధించింది. ఇప్పటి వరకు ఇదే ఆల్ టైం హైగా చెప్పవచ్చు.
ఈ విభాగంలో 32.4 శాతం వాటాతో బోట్ ముందు వరుసలో ఉంది. వన్ ప్లస్, వివో, ఇన్‌ఫినిక్స్ వంటి కంపెనీల ఎంట్రీ కూడా అమ్మకాలకు బూస్ట్‌నిచ్చిందని కౌంటర్‌పాయింట్ తెలిపింది. రిస్ట్ బ్యాండ్స్ విభాగంలో 52.4 శాతం వాటాతో షావొమీ అగ్ర స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానంలో 14.6 శాతం వాటాతో రియల్‌మీ పోటీ పడుతోంది. భారత్‌లో రికార్డు స్థాయిలో స్మార్ట్ వాచెస్ అమ్ముడయ్యాయి. ఈ సెగ్మెంట్లో భారత బ్రాండ్ నాయిస్ 28.5 శాతం వాటాతో దూసుకెళ్తోంది. 24.2 శాతం వాటాతో రియల్‌మీ రెండవ స్థానంలో ఉంది. (భగ్గుమంటున్న కూరగాయల ధరలు)
స్మార్ట్ వాచెస్ వైపు..
కస్టమర్లు అధునాతన వేరబుల్స్ వైపు మళ్లుతున్నారు. దీంతో రిస్ట్ బ్యాండ్స్‌కు బదులుగా స్మార్ట్ వాచెస్ కొనుగోలు చేస్తున్నారని ఐడీసీ తెలిపింది. తొలి అర్ధ సంవత్సరంలో తగ్గుదల చవిచూసిన రిస్ట్ బ్యాండ్స్ అమ్మకాలు.. ఈ ఏడాది జూన్ త్రైమాసికంతో పోలిస్తే సెప్టెంబరు క్వార్టర్‌లో 83.3 శాతం పెరిగాయి. గతేడాది జూలై-సెప్టెంబరుతో పోల్చి చూస్తే 2020 మూడవ త్రైమాసికంలో 20.3 శాతం క్షీణించాయి. వాచెస్ విభాగం గతేడాదితో పోలిస్తే 119.9 శాతం వృద్ధితో సెప్టెంబరు క్వార్టర్‌లో 7,78,000 యూనిట్లు అమ్ముడయ్యాయి. స్మార్ట్ వాచెస్ భారత్‌లో ఎంట్రీ ఇచ్చిన తరువాత ఒక త్రైమాసికంలో ఈ స్థాయిలో అమ్ముడవడం ఇదే తొలిసారి. భారత వేరబుల్స్ విపణిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాటా 6-8 శాతం ఉంటుందని కనెక్ట్ గ్యాడ్జెట్స్ సీవోవో ప్రదీప్ యెర్రగుంట్ల తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment