White Paper released
-
నిజాలను గోదాట్లో కలిపి అబద్ధాలతో శ్వేతపత్రం ముంచేసిన మహానుభావుడు
-
రూ. 3 లక్షల 62 వేల కోట్ల అప్పు భారం : బుగ్గన
సాక్షి, అమరావతి : విభజన తర్వాత ప్రజలు ఆశించినంతగా పరిపాలన జరుగలేదని ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. జాతీయ సగటుతో ఆంధ్రప్రదేశ్ స్థూల ఉత్పత్తి తక్కువేనని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆయన బుధవారం శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ...ఏపీలో వినియోగ ద్రవ్యోల్బణం భారీగా పెరిగిందని తెలిపారు. గత ప్రభుత్వం గడిచిన ఐదేళ్లలో పెద్ద ఎత్తున అప్పులు చేసిందని.. ప్రస్తుతం ఆ అప్పులు రాష్ట్రానికి భారంగా మారాయని పేర్కొన్నారు. మొత్తంగా రాష్ట్రంపై 3 లక్షల 62 వేల కోట్ల రూపాయల అప్పు భారం మోపారన్నారు. తమ ప్రభుత్వం మానవ వనరులపై దృష్టి సారించి వారిపైనే ఎక్కువ పెట్టుబడి పెట్టాలనే యోచనలో ఉందన్నారు. రెవెన్యూ లోటు రూ. 66 వేల కోట్లు ‘2014-17 మధ్య రాష్ట్రంలో 5 శాతం వృద్ధిరేటు మాత్రమే నమోదైంది. ద్రవ్యోల్బణం జాతీయస్థాయిలో తగ్గింది. కానీ, ఏపీలో మాత్రం వినియోగ ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. ఎఫ్ఆర్బీఎం చట్టం ప్రకారం రాష్ట్ర జీడీపీలో 3 శాతం దాటి అప్పులు చేయకూడదు. కానీ టీడీపీ ప్రభుత్వం ఆ పరిమితిని దాటి అప్పులు చేసింది. పన్ను రూపంలో వచ్చే ఆదాయం పరంగా చూసినట్లైతే తెలంగాణ కంటే మనం బాగా వెనుకబడి ఉన్నాం. మౌలిక రంగాల్లో ఎక్కువ పెట్టుబడులు పెట్టలేదు. రాష్ట్ర రెవెన్యూ లోటు 66 వేల కోట్ల రూపాయలకు పెరిగింది. తెలంగాణకు వచ్చినంతగా మనకు పన్ను ఆదాయం రావడం లేదు’ అని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. వృద్ధిరేటు ఎలా పెరిగినట్లు? ‘వ్యవసాయరంగంలో 1999- 2004 మధ్య కాలంలో 3.66 శాతం వృద్ధిరేటు ఉంది. 2004- 2009 మధ్య ఐదేళ్ల కాలంలో 6.14 శాతం నమోదైంది. కానీ గత ప్రభుత్వ హయాంలో వ్యవసాయ రంగ స్థూల ఉత్పత్తి తగ్గింది. చేపల, గొర్రెల పెంపకాల్లో వృద్ధిరేటు పెరిగిందనీ.. వ్యవసాయ రంగంలో వృద్ధిరేటు సాధించామంటూ అంచనాలు తయారు చేశారు. చేపల పెంపకం పెరిగినంతమాత్రాన వ్యవసాయ వృద్ధి రేటు ఎలా పెరుగుతుంది’ అని బుగ్గన ప్రశ్నించారు. మానవ వనరుల అభివృద్ధిపై దృష్టి ‘గత ప్రభుత్వం ప్రత్యేక హోదాను నీరుగార్చి ప్యాకేజీని ఆహ్వానించింది. ప్యాకేజీ ద్వారా చంద్రబాబు సర్కారు సాధించిందేమీ లేదు. ఎన్నికలకు ముందు కాంట్రాక్టర్ల బిల్లులను మాత్రమే చెల్లించారు. నియమ నిబంధనలు విరుద్ధంగా ప్రభుత్వ రంగ సంస్థలు రుణ సేకరణ చేశాయి. వివిధ కార్పోరేషన్లకు రూ. 18 వేల కోట్ల బకాయిలు మిగిల్చారు. అంగన్వాడీ మిడ్డే మీల్స్, హోంగార్డులు, ఔట్సోర్సింగ్, విద్యా, వైద్య, వ్యవసాయ, పౌరసరఫరాల శాఖకు భారీగా బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ సమస్యల నుంచి త్వరలోనే గట్టెక్కుతాం. అయితే అందుకు కొంత సమయం పడుతుంది. మానవ వనరుల అభివృద్ధిపై దృష్టి సారించాం. ముఖ్యంగా విద్యా రంగానికి పెద్దపీట వేయాల్సి ఉంది. ఉదాహరణకు అత్యధిక అక్షరాస్యత కలిగిన కేరళను తీసుకుంటే అక్కడ రెవెన్యూ వచ్చేది హ్యూమన్ నుంచే. దేశ విదేశాల్లో పనిచేస్తూ వారు ఆదాయం పొందుతున్నారు. హ్యూమన్ క్యాపిటల్‌ను పెంచినట్లైతే అభివృద్ధి జరుగుతుంది’ అని బుగ్గన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం కోసం ఇక్కడ క్లిక్ చేయండి. -
నాలుగేళ్ల పాలనపై శ్వేతపత్రం విడుదల చేయండి..
విజయనగరం మున్సిపాలిటీ: టీడీపీ నాయకులకు దమ్ముంటే నాలుగేళ్ల పాలనపై శ్వేతపత్రం విడుదల చేయాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక సత్యా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు బొత్స అప్పలనర్సయ్య, బడుకొండ అప్పలనాయుడు, పార్టీ నాయకులు యడ్ల రమణమూర్తి, కడుబండి శ్రీనివాసరావులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బెల్లాన మాట్లాడుతూ, కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు, రాష్ట్ర మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు మంత్రులుగా జిల్లాకు చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. ఎంతసేపూ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణపై నిరాధారమైన ఆరోపణలు చేయడం మినహా, ప్రజలకు వారు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు గడిచినా తోటపల్లి జలాశయం నుంచి రైతులకు పూర్తిగా సాగునీరిచ్చిన దాఖలాలు లేవన్నారు. మరో ప్రాజెక్ట్ తారకరామతీర్థసాగర్‌ను ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. 2004 నుంచి 2014 వరకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, నాటి మంత్రి బొత్స సత్యనారాయణల హయాంలో జిల్లా అభివృద్ధి చెందింది తప్ప టీడీపీ హయాంలో కాదని చెప్పారు. ఎదుటి వారిపై ఆరోపణలు తగవు.. రాష్ట్ర గనుల శాఖా మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు బొత్సను అవినీతి పరుడని ఆరోపించడం సిగ్గుచేటని బెల్లాన అన్నారు. చెరుకు రైతులు డబ్బులు తినేసి మద్రాసు పారిపోయిన విషయాన్ని రంగారావు గుర్తుంచుకోవాలని హితవు పలికారు. విశాఖ కేంద్రంగా ఇసుక కుంభకోణం చేసిన వ్యక్తి రంగారావు కాదా అని ప్రశ్నించారు. అంగన్వాడీ, ఎలక్ట్రికల్ షిఫ్ట్ ఆపరేటర్ల ఉద్యోగాలు అమ్ముకున్న చరిత్ర టీడీపీ నాయకులకు ఉందన్నారు. టీడీపీ నాయకుల గుండెల్లో గుబులు వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి పాదయాత్రకు సిద్ధమవుతున్న నేపథ్యంలో టీడీపీ నాయకుల గుండెల్లో గుబులు పట్టుకుందని వైఎస్సార్సీపీ నాయకులు బెల్లాన, బొత్స, బడుకొండ, కడుబండి, తదితరులు అన్నారు. అశోక్, సుజయ్‌కృష్ణ ఉన్నత సామాజిక వర్గం నుంచి వచ్చిన వారు కనుక వారికి పేద ప్రజల సమస్యలు పట్టవన్నారు. ఇప్పటికైనా వారు చౌకబారు రాజకీయాలు మాని జిల్లా అభివృద్ధి కోసం పనిచేయాలని హితవు పలికారు. సమావేశంలో పార్టీ నాయకులు పతివాడ అప్పలనాయుడు, డోల మన్మధకుమార్, బంటుపల్లి వాసుదేవరావు పాల్గొన్నారు. -
ఇసుక విధానంపై శ్వేతపత్రం విడుదల
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం ఇసుక విధానంపై శ్వేత పత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 387 ఇసుక రీచ్‌ల గుర్తించినట్లు చెప్పారు. ఇందులో 368 రీచ్‌లలో తవ్వకాలు జరుగుతున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఇసుక రీచ్‌లలో అక్రమాలు అరికట్టేందుకు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించనున్నట్లు ఆయన చెప్పారు. విజయవాడ కేంద్రంగా కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేస్తున్నామని, అలాగే రాష్ట్రవ్యాప్తంగా 44 రీచ్‌లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. మొత్తం 6,317 వాహనాలు జీపీఎస్‌కి అనుసంధానం చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో 387 ఇసుక రీచ్‌ల గుర్తింపు 368 రీచ్‌లలో తవ్వకాలు రూ.2 కోట్ల 82 లక్షల క్యుబిక్ మీటర్ల ఇసుక తవ్వకాలు 1.37 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక విక్రయం 4,023 స్వయం సహాయక గ్రూపులకు ఇసుక రీచ్‌ల అప్పగింత అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో రూ.147.37 కోట్ల ఆదాయం అత్యల్పంగా ప్రకాశం జిల్లాలో రూ.12.79 కోట్ల ఆదాయం -
100 రోజుల్లో స్పష్టమైన విధానం
విభజన సమస్యలపై శ్వేతపత్రం విడుదల చేసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్: విభజన వల్ల రాష్ట్రం అనేక సమస్యల్లో చిక్కుకుందని, వీటిని అధిగమించేందుకు 100 రోజుల్లో స్పష్టమైన విధానాన్ని ప్రకటిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారు. అస్తవ్యస్త రాష్ట్ర విభజనతో తెలుగు జాతి మధ్య చిచ్చు పెట్టారని విమర్శించారు. రాష్ట్ర పునర్విభజన బిల్లులోని అంశాలు ప్రజల మధ్య అపోహలు, ఆందోళనలకు దారి తీస్తున్నాయన్నారు. రాజధాని ప్రాంతంపై రాజకీయాలు సరికాదని, అభివృద్ధి కావాలో రాజకీయం కావాలో తేల్చుకోవాలని అన్నారు. ’ఏపీపై రాష్ట్ర విభజన ప్రభావం’పై ఆయన ఆదివారం తన నివాసంలో శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. లోటుపాట్లు గుర్తించి కేంద్రం ఏమేరకు సహకారం అందిస్తుందో చట్టంలోనే పేర్కొని ఉంటే ఇప్పుడీ సమస్యలుండేవి కావని చెప్పారు. ఇతర రాష్ట్రాలతో సమానంగా ఏపీ అభివృద్ధి సాధించేలా కేంద్రం సాయం చేయాలని కోరారు. ‘‘1956కు ముందు భద్రాచలం ఆంధ్రలో ఉండేది. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్రం అక్కడి ముంపు ముండలాలను బిల్లులోనే చేర్చి ఉంటే ఇప్పుడు వివాదం ఉండేదికాదు. దాన్ని ఆర్డినెన్సుగా తేవడంతో ప్రజల మధ్య అపోహలు ఏర్పడ్డాయి. హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టి కొందరు, ఉపాధి కోసం మరికొందరు ఇలా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఇక్కడ స్థిరపడ్డారు. హైదరాబాద్‌లో ఎఫెక్టివ్ గవర్నెన్సుకు కేంద్రం ప్రత్యేక వ్యవస్థపై ఆలోచించకపోవడం వల్ల ఇప్పుడు మరో సమస్య ఏర్పడుతోంది. రాజధాని కోసం కమిటీని ఏర్పాటు చేసి ప్రజల మధ్య కొత్త చిచ్చు పెట్టారు. రాజధానిపై నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికే వదిలేసినా బాగుండేది. ఐఏఎస్, ఐపీఎస్‌ల విభజన, ఉద్యోగులు, ఆస్తులు, అప్పుల పంపకాలు అన్నింటినీ అస్తవ్యస్తం చేశారు. అన్నీ సమస్యలనే మిగిల్చారు’’ అని విమర్శించారు. విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలపై మాట్లాడుతూ విభజన అయినందున ఏపీ ప్రజల హక్కుల పరిరక్షణ కోసం పనిచేయాల్సి ఉంటుందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సర్వేపై మాట్లాడుతూ.. చట్టం ప్రకారమే నడవాలే తప్ప అందుకు భిన్నంగా ఎవరూ వెళ్లరాదని చంద్రబాబు అన్నారు. రాజధానిపై మాట్లాడుతూ.. ‘‘పదేళ్లపాటు హైదరాబాద్‌లో ఉండేందుకు చట్టంలోనే అవకాశం కల్పించారు. ప్రజలకు అందుబాటులో ఉండటంలేదని, హైదరాబాద్ నుంచి పాలన సాగిస్తున్నానని నాపై విమర్శలు వస్తున్నాయి. కానీ ఏం చేస్తాను. హైదరాబాద్‌లో నేను గెస్టుహౌస్‌లో ఉంటున్నాను. విజయవాడలో అయినా గెస్టుహౌస్‌లోనో, అద్దె ఇంటిలోనో ఉండాలి తప్ప అక్కడ ఏమీ లేదు’’ అని చెప్పారు. రాష్ట్ర రాజధానిని కర్నూలులో పెట్టాలన్న డిమాండ్లపై స్పందిస్తూ.. ‘‘మా ఊరిలో పెడితే బాగుంటుందని నాకూ అనిపిస్తుంటుంది. మా దగ్గర కల్యాణి డ్యామ్ ఉంది. భూమి కూడా ఉంది. అది మా ఊరి పక్కనే. కానీ ప్రజలకు న్యాయం చేయాలి. స్వార్థం కోసం ఆలోచించలేం. కర్నూలులో రాజధాని కావాలని కోరుతున్న వారు ఇంతకాలం అ పట్టణానికి ఏం చేశారు? రాజకీయం కావాలా? అభివృద్ధి కావాలా? అక్కడ 30 వేల ఎకరాల్లో పరిశ్రమలను అభివృద్ధి చేసి కర్నూలుకు అనుసంధానిస్తాను. వికేంద్రీకరణ ద్వారా అన్ని జిల్లాలను అభివృద్ధి చేస్తాను’’ అని బాబు చెప్పారు. ‘సాక్షి’ని అనుమతించని చంద్రబాబు సీఎం చంద్రబాబు ఆదివారం నిర్వహించిన రెండు అధికారిక మీడియా సమావేశాలకు సాక్షిని అనుమతించలేదు. ఉదయం శ్వేతపత్రం విడుదల కార్యక్రమం, సాయంత్రం గవర్నర్ సమక్షంలో కేసీఆర్‌తో జరిగిన సమావేశం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశానికి వెళ్లకుండా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. ఈ రెండు కార్యక్రమాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ సమాచార, పౌర సంబంధాలశాఖ నుంచి సాక్షికి ఆహ్వానం అం దింది. నిర్ణీత సమయానికే అక్కడికి చేరుకున్న సాక్షి సిబ్బందిని చంద్రబాబు ఇంటి వద్ద ఉన్న భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. మీడియా ప్రతినిధుల గుర్తింపు కార్డులను పరిశీలిస్తూ ఒక్కొక్కరినీ లోపలికి పంపించిన సిబ్బంది సాక్షి ప్రతినిధులను మాత్రం అనుమతించలేదు. దీనిపై సాక్షి ప్రతినిధులు ప్రశ్నించగా.. ‘సాక్షి’ మీడియాను లోపలకు అనుతించవద్దని ఆదేశాలున్నాయని భద్రతా సిబ్బంది సమాధానమిచ్చి, వైర్లెస్ సెట్ ద్వారా ఉన్నతాధికారులను సంప్రదించారు. అలా రెండు మూడుసార్లు భద్రతా సిబ్బంది ప్రయత్నించినా వేచి ఉండాలనే సమాధానం వచ్చింది. దీనిపై ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్‌ను సంప్రదించడానికి సాక్షి ప్రతి నిధులు ఫోన్ చేయగా స్పందన రాలేదు. దీనిపై భద్రతాధికారిని ప్రశ్నించగా.. మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్‌ను మూడుసార్లు అడిగామని, ఆయన చెబుతానంటూనే సీఎంతో మీడియా సమావేశానికి వెళ్లిపోయారని తెలిపారు. సమావేశం ముగిశాక సమాచార శాఖ కమిషనర్ దానకిషోర్‌ను సాక్షి ప్రతినిధి సంప్రదించగా అందుబాటులోకి రాలేదు. సొంతింటి కార్యక్రమమో, పార్టీ కార్యక్రమమో అయితే నచ్చిన మీడియాను పిలుచుకొని మాట్లాడుకోవచ్చని, కానీ ప్రభుత్వ కార్యక్రమానికి రాకుండా ఒక మీడియాపై ఆంక్షలు విధించడం సరికాదని అక్కడి భద్రతా సిబ్బందే ముక్కున వేలేసుకున్నారు.