wife kill
-
భోజనం స్పైసీగా ఉందని చంపేశాడు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మధు విహార్ ప్రాంతంలో సుబోధ్ (40) అనే వ్యక్తి.. భోజనం విషయంలో గొడవపడి భార్యను కిరాతకంగా చంపేశాడు. భోజనంలో కారం ఎక్కువగా ఉందని కారణంతో కర్రతో బాదడంతో ఆమె చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ప్లంబర్‌గా పనిచేస్తున్న సుబోధ్, అతని భార్య మనీషా తరచూ గొడవపడేవారని పోలీసులు చెప్పారు. సుబోధ్ మునియా అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం మనీషాకు తెలియడంతో భర్తను నిలదీసింది. సుబోధ్‌కు దూరంగా రోహిణిలో ఉన్న బంధువుల దగ్గరకు వెళ్లింది. ఈ నెల 10న సుబోధ్ నచ్చజెప్పి మనీషాను ఇంటికి రమ్మని చెప్పాడు. ఆ రోజు ఇంట్లో సుబోధ్‌తో కలసి మునియా ఉండటం చూసి మనీషా కోప్పడింది. కాగా మునియా ఇంట్లో ఉండదని, దగ్గరలో మరో చోట ఉంటుందని సుబోధ్ ఆమెకు నచ్చజెప్పాడు. ఆ తర్వాత మనీషా భోజనం తయారు చేసి భర్తకు వడ్డించింది. భోజనంలో కారం ఎక్కువగా ఉందని గొడవపడిన సుబోధ్ కర్ర తీసుకుని బాదడంతో మనీషా చనిపోయింది. ఆమె ఒంటిపై 22 చోట్ల గాయాలున్నట్టు పోలీసులు చెప్పారు. -
'కొడుకు లేడని.. బతికే హక్కులేదన్నాడు'
వడోదర: వరుసగా నాలుగో కాన్పులోనూ ఆడపిల్లకు జన్మనిచ్చిందని, మగపిల్లాడిని కనలేదని కోపంతో ఓ వ్యక్తి తన భార్యను చంపేశాడు. ఆమెను ఈడ్చుకెళ్లి బావిలో తోసేయడంతో నీళ్లో మునిగి చనిపోయింది. గుజరాత్ రాష్ట్రంలో వడోదరకు 90 కిలోమీటర్ల దూరంలోని గోద్రా తాలుకా బగిడోల్ గ్రామంలో ఇటీవల ఈ దారుణం జరిగింది. మృతురాలిని హేతల్ పర్మార్‌గా పోలీసులు గుర్తించారు. ఆమెకు నలుగురు ఆడపిల్లలు సంతానం. మగపిల్లాడిని కనలేదనే కారణంతో హేతల్ను ఆమె భర్త జితేంద్ర, అత్తింటివారు వేధించేవారు. ఈ విషయంపై జితేంద్ర తరచూ గొడవపడుతుండేవాడని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరుసగా నలుగురు ఆడిపిల్లలకు జన్మనిచ్చావని, కొడుకును కనందుకు భూమిపై జీవించే హక్కులేదని జితేంద్ర.. భార్యతో గొడవపడినట్టు తెలిపారు. భార్యను హత్య చేసిన తర్వాత జితేంద్ర పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. -
జైపూర్‌లో భార్యను చంపి, ఆపై భర్త ఆత్మహత్య
జైపూర్: కుటుంబ వివాదంతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి తన భార్యను పదునైన కత్తితో పొడిచి చంపి, ఆపై తాను విషం తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జైపూర్‌లోని హనుమాన్‌గఢ్ నగరంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. జైపూర్‌లోని హనుమాన్‌గఢ్‌లో విజయ్ (37), రజనీ (35) దంపతులు ఓ అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. ఈ దంపతులకు 12 సంవత్సరాల క్రితం పెళ్లైంది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక కుమారుడు ఉన్నారు. దంపతులిద్దరూ ఇంట్లో తరుచూ గొడవ పడేవారు. వీరి వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది. దీంతో మనస్తాపం చెందిన భర్త విజయ్ తన భార్య రజనీని ఓ పదునైన కత్తితో పొడిచి చంపాడు. ఆ తరువాత తాను కూడా విషం తాగి బలవన్మరణానికి పాల్పడినట్టు పోలీసులు చెప్పారు. రజనీ తండ్రి ఉదయం వారి ఇంటికి వచ్చిన సమయంలో వారి మృతదేహాలను చూసి నివ్వెరపోయాడు. దీంతో అతను పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు.