మోదీ దెబ్బకు మూగబోయిన ‘నకిలీ చౌక్’
న్యూఢిల్లీ : ఎప్పుడూ కోలాహలంగా, సైకిల్ మోటార్ల రాకపోకలతో సందడిగా ఉండే ఆ రోడ్డు ఇప్పుడు నిర్మానుష్యంగా మారిపోయింది. టక్ టక్ మనే బీఎస్ఎఫ్ జవాన్ల బూట్ల శబ్దం కూడా నిలిచిపోయింది. అప్పుడప్పుడు పక్షుల కిలకిలా రావాలు తప్పించి ప్రశాంతంగా ఉన్న ఆ వాతావరణంలో కంటి నిండా కునుకు తీస్తూ బీఎస్ఎఫ్ జవాన్లు సేద తీరుతున్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని మాల్దా జిల్లాలోని ఖాళియా చౌక్ గ్రామానికి ఆనుకుని ఉన్న బంగ్లాదేశ్ సరిహద్దు పరిస్థితి ఇదీ.
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం కారణంగా నకిలీ కరెన్సీకే రాజధానిగా గుర్తింపు పొందిన ఖాళియా చౌక్‌లో బుధవారం నాటి నుంచి ఈ ప్రశాంత పరిస్థితులు నెలకొన్నాయని స్పెషల్ డీజీ ఆర్పీ సింగ్ ఆ ప్రాంతాన్ని సందర్శించిన మీడియా ప్రతినిధులకు తెలిపారు. మోదీ తీసుకున్న నిర్ణయం వల్ల సరిహద్దుల గుండా నకిలీ కరెన్సీ కార్యకలాపాలు నిలిచిపోవడంతో ఈ ప్రశాంత పరిస్థితులు ఏర్పడ్డాయని, అయితే ఈ పరిస్థితి ఎంతకాలం కొనసాగుతుందో తనకు తెలియదని ఆయన చెప్పారు.
నకిలీ నోట్లపై బీఎస్ఎఫ్ నిఘా
బంగ్లాదేశ్ సరిహద్దుల గుండా ఖాళియా చౌక్‌లోకి నకిలీ కరెన్సీ ప్రవేశించి అక్కడి నుంచి దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. దేశంలో ప్రతి ఏటా పట్టుబడుతున్న కోట్లాది రూపాయల నకిలీ కరెన్సీ ఈ చౌక్ నుంచి వెళుతున్నదే. అందుకని సరిహద్దులను కాపలా కాయాల్సిన బీఎస్ఎఫ్ జవాన్లు ఎక్కువ సమయాన్ని నకిలీ కరెన్సీని పట్టుకోవడానికే కేటాయిస్తున్నారు. అస్సాం, మెఘాలయ, త్రిపురతోపాటు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర సరిహద్దులను ఆనుకొని 4,096 కిలోమీటర్లు బంగ్లాదేశ్ సరిహద్దు ఉంది. ఒక్క బెంగాల్‌లోని మాల్దా సెక్టార్లోనే 223 కిలోమీటర్లు ఉంది.
150 కిలోమీటర్లకు మాత్రమే సరిహద్దు కంచె ఉంది. మిగతా ప్రాంతానికి కంచె నిర్మించడానికి వీలులేకుండా గంగా ప్రవాహం, కొండలు, గుట్టలు, ఊబి గుంటలు లాంటి మానవ ప్రయాణానికి వీలుకాని పరిస్థితి ఉంది. అందుకనే కంచె నిర్మించిన ప్రాంతం నుంచే దేశంలోకి నకిలీ కరెన్సీ వస్తోందని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ బీఎస్ఎఫ్ అధికారి తెలిపారు. 58 ఔట్ పోస్టులతో 2,500 మంది బీఎస్ఎఫ్ జవాన్లు ఇక్కడ కాపలా కాస్తున్నారు. దేశంలోకి పాకిస్థాన్ నుంచే ఎక్కువ నకిలీ కరెన్సీ వస్తుందని అందరు అనుకుంటారుగానీ పాకిస్థాన్ కంటె బంగ్లాదేశ్ నుంచే ఎక్కువ నకిలీ కరెన్సీ దేశంలోకి వస్తోందని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని మరో బీఎస్ఎఫ్ అధికారి తెలిపారు. పాక్ నుంచి నకిలీ కరెన్సీ రావాలంటే నేపాల్, సౌదీ నుంచి రావాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.
భవన నిర్మాణ కార్మికులే కొరియర్లు
ఖాలీయా చౌక్ నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలివెళ్లిన నకిలీ నోట్లను 2012లో 3.6 లక్షల రూపాయలు, 2013లో 80.9లక్షలు, 2014లో 1.7 కోట్లు, 2015లో 2.6 కోట్లు, 2016లో అక్టోబర్ నెల వరకు 1.3 కోట్ల రూపాయలను ప్రభుత్వం పట్టుకుంది. ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్రా ప్రాంతాలకు ఈ చౌక్ నుంచే నకిలీ నోట్లు సరఫరా అవుతున్నాయి. మాల్దాకు చెందిన భవన నిర్మాణ కార్మికులే ఎక్కువగా ఆ రాష్ట్రాలకు నకిలీ కరెన్సీని చేరవేస్తారని బీఎస్ఎఫ్ వర్గాలు తెలిపాయి. ఇరువైపుల దాదాపు 20 నుంచి 25 మంది కొరియర్లు నకిలీ కరెన్సీని చేరవేసేందుకు పనిచేస్తారని, సరిహద్దు నుంచి ప్లాస్టిక్ సంచుల్లో వచ్చే నకిలీ నోట్లను చేరవేసేందుకు ప్రతి వంద మీటర్లకు ఒకరు చొప్పున ఉంటారని ఆ వర్గాలు తెలిపాయి.
కొత్త నకిలీ నోట్లు కూడా వస్తున్నాయట
ఖాళీయా చౌక్ గ్రామంలో చాలా మంది ఈ నకిలీ నోట్ల వ్యాపారంపైనే ఆధారపడి జీవిస్తున్నారని, వారిలో అల్లరి, చిల్లరగా తిరిగేవారే ఎక్కువగా ఉన్నారని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ అధికారి తెలిపారు. ఇప్పుడు వారంతా చిల్లర దొంగతనాలకు, దోపిడీలకు పాల్పడే అవకాశం ఉందని ఆయన అన్నారు. సరిహద్దుల్లో ప్రశాంత పరిస్థితులు ఏర్పడడంతో తమకు కాస్త విశ్రాంతి లభిస్తున్న మాట వాస్తవమేగానీ, ఈ పరిస్థితి ఎక్కువకాలం కొనసాగుతుందని తాను అనుకోవడం లేదని ఆయన చెప్పారు. ఇప్పటికే వంద రూపాయల నకిలీ నోట్ల కట్టలు వస్తున్నట్లు తమకు సమాచారం ఉందని ఆయన అన్నారు. త్వరలోనే కొత్త రెండు వేలు, ఐదు వందల రూపాయల నకిలీ నోట్లు కూడా రాబోతున్నాయని సమాచారం వచ్చిందని ఆయన తెలిపారు.