బెంగళూరు కేఫ్‌లో బాంబు పేలుడు
సాక్షి, బెంగళూరు: బాంబు పేలుడు ఘటనతో బెంగళూరు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నగరంలో నిత్యం రద్దీగా ఉండే వైట్‌ఫీల్డ్ పరిధిలోని బ్రూక్‌ఫీల్డ్ ప్రాంతంలోని రామేశ్వరం కేఫ్‌లో మధ్యాహ్నం వేళ ఈ బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో కేఫ్ సిబ్బందిసహా 10 మంది గాయపడ్డారు. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ లీకేజీ కారణంగా పేలుడు సంభవించిందని తొలుత అందరూ భావించారు.
30 ఏళ్లలోపు వయసు వ్యక్తి ఒకరు ఆ కేఫ్‌లోని హ్యాండ్‌వాష్ వద్ద ఉన్న చెత్తబుట్టలో ఒక బ్యాగును పడేసి వెళ్లినట్లు అక్కడి సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది. అత్యాధునిక పేలుడు పదార్థం(ఐఈడీ) వల్లే ఈ పేలుడు సంభవించిందని బాంబు నిరీ్వర్య బలగాలు, ఫోరెన్సిక్స్ ల్యాబోరేటరీ, జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) బృందాలు ఒక ప్రాథమిక అంచనాకు వచ్చాయి. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు ఆ వ్యక్తిని గుర్తించారు.
టోకెన్ కౌంటర్ వద్ద రవ్వ ఇడ్లీ ఆర్డర్ చేసిన ఆ వ్యక్తి తర్వాత తినకుండా వెళ్లిపోయినట్లు సీసీటీవీలో రికార్డయింది. పోయేముందు ఒక బ్యాగును అక్కడి హ్యాండ్‌వాష్ దగ్గరి చెత్తబుట్టలో పడేసినట్లు కనిపిస్తోంది. ఒక గంట తర్వాత బాంబు పేలింది. ఐఈడీ బాంబును టైమర్ సాయంతో పేల్చి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఘటనాస్థలిని కర్ణాటక డీజీపీ సందర్శించారు. ‘ ఈ బాంబు పేలుడు ఘటనలో ఇప్పటికే లభించిన ఆధారాల సాయంతో దర్యాప్తు ముమ్మరం చేశాం’ అని రాష్ట్ర డీజీపీ అలోక్ మోహన్ చెప్పారు.
‘‘కేఫ్‌లో తినేందుకు అప్పుడే అక్కడికొచ్చాం. 40 మంది దాకా ఉన్నాం. ఒక్కసారిగా భారీ పేలుడు జరగడంతో ప్రాణభయంతో పరుగులు తీశాం’’ అని ప్రత్యక్ష సాక్షులు ఎడిసన్, అమృత్ చెప్పారు. ఎన్ఐఏ బృందం ఘటనాస్థలిని సందర్శించింది. పేలుడు స్థలంలో బ్యాటరీ, వైర్లను గుర్తించారు. కేవలం పది సెకండ్ల వ్యవధిలో రెండు పేలుళ్లు సంభవించాయని కెఫే ఎండీ, సహ వ్యవస్థాపకురాలు దివ్య చెప్పారు.
దుండగులను వదలిపెట్టం
కేఫ్‌లో పేలుడుకు ఐఈడీ బాంబే కారణమని ఆ రాష్ట్రముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. ‘‘నిందితులను గుర్తించి చట్టం ముందు నిలబెడతాం. ఈ ఘటన వెనుక ఉన్నది ఎంతటి వారైనా విడిచి పెట్టేది లేదు’ అని శుక్రవారం మైసూరులో వ్యాఖ్యానించారు. ‘‘ ఘటనపై పోలీసు శాఖ దర్యాప్తు చేపట్టింది. సీసీకెమెరాల ద్వారా నిందితుల ఆచూకీ గుర్తించేందుకు చర్యలు చేపట్టాం. ఇది ఉగ్రవాదుల పనిలా లేదు. పేలుడు ఘటన వెనుక ఉన్నవారిని కఠినంగా శిక్షిస్తాం’ అని సీఎం అన్నారు.