సంక్షేమ హాస్టళ్ల మూసివేత దారుణం : ఎస్ఎఫ్ఐ
విజయనగరం: సంక్షేమ హాస్టళ్లను మూసివేయాలనుకోవడం దారుణమైన చర్యని, తక్షణమే ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలోని అంబేడ్కర్ భవనంలో ఆదివారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. 2016-17 విద్యా సంవత్సరంలో పిల్లలు లేరన్న కారణంతో ఎస్సీ 13, బీసీ 14 హాస్టళ్లను మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారన్నారు. ఇది దళిత, గిరిజన, బడుగు బలహీనవర్గాల పిల్లలను విద్యకు దూరం చేయడమేనని ఆరోపించారు. విద్యా హక్కుచట్టం ప్రకారం 14 సంవత్సరాల్లోపు పిల్లలందరికీ ఉచిత నిర్భంద విద్యను అందించాలని, అవసరమైతే ప్రయాణ, భోజన వసతి కల్పించాలన్నారు. ఈ చట్టం వచ్చి ఆరు సంవత్సరాలు పూర్తయినా దీన్ని అమలు చేయాల్సిన పాలకులకు చీమ కుట్టినట్లయినా లేదని విమర్శించారు.
తక్షణమే జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 24న కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టనున్నామని చెప్పారు. అదే విధంగా ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు, సంతకాల సేకరణ, మండల కేంద్రాల్లో ధర్నాలు, ర్యాలీలు నిర్వహించనున్నామని చెప్పారు. ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కె.సురేష్, జిల్లా ఉపాధ్యక్షులు యు.రాంబాబు, ఏయూ రిటైర్డ్ ప్రొఫెసర్ బి.రామకృష్ణారావు, అంబేడ్కర్ అశోక్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కోట అప్పన్న, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి గోకా రమేష్‌బాబు, ప్రచార కార్యదర్శి ఆనందరావు, ఎస్ఎఫ్ఐ నాయకులు ఎం.చింతయ్య, రామ్మోహన్ తదితరులు పాల్కొన్నారు.