సంతకు పోదాం... పండగ చేద్దాం..
గిరిజనుల దైనందిన జీవితంలో ‘సంత’కు ఎంతో ప్రాధాన్యం ఉంది. వారు పండించిన వ్యవసాయోత్పత్తులైనా, సేకరించిన అటవీ ఉత్పత్తులైనా సంతకు తెచ్చి విక్రయిస్తారు. అక్కడే తమకు కావలసిన వస్తువులు కొనుగోలు చేసి ఇంటిముఖం పడతారు. వారి వినోదం, వ్యాపారం, వ్యవహారం...ఆఖరుకు బంధుత్వాలు కలుపుకోవడానికైనా ఏకైక వేదిక ‘సంత’. పండగొచ్చినా...ఇంట్లో శుభకార్యమైనా వెంటనే సంతకు దారితీయాల్సిందే. ఇక సంక్రాంతి వచ్చిందంటే చాలు స్థానిక గిరిజనానికి సందడే సందడి...అందుకే మంగళవారం ఇక్కడ జరిగే ‘తారుమారు సంత’కు వచ్చి సందడి చేశారు. ఈ తారుమారు సంత...! ఏమిటనుకుంటున్నారా...ఇదిగో చదవండి.
జి.మాడుగుల, న్యూస్‌లైన్: గిరిజన సంప్రదాయానికి ప్రతీక గా జి.మాడుగుల వెంకటరాజు ఘాట్ వద్ద మంగళవారం తారుమారు (పండగ సంత) సంత జరిగింది. పూర్వం నుండి మత్స్యరాస వంశీయులు ప్రతి ఏటా ఈ పండగ సంత నిర్వహించడం అనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా తెలుగుదేశంపార్టీ నేత మత్స్యరాస వరహాల రాజు, స్థానిక సర్పంచ్ ఎం.మత్స్యరాజు, ఎం.రామరాజు అధ్వర్యంలో సంత కమిటీ ఘనంగా నిర్వహించారు. విజ యనగరం, శ్రీకాకుళం, విశాఖ పట్నం, తూర్పుగోదావరి జిల్లాల నుండి వస్త్ర దుకాణదారులు, నిత్యవసర వస్తువుల వ్యాపారులు వచ్చా రు. విశాఖ ఏజెన్సీ ప్రాంతానికి చెందిన గిరిజన రైతులు రాజ్‌మా, పసుపు, అల్లం, అడ్డాకులు, కొండచీపుర్లు, నాగలి దుంపలు, కూరగాయలు తదితరల అటవీ వ్యవసాయోత్పత్తులను వాహనాలు, మోత బరువుతో ను, కోళ్లు, మేకలు, గొర్రెలు పశువులను ఇక్కడ వారపు సంతకు తరలించారు. గిరిజన తండాల నుండి పిల్లలు, వృద్ధులతో పాటు కుటుంబ సమేతంగా పండగ సంతకు తరలివచ్చారు. తాము తెచ్చిన ఉత్పత్తులు విక్రయించి, పం డగకు కావాల్సిన సామాగ్రి కొనుగోళ్లు జరిపారు. అంతేకాదు దూర ప్రాంతాలనుండి వచ్చిన బంధువులు, స్నేహితులు కలుసుకొన్నారు. గిరిజన కుటుంబాలు తమతో తీసుకొచ్చిన యుక్త వయస్సు పిల్లలను ఒకరినొకరు పరిచయాలు చేసుకొని బంధుత్వాలు మాట్లాడుకున్నారు. తరువాత జీలుగకల్లు,మడ్డికల్లు వంటి మత్తు పానీయాలతో కుటుంబ సభ్యులందరు ఒక చోటకు చేరి విందులు చేసుకొన్నారు.
రాబోయే సంక్రాంతి పండుగకు ఒకరినొక రు ఆహ్వానించుకున్నారు.సంతకు వచ్చిన నేస్తపు (వరసకు అన్నదమ్ములు) చుట్టాలు ఎదురుపడినప్పుడు మర్యాదపూర్వకంగా వంగి‘జోరా’ అంటూ నమ స్కరించుకోగా యువకులు ఆలింగనం, కరచాలనంతో అప్యాయంగా పలకరించుకొని పండగకు పిలుచుకున్నారు.
కుండలకు గిరాకీ
సంక్రాంతి పండగకు పితృదేవలకు కొత్తకుండలో పులగం తయారు చేసి సమర్పించడం అనవాయితీ. ప్రతి ఒక్క గిరిజన కుటుంబానికి కొత్త కుండలు అవసరం ఉండడంతో సంతలో కుండల ధరలు విపరీతంగా పెంచారు. రూ.40నుండి 50 ధర పలికింది. సంక్రాంతి పండుగకు కొత్తకుండ తప్పని సరి కావడంతో ధరలు పెరిగినా విక్రయాలు బాగా జరిగాయి.
కిక్కిరిసిన రోడ్లు
తారుమారు సంతకు వచ్చిన వివిధ ప్రాంతాల కు చెందిన ప్రజానీకంతో వెంకటరాజు ఘాట్ ప్రాం తాలు, జి.మాడుగుల మూడు రోడ్లు జంక్షన్ నుండి దేవుని గెడ్డ వరకు రోడ్లు కిక్కిరిశాయి. ఏజెన్సీ మారుమూల గిరిజన ప్రాంతాల నుండి అనేకమంది వచ్చి వేర్వురుగా బంధుమిత్రు లు సమావేశాలు ఏర్పాట్లు చేశారు. తారుమారు సంతలో వ్యాపారుల నుండి సేకరించిన విరాళాలతో కమిటీ సభ్యులు వినోద కార్యక్రమాలు నిర్వహించారు. సంతలో పెద్ద ఎత్తున వ్యాపార లావాదేవీలు సాగాయి. వచ్చే మంగళవారం కూడా ఇక్కడే పండగ సంత నిర్వహించడం జరుగుతుందని వరహాలరాజు తెలిపారు. మాజీమంత్రి ఎం.మణికుమారి, పలు పార్టీల నాయకులు, అధికారులు పండగ సంతకు హాజరయ్యారు.