weekly market
-
తీరొక్క సంతసం
సాక్షి, కామారెడ్డి: వారమైందంటే.. వారి మనసంతా సంతపైనే! ఆన్లైన్లో ఆర్డరిస్తే తమకు కావాల్సిన వస్తువులు ఇంటిముందు వాలే ఈ కాలంలోనూ అంగడికి ఆదరణ తగ్గలేదు. తీరొక్క వస్తువులకు ముచ్చటైన నెలవు అది. సరుకులు, బట్టలు, చిన్న, పెద్ద వస్తువులు, కూరగాయలు, పశువులు, మేకలు... ఇలా అన్ని రకాలు అక్కడ లభిస్తాయి. ‘అంగడికి పోయి గొంగడి తెస్త ’అన్న సామెత కూడా అట్ల పుట్టిందే. అయితే, ఇప్పుడు స్పెషల్ సంతలు వచ్చేశాయి. కామారెడ్డి అంగడి వాహనాలకు ప్రసిద్ధి. నవీపేట మేకలకు కేరాఫ్‌గా మారింది. బిచ్కుంద పప్పుదినుసులకు ఫేమస్. పిట్లం తలుపుచెక్కల పొట్లంగా మారింది. మద్నూర్ ఎలక్ట్రానిక్ పరికరాలు.. ఇలా పలు చోట్ల ఒక్కోరకం వస్తువుకు ఒక్కో రకం అంగడి నిర్వహిస్తున్నారు. ప్రజల మధ్య ఆత్మీయతకు అంగడి వేదికగా కూడా ఉంటోంది. చుట్టాలు, స్నేహితులు అంగట్లో కలుసుకుంటారు. కష్టసుఖాలు కలబోసుకుంటారు. వారానికోసారి జరిగే అంగడికి తప్పనిసరిగా వెళ్లేవారు చాలామంది ఉంటారు. ఇప్పుడు జనం అవసరాల మేరకు వారంలో రోజుకో చోట అంగడి సాగుతోంది. తలుపుచెక్కలకు కేరాఫ్ పిట్లం కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో నిర్వహించే అంగడి.. ఇంటి దర్వాజాలకు బిగించే తలుపు చెక్కలకు స్పెషల్. వేప, మామిడి చెక్కలు ఇక్కడ లభిస్తాయి. పిట్లం మండలంతోపాటు పొరుగున ఉన్న సంగారెడ్డి జిల్లా నుంచి కూడా ప్రజలు తరలివచ్చి చెక్కలు కొనుగోలు చేస్తుంటారు. కామారెడ్డిలో వాహనాల అంగడి జిల్లా కేంద్రమైన కామారెడ్డి పట్టణంలో కొన్ని దశాబ్దాలుగా ప్రతి గురువారం సాధారణ అంగడి సాగుతోంది. అయి తే, ఇక్కడ ఐదారేళ్లుగా ప్రత్యేకంగా బైకుల అంగడి కూడా సాగుతోంది. కొత్త బస్టాండ్ సమీపంలోని సీఎస్ఐ చర్చి గ్రౌండ్లో ప్రతి గురువారం సెకండ్ హ్యాండ్ బైకుల అంగడి నిర్వహిస్తున్నారు. బాబా అనే ఒక వ్యక్తి ప్రారంభించిన బైకుల అంగడి ప్రతివారం నిరాటంకంగా కొనసాగుతోంది. బైకులతోపాటు కార్లు, ట్రాక్టర్లు, వ్యాన్లు, ఆటోలు కూడా అమ్ముతున్నారు. నవీపేట మేకల సంత నిజామాబాద్ జిల్లా నవీపేట మండల కేంద్రంలో ప్రతి శుక్రవారం మేకల సంత సాగుతోంది. వారంవారం రూ.కోట్లలో వ్యాపారం నడుస్తోంది. మేకల కొనుగోలుకు రాష్ట్రంలోని ఇతర జిల్లాలతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక ప్రాం తాల నుంచి కూడా చాలామంది ఇక్కడికి వస్తుంటారు. పప్పుదినుసులకు ఫేమస్ బిచ్కుంద కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో బుధవారం నిర్వహించే అంగడిలో పప్పుదినుసుల అమ్మకాలు జోరుగా సాగుతాయి. పెసర్లు, బబ్బెర్లు, కందులు, శనగలతోపాటు జొన్నలు, గోధుమలు కూడా భారీగా అమ్ముడవుతాయి. చుట్టుపక్కల మండలాల నుంచి పప్పుదినుసుల కోసం వస్తుంటారు. మద్నూర్ అంగట్లో ఎలక్ట్రానిక్ ఉపకరణాలు కామారెడ్డి జిల్లాలో మారుమూలన మహారాష్ట్రకు సరిహద్దుల్లో ఉన్న మద్నూర్ అంగడి ఎలక్ట్రానిక్ ఉపకరణాల అమ్మకాలకు పెట్టింది పేరు. ఇక్కడ విరివిగా ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, సామగ్రి విక్రయిస్తారు. ఇతర ప్రాంతాల నుంచి కొందరు వ్యాపారులు వచ్చి ఫ్యాన్లు, కూలర్లు, స్పీకర్లు, డెక్కులు, మిక్సీలు, గ్రైండర్లు, మైకులు విక్రయిస్తారు. బైకులపై ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకువచ్చి అంగట్లో విక్రయిస్తుంటారు. ధరలు కూడా అందుబాటులో ఉండటంతో వీటి అమ్మకాలకు ఆదరణ కూడా బాగానే ఉంటుంది. -
‘కార్తె’ వచ్చింది..పండుగ తెచ్చింది
నిజామాబాద్‌కల్చరల్/నిజామాబాద్‌సిటీ, న్యూస్‌లైన్ : మృగశిర కర్తె రాకతో వర్షాకాలం ప్రారంభమైంది. ఈ సందర్భాన్ని ప్రజలు ‘మిరుగు’గా జరుపుకున్నారు. ఆదివారం కలిసి రావడంతో జిల్లా అంతటా పండుగ వాతావరణం నెలకొంది. మామిడిపండ్ల పానకం, పూరీలు, ఆట్లు, చేపల కర్రీలు చేసుకున్నారు. మిరుగు సందర్భంగా చేపలు తినాలన్న ఆచారం ఉండడంతో.. మార్కెట్ కళకళలాడింది. డిమాండ్ ఉండడంతో చేపల ధరలు పెరిగాయి. నగరంలోని నెహ్రూ పార్క్ చౌరస్తాలో గల హమ్దర్ద్ దవాఖానా వద్ద చేప మందు పంపిణీ చేశారు. మందు కోసం అస్తమా బాధితులు ఉదయం నుంచే బారులు తీరారు. జిల్లావాసులతోపాటు ఆదిలాబాద్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచీ ప్రజలు తరలివచ్చారు. భారీగా పెరిగిన ధర మృగశిర కార్తెను జిల్లా ప్రజలు మిరుగుగా జరుపుకుంటారు. ఈ రోజున చేపలు తింటే ఆరోగ్యానికి మంచిదని ప్రజలు భావిస్తారు. దీంతో చేపల కొనుగోలుదారులతో వీక్లీ మార్కెట్, హైమద్‌పురా మార్కెట్, కంఠేశ్వర్‌లోని ఆర్మూర్ రోడ్డు, వినాయక్‌నగర్, హమల్‌వాడి,న్యాల్కల్ రోడ్డు, వర్ని చౌరస్తా తదితర ప్రాంతాలు కళకళలాడాయి. గిరాకీని ముందే ఊహించిన వ్యాపారులు.. భారీగా చేపలను దిగుమతి చేసుకున్నారు. డిమాండ్ ఎక్కువగా ఉండడంతో సాధారణంగా కిలో రూ. 400 పలికే మొట్ట చేపలను ఆదివారం రూ. 550 వరకు విక్రయించారు. రూ. 80కి విక్రయించే రవ్వటలను రూ. 120 కి కిలో అమ్మారు. -
సంతకు పోదాం... పండగ చేద్దాం..
గిరిజనుల దైనందిన జీవితంలో ‘సంత’కు ఎంతో ప్రాధాన్యం ఉంది. వారు పండించిన వ్యవసాయోత్పత్తులైనా, సేకరించిన అటవీ ఉత్పత్తులైనా సంతకు తెచ్చి విక్రయిస్తారు. అక్కడే తమకు కావలసిన వస్తువులు కొనుగోలు చేసి ఇంటిముఖం పడతారు. వారి వినోదం, వ్యాపారం, వ్యవహారం...ఆఖరుకు బంధుత్వాలు కలుపుకోవడానికైనా ఏకైక వేదిక ‘సంత’. పండగొచ్చినా...ఇంట్లో శుభకార్యమైనా వెంటనే సంతకు దారితీయాల్సిందే. ఇక సంక్రాంతి వచ్చిందంటే చాలు స్థానిక గిరిజనానికి సందడే సందడి...అందుకే మంగళవారం ఇక్కడ జరిగే ‘తారుమారు సంత’కు వచ్చి సందడి చేశారు. ఈ తారుమారు సంత...! ఏమిటనుకుంటున్నారా...ఇదిగో చదవండి. జి.మాడుగుల, న్యూస్‌లైన్: గిరిజన సంప్రదాయానికి ప్రతీక గా జి.మాడుగుల వెంకటరాజు ఘాట్ వద్ద మంగళవారం తారుమారు (పండగ సంత) సంత జరిగింది. పూర్వం నుండి మత్స్యరాస వంశీయులు ప్రతి ఏటా ఈ పండగ సంత నిర్వహించడం అనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా తెలుగుదేశంపార్టీ నేత మత్స్యరాస వరహాల రాజు, స్థానిక సర్పంచ్ ఎం.మత్స్యరాజు, ఎం.రామరాజు అధ్వర్యంలో సంత కమిటీ ఘనంగా నిర్వహించారు. విజ యనగరం, శ్రీకాకుళం, విశాఖ పట్నం, తూర్పుగోదావరి జిల్లాల నుండి వస్త్ర దుకాణదారులు, నిత్యవసర వస్తువుల వ్యాపారులు వచ్చా రు. విశాఖ ఏజెన్సీ ప్రాంతానికి చెందిన గిరిజన రైతులు రాజ్మా, పసుపు, అల్లం, అడ్డాకులు, కొండచీపుర్లు, నాగలి దుంపలు, కూరగాయలు తదితరల అటవీ వ్యవసాయోత్పత్తులను వాహనాలు, మోత బరువుతో ను, కోళ్లు, మేకలు, గొర్రెలు పశువులను ఇక్కడ వారపు సంతకు తరలించారు. గిరిజన తండాల నుండి పిల్లలు, వృద్ధులతో పాటు కుటుంబ సమేతంగా పండగ సంతకు తరలివచ్చారు. తాము తెచ్చిన ఉత్పత్తులు విక్రయించి, పం డగకు కావాల్సిన సామాగ్రి కొనుగోళ్లు జరిపారు. అంతేకాదు దూర ప్రాంతాలనుండి వచ్చిన బంధువులు, స్నేహితులు కలుసుకొన్నారు. గిరిజన కుటుంబాలు తమతో తీసుకొచ్చిన యుక్త వయస్సు పిల్లలను ఒకరినొకరు పరిచయాలు చేసుకొని బంధుత్వాలు మాట్లాడుకున్నారు. తరువాత జీలుగకల్లు,మడ్డికల్లు వంటి మత్తు పానీయాలతో కుటుంబ సభ్యులందరు ఒక చోటకు చేరి విందులు చేసుకొన్నారు. రాబోయే సంక్రాంతి పండుగకు ఒకరినొక రు ఆహ్వానించుకున్నారు.సంతకు వచ్చిన నేస్తపు (వరసకు అన్నదమ్ములు) చుట్టాలు ఎదురుపడినప్పుడు మర్యాదపూర్వకంగా వంగి‘జోరా’ అంటూ నమ స్కరించుకోగా యువకులు ఆలింగనం, కరచాలనంతో అప్యాయంగా పలకరించుకొని పండగకు పిలుచుకున్నారు. కుండలకు గిరాకీ సంక్రాంతి పండగకు పితృదేవలకు కొత్తకుండలో పులగం తయారు చేసి సమర్పించడం అనవాయితీ. ప్రతి ఒక్క గిరిజన కుటుంబానికి కొత్త కుండలు అవసరం ఉండడంతో సంతలో కుండల ధరలు విపరీతంగా పెంచారు. రూ.40నుండి 50 ధర పలికింది. సంక్రాంతి పండుగకు కొత్తకుండ తప్పని సరి కావడంతో ధరలు పెరిగినా విక్రయాలు బాగా జరిగాయి. కిక్కిరిసిన రోడ్లు తారుమారు సంతకు వచ్చిన వివిధ ప్రాంతాల కు చెందిన ప్రజానీకంతో వెంకటరాజు ఘాట్ ప్రాం తాలు, జి.మాడుగుల మూడు రోడ్లు జంక్షన్ నుండి దేవుని గెడ్డ వరకు రోడ్లు కిక్కిరిశాయి. ఏజెన్సీ మారుమూల గిరిజన ప్రాంతాల నుండి అనేకమంది వచ్చి వేర్వురుగా బంధుమిత్రు లు సమావేశాలు ఏర్పాట్లు చేశారు. తారుమారు సంతలో వ్యాపారుల నుండి సేకరించిన విరాళాలతో కమిటీ సభ్యులు వినోద కార్యక్రమాలు నిర్వహించారు. సంతలో పెద్ద ఎత్తున వ్యాపార లావాదేవీలు సాగాయి. వచ్చే మంగళవారం కూడా ఇక్కడే పండగ సంత నిర్వహించడం జరుగుతుందని వరహాలరాజు తెలిపారు. మాజీమంత్రి ఎం.మణికుమారి, పలు పార్టీల నాయకులు, అధికారులు పండగ సంతకు హాజరయ్యారు.