విజయనగరం మున్సిపాలిటీ: టీడీపీ నాయకులకు దమ్ముంటే నాలుగేళ్ల పాలనపై శ్వేతపత్రం విడుదల చేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక సత్యా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు బొత్స అప్పలనర్సయ్య, బడుకొండ అప్పలనాయుడు, పార్టీ నాయకులు యడ్ల రమణమూర్తి, కడుబండి శ్రీనివాసరావులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బెల్లాన మాట్లాడుతూ, కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు, రాష్ట్ర మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు మంత్రులుగా జిల్లాకు చేసిన అభివృద్ధి శూన్యమన్నారు.
ఎంతసేపూ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణపై నిరాధారమైన ఆరోపణలు చేయడం మినహా, ప్రజలకు వారు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు గడిచినా తోటపల్లి జలాశయం నుంచి రైతులకు పూర్తిగా సాగునీరిచ్చిన దాఖలాలు లేవన్నారు. మరో ప్రాజెక్ట్ తారకరామతీర్థసాగర్‌ను ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. 2004 నుంచి 2014 వరకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, నాటి మంత్రి బొత్స సత్యనారాయణల హయాంలో జిల్లా అభివృద్ధి చెందింది తప్ప టీడీపీ హయాంలో కాదని చెప్పారు.
ఎదుటి వారిపై ఆరోపణలు తగవు..
రాష్ట్ర గనుల శాఖా మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు బొత్సను అవినీతి పరుడని ఆరోపించడం సిగ్గుచేటని బెల్లాన అన్నారు. చెరుకు రైతులు డబ్బులు తినేసి మద్రాసు పారిపోయిన విషయాన్ని రంగారావు గుర్తుంచుకోవాలని హితవు పలికారు. విశాఖ కేంద్రంగా ఇసుక కుంభకోణం చేసిన వ్యక్తి రంగారావు కాదా అని ప్రశ్నించారు. అంగన్‌వాడీ, ఎలక్ట్రికల్ షిఫ్ట్ ఆపరేటర్ల ఉద్యోగాలు అమ్ముకున్న చరిత్ర టీడీపీ నాయకులకు ఉందన్నారు.
టీడీపీ నాయకుల గుండెల్లో గుబులు
వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రకు సిద్ధమవుతున్న నేపథ్యంలో టీడీపీ నాయకుల గుండెల్లో గుబులు పట్టుకుందని వైఎస్సార్‌సీపీ నాయకులు బెల్లాన, బొత్స, బడుకొండ, కడుబండి, తదితరులు అన్నారు. అశోక్, సుజయ్‌కృష్ణ ఉన్నత సామాజిక వర్గం నుంచి వచ్చిన వారు కనుక వారికి పేద ప్రజల సమస్యలు పట్టవన్నారు. ఇప్పటికైనా వారు చౌకబారు రాజకీయాలు మాని జిల్లా అభివృద్ధి కోసం పనిచేయాలని హితవు పలికారు. సమావేశంలో పార్టీ నాయకులు పతివాడ అప్పలనాయుడు, డోల మన్మధకుమార్, బంటుపల్లి వాసుదేవరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment