100 రోజుల్లో స్పష్టమైన విధానం | 100 days of says clear policy | Sakshi
Sakshi News home page

100 రోజుల్లో స్పష్టమైన విధానం

Published Mon, Aug 18 2014 1:50 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM

100 రోజుల్లో స్పష్టమైన విధానం - Sakshi

100 రోజుల్లో స్పష్టమైన విధానం

విభజన సమస్యలపై శ్వేతపత్రం విడుదల చేసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు
 
హైదరాబాద్: విభజన వల్ల రాష్ట్రం అనేక సమస్యల్లో చిక్కుకుందని, వీటిని అధిగమించేందుకు 100 రోజుల్లో స్పష్టమైన విధానాన్ని ప్రకటిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారు. అస్తవ్యస్త రాష్ట్ర విభజనతో తెలుగు జాతి మధ్య చిచ్చు పెట్టారని విమర్శించారు. రాష్ట్ర పునర్విభజన బిల్లులోని అంశాలు ప్రజల మధ్య అపోహలు, ఆందోళనలకు దారి తీస్తున్నాయన్నారు. రాజధాని ప్రాంతంపై రాజకీయాలు సరికాదని, అభివృద్ధి కావాలో రాజకీయం కావాలో తేల్చుకోవాలని అన్నారు. ’ఏపీపై రాష్ట్ర విభజన  ప్రభావం’పై ఆయన ఆదివారం తన నివాసంలో శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. లోటుపాట్లు గుర్తించి కేంద్రం ఏమేరకు సహకారం అందిస్తుందో చట్టంలోనే పేర్కొని ఉంటే ఇప్పుడీ సమస్యలుండేవి కావని చెప్పారు.

ఇతర రాష్ట్రాలతో సమానంగా ఏపీ అభివృద్ధి సాధించేలా కేంద్రం సాయం చేయాలని కోరారు. ‘‘1956కు ముందు భద్రాచలం ఆంధ్రలో ఉండేది. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్రం అక్కడి ముంపు ముండలాలను బిల్లులోనే చేర్చి ఉంటే ఇప్పుడు వివాదం ఉండేదికాదు. దాన్ని ఆర్డినెన్సుగా తేవడంతో ప్రజల మధ్య అపోహలు ఏర్పడ్డాయి. హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టి కొందరు, ఉపాధి కోసం మరికొందరు ఇలా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఇక్కడ స్థిరపడ్డారు. హైదరాబాద్‌లో ఎఫెక్టివ్ గవర్నెన్సుకు కేంద్రం ప్రత్యేక వ్యవస్థపై ఆలోచించకపోవడం వల్ల ఇప్పుడు మరో సమస్య ఏర్పడుతోంది. రాజధాని కోసం కమిటీని ఏర్పాటు చేసి ప్రజల మధ్య కొత్త చిచ్చు పెట్టారు. రాజధానిపై నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికే వదిలేసినా బాగుండేది. ఐఏఎస్, ఐపీఎస్‌ల విభజన, ఉద్యోగులు, ఆస్తులు, అప్పుల పంపకాలు అన్నింటినీ అస్తవ్యస్తం చేశారు. అన్నీ సమస్యలనే మిగిల్చారు’’ అని విమర్శించారు. విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలపై మాట్లాడుతూ విభజన అయినందున ఏపీ ప్రజల హక్కుల పరిరక్షణ కోసం  పనిచేయాల్సి ఉంటుందని చెప్పారు.

తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సర్వేపై మాట్లాడుతూ.. చట్టం ప్రకారమే నడవాలే తప్ప అందుకు భిన్నంగా ఎవరూ వెళ్లరాదని  చంద్రబాబు అన్నారు. రాజధానిపై మాట్లాడుతూ.. ‘‘పదేళ్లపాటు హైదరాబాద్‌లో ఉండేందుకు చట్టంలోనే అవకాశం కల్పించారు. ప్రజలకు అందుబాటులో ఉండటంలేదని, హైదరాబాద్ నుంచి పాలన సాగిస్తున్నానని నాపై విమర్శలు వస్తున్నాయి. కానీ ఏం చేస్తాను. హైదరాబాద్‌లో నేను గెస్టుహౌస్‌లో ఉంటున్నాను. విజయవాడలో అయినా గెస్టుహౌస్‌లోనో, అద్దె ఇంటిలోనో ఉండాలి తప్ప అక్కడ ఏమీ లేదు’’ అని  చెప్పారు. రాష్ట్ర రాజధానిని కర్నూలులో పెట్టాలన్న డిమాండ్లపై స్పందిస్తూ.. ‘‘మా ఊరిలో పెడితే బాగుంటుందని నాకూ అనిపిస్తుంటుంది. మా దగ్గర కల్యాణి డ్యామ్ ఉంది. భూమి కూడా ఉంది. అది మా ఊరి పక్కనే. కానీ ప్రజలకు న్యాయం చేయాలి. స్వార్థం కోసం ఆలోచించలేం. కర్నూలులో రాజధాని కావాలని కోరుతున్న వారు ఇంతకాలం అ పట్టణానికి ఏం చేశారు? రాజకీయం కావాలా? అభివృద్ధి కావాలా? అక్కడ 30 వేల ఎకరాల్లో పరిశ్రమలను అభివృద్ధి చేసి కర్నూలుకు అనుసంధానిస్తాను. వికేంద్రీకరణ ద్వారా అన్ని జిల్లాలను అభివృద్ధి చేస్తాను’’ అని బాబు చెప్పారు.
 
‘సాక్షి’ని అనుమతించని చంద్రబాబు

 
 సీఎం చంద్రబాబు ఆదివారం నిర్వహించిన రెండు అధికారిక మీడియా సమావేశాలకు సాక్షిని అనుమతించలేదు. ఉదయం శ్వేతపత్రం విడుదల కార్యక్రమం, సాయంత్రం గవర్నర్ సమక్షంలో కేసీఆర్‌తో జరిగిన సమావేశం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశానికి వెళ్లకుండా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. ఈ రెండు కార్యక్రమాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ సమాచార, పౌర సంబంధాలశాఖ నుంచి సాక్షికి ఆహ్వానం అం దింది. నిర్ణీత సమయానికే అక్కడికి చేరుకున్న సాక్షి సిబ్బందిని చంద్రబాబు ఇంటి వద్ద ఉన్న భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. మీడియా ప్రతినిధుల గుర్తింపు కార్డులను పరిశీలిస్తూ ఒక్కొక్కరినీ లోపలికి పంపించిన సిబ్బంది సాక్షి ప్రతినిధులను మాత్రం అనుమతించలేదు. దీనిపై సాక్షి ప్రతినిధులు ప్రశ్నించగా..  ‘సాక్షి’ మీడియాను లోపలకు అనుతించవద్దని  ఆదేశాలున్నాయని భద్రతా సిబ్బంది సమాధానమిచ్చి, వైర్‌లెస్ సెట్ ద్వారా ఉన్నతాధికారులను సంప్రదించారు.

అలా రెండు మూడుసార్లు భద్రతా సిబ్బంది ప్రయత్నించినా వేచి ఉండాలనే సమాధానం వచ్చింది. దీనిపై ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్‌ను సంప్రదించడానికి సాక్షి ప్రతి నిధులు ఫోన్ చేయగా స్పందన రాలేదు. దీనిపై భద్రతాధికారిని ప్రశ్నించగా..  మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్‌ను మూడుసార్లు అడిగామని, ఆయన చెబుతానంటూనే సీఎంతో మీడియా సమావేశానికి వెళ్లిపోయారని తెలిపారు. సమావేశం ముగిశాక సమాచార శాఖ కమిషనర్ దానకిషోర్‌ను సాక్షి ప్రతినిధి సంప్రదించగా అందుబాటులోకి రాలేదు.  సొంతింటి కార్యక్రమమో, పార్టీ కార్యక్రమమో అయితే నచ్చిన మీడియాను పిలుచుకొని మాట్లాడుకోవచ్చని, కానీ ప్రభుత్వ కార్యక్రమానికి రాకుండా ఒక మీడియాపై ఆంక్షలు విధించడం సరికాదని అక్కడి భద్రతా సిబ్బందే ముక్కున వేలేసుకున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement