గెడ్డం గీసుకో.. లేకపోతే చచ్చిపోతా!
గెడ్డం గీసుకోకపోతే తాను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతానంటూ భర్తను ఓ భార్య బెదిరించింది. అయితే, సదరు వ్యక్తి ముస్లిం మత గురువు కావడం ఇక్కడ విశేషం. దీంతో ఏం చేయాలో తెలియక యూపీలోని మీరట్ ప్రాంతానికి చెందిన అర్షద్ బద్రుద్దీన్ (36) తల పట్టుకున్నారు. తాను ఎంత చెబుతున్నా వినకుండా వేరే మగాళ్లతో స్మార్ట్ఫోన్లలో చాటింగ్ కూడా చేస్తోందని ఆయన అంటున్నారు. తన భార్యకు కౌన్సెలింగ్ ఇప్పించాలని మీరట్ కలెక్టర్‌ను ఆశ్రయించారు. ఒకవేళ తన భార్య ఆత్మహత్య చేసుకుంటే తనపై ఆరోపణలు వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.
తాను మసీదులో ఇమామ్‌గా పనిచేస్తున్నానని, ఇస్లాం మతాన్ని పూర్తిగా పాటిస్తానని, 2001 సంవత్సరంలో పిల్ఖువా పట్టణానికి చెందిన సహానా అనే మహిళను పెళ్లి చేసుకున్నానని తన ఫిర్యాదులో బద్రుద్దీన్ చెప్పారు. గెడ్డం పెంచుకోకూడదని, బాలీవుడ్ హీరోలు సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్లలా క్లీన్ షేవ్ చేసుకోవాలని తన భార్య తనను డిమాండ్ చేస్తోందని అన్నారు. స్మార్ట్‌ఫోన్ కొనుక్కుని వేరే మగాళ్లతో పగలు, రాత్రి అని తేడా లేకుండా చాటింగ్ చేస్తూనే ఉందని వాపోయారు. తనలాంటి మత గురువులు తప్పనిసరిగా గెడ్డం పెంచుకోవాలని నచ్చజెప్పేందుకు ఎంత ప్రయత్నించినా ఆమె మాత్రం వినిపించుకోవడం లేదట. తమకు నలుగురు పిల్లులన్నారని, అయినా ఆమె మాత్రం తన పట్టు వీడటం లేదని తెలిపారు. సెల్‌ఫోన్ చాటింగ్ వద్దని తాను గట్టిగా చెబితే ఆమె ఏడుస్తోందని.. పిల్లలకు విషమిచ్చి తానూ ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తోందని కలెక్టర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో బద్రుద్దీన్ తెలిపారు. ఈద్ సందర్భంగా పిల్లలకు, తనకు ఆమె పాశ్చాత్య దుస్తులు కొనిస్తానందని, వద్దంటే మళ్లీ గొడవ పెట్టుకుందని చెప్పారు. ఈద్ మర్నాడు గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుందని, తలుపు పగలగొట్టి లోపలకు వెళ్లి చూస్తే ఆమె ఉరేసుకోడానికి ప్రయత్నిస్తోందని.. అదృష్టవశాత్తు ఆమెను కాపాడగలిగామని చెప్పారు.