అంతరిక్షంలో హైడ్రోజన్ నదులు
వాషింగ్టన్: అంతరిక్షంలో వివిధ నక్షత్ర మండలాల (గెలాక్సీల) మధ్య అత్యంత భారీ స్థాయిలో హైడ్రోజన్ వాయువు ప్రవహిస్తోందని అమెరికాకు చెందిన వెస్ట్ వర్జీనియా వర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది సర్పిలాకార గెలాక్సీల్లో పెద్ద సంఖ్యలో నక్షత్రాలు పుట్టడానికి దోహదం చేస్తున్నట్లు వారు చెబుతున్నారు. అమెరికా జాతీయ సైన్స్ ఫౌండేషన్‌కు చెందిన ‘గ్రీన్ బ్యాంక్ టెలిస్కోప్’ సహాయంతో ఈ పరిశోధన చేశారు.
భూమికి 2.2 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ‘ఎన్జీసీ6946’ అనే గెలాక్సీకి.. చుట్టూ ఉన్న గెలాక్సీల నుంచి హైడ్రోజన్ భారీగా ప్రవహిస్తున్నట్లు గుర్తించామని పరిశోధనకు నేతృత్వం వహించిన డీజే పిసానో చెప్పారు. ఇలాంటి హైడ్రోజన్ ప్రవాహాన్ని కనుగొనడం ఇదే మొదటిసారి అని, అత్యంత చల్లగా ఉండడం వల్ల ఈ ప్రవాహాలను గుర్తించడం కష్టమని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి ప్రవాహాల వల్లే సర్పిలాకార గెలాక్సీలు నిత్యం నక్షత్రాలకు జన్మనిస్తున్నట్లుగా భావిస్తున్నట్లు తెలిపారు.