మగ్గాలు, కార్లు తిరిగివ్వండి
చేనేత సహకార సంఘానికి హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: బాలాజీ మిక్స్డ్ ఫ్యాబ్రిక్స్ హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించిన 6 మగ్గాలు, 2 కార్లను 3 రోజుల్లో వారికి అప్పగించాలని తెలంగాణ చేనేత సహకార సంఘం అధికారుల్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ షమీమ్ అక్తర్‌ల ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం 9వ షెడ్యూల్లో ఉన్న ఆప్కో కార్యాలయం ఆస్తులు, అప్పుల విభజన కొలిక్కి రాకముందే కార్యాలయాన్ని తెలంగాణ ప్రభుత్వం సీజ్ చేసిందని..అందులో ఉన్న తమ మగ్గాలు, కార్లను ఇప్పించాలంటూ బాలాజీ మిక్స్డ్ ఫ్యాబ్రిక్స్ హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ దాఖలు చేసిన పిటిషన్‌ను సింగిల్ జడ్జి విచారించారు.
సంబంధిత అధికారులకు వినతిపత్రం ఇవ్వాలని, దానిపై నిర్ణయం తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ పిటిషనర్ దాఖలు చేసిన అప్పీల్‌ను ధర్మాసనం సోమవారం విచారించగా.. పిటిషనర్‌కు చెందిన చేనేత మగ్గాలు, కార్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ప్రభుత్వం తరఫున స్పెష ల్ జీపీ మహేందర్‌రెడ్డి కోర్టుకు నివేదించారు. విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం...మూడు రోజుల్లో పిటిషనర్‌కు వాటిని అప్పగించాలని ఆదేశించింది.