wimbledon tennis tournment
-
ఎదురులేని ఫెడరర్
మూడో రౌండ్లోకి ప్రవేశం ముర్రే, సోంగా, క్విటోవా కూడా... మకరోవాకు షాక్ వింబుల్డన్ టెన్నిస్ టోర్నీ లండన్: వింబుల్డన్‌లో ఎనిమిదో టైటిల్ కోసం బరిలోకి దిగిన స్విస్ స్టార్ రోజర్ ఫెడరర్ ఎదురులేకుండా దూసుకుపోతున్నాడు. తొలి రౌండ్లో వరుస సెట్లలో ప్రత్యర్థిని హోరెత్తించిన ఫెడెక్స్.. రెండోరౌండ్లోనూ అదే జోరు కనబర్చాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో రెండోసీడ్ ఫెడరర్ 6-4, 6-2, 6-2తో అన్‌సీడెడ్ సామ్ క్వెరీ (అమెరికా)పై విజయాన్ని సాధించి మూడో రౌండ్లోకి ప్రవేశించాడు. గంటా 25 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఫెడరర్ పదునైన సర్వీస్‌లు, బలమైన ఫోర్‌హ్యాండ్, బ్యాక్‌హ్యాండ్ షాట్లతో పాటు బేస్‌లైన్ గేమ్‌తో ప్రత్యర్థిని కట్టడి చేశాడు. ఏడేళ్ల తర్వాత ఫెడరర్‌తో తలపడుతుండటంతో మ్యాచ్ ఆరంభంలో క్వెరీ కాస్త పోటీ ఇచ్చేటట్లు కనిపించినా తర్వాత చతికిలపడ్డాడు. తొలిసెట్ ఆరంభంలో ఇరువురు సర్వీస్‌లను నిలబెట్టుకోవడంతో ఓ దశలో స్కోరు 4-4తో సమమైంది. అయితే తొమ్మిదో గేమ్‌లో స్కోరు 40-40 ఉన్న దశలో క్వెరీ సర్వీస్‌ను బ్రేక్ చేసి ఫెడరర్ 5-4 ఆధిక్యంలో నిలిచాడు. తర్వాతి గేమ్‌లో సర్వీస్‌ను నిలబెట్టుకుని సెట్‌ను సాధించాడు. రెండో సెట్లోనూ అదే జోరు కనబర్చిన ఫెడరర్ ఆరంభంలోనే క్వెరీ సర్వీస్‌ను బ్రేక్ చేసి తర్వాతి గేమ్‌లో సర్వీస్ నిలబెట్టుకుని 2-0 ఆధిక్యంలో నిలిచాడు. తర్వాత ఇరువురు సర్వీస్‌లు నిలబెట్టుకోవడంతో స్కోరు 4-2గా మారింది. ఏడో గేమ్‌లో స్విస్ స్టార్ కాళ్ల మధ్య నుంచి కొట్టిన అద్భుతమైన షాట్‌కు క్వెరీ సమాధానం చెప్పలేక గేమ్‌ను కోల్పోయాడు. ఎనిమిదో గేమ్‌లో సర్వీస్‌ను నిలబెట్టుకుని ఫెడరర్ సెట్‌ను చేజిక్కించుకున్నాడు. ఇక మూడో సెట్లోనూ క్వెరీ సర్వీస్‌ను బ్రేక్ చేసి ఆధిక్యాన్ని సంపాదించిన ఫెడరర్ చివరి వరకు దాన్ని కొనసాగించాడు. స్కోరు 5-2 ఉన్న దశలో సర్వీస్‌ను కాపాడుకుని విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఓవరాల్‌గా వింబుల్డన్‌లో ఫెడరర్‌కు ఇది 75వ విజయం. ముర్రే ముందుకు... పురుషుల సింగిల్స్ ఇతర మ్యాచ్‌ల్లో మూడోసీడ్ ముర్రే (బ్రిటన్) 6-1, 6-1, 6-4తో రాబిన్ హాస్ (నెదర్లాండ్స్)పై; 6వ సీడ్ బెర్డిచ్ (చెక్) 6-1, 6-4, 6-4తో మహుట్ (ఫ్రాన్స్)పై; 12వ సీడ్ సిమోన్ (ఫ్రాన్స్) 6-1, 6-1, 6-7 (5), 6-1తో బ్లాజ్ కవిచ్ (స్లోవేనియా)పై; 13వ సీడ్ విల్ఫ్రెడ్ సోంగా (ఫ్రాన్స్) 6-3, 6-4, 6-4తో రామోస్ వినోలాస్ (స్పెయిన్)పై; 20వ సీడ్ అగుట్ (స్పెయిన్) 2-6, 4-6, 6-3, 6-3, 6-3తో బినోయిట్ పెయిర్ (ఫ్రాన్స్)పై నెగ్గి మూడోరౌండ్లోకి అడుగుపెట్టారు. మకరోవాకు చుక్కెదురు మహిళల సింగిల్స్‌లో రష్యా క్రీడాకారిణి ఎకతెరినా మకరోవా (రష్యా)కు చుక్కెదురైంది. రెండో రౌండ్లో రెబరికోవా (స్లోవేకియా) 6-2, 7-5తో మకరోవాపై నెగ్గి మూడోరౌండ్లోకి ప్రవేశించింది. ఇతర మ్యాచ్‌ల్లో రెండోసీడ్ పెట్రా క్విటోవా (చెక్) 6-2, 6-0తో కురుమి నారా (జపాన్)పై; 5వ సీడ్ వోజ్నియాకి (డెన్మార్క్) 6-1, 7-6 (6) డెనిసా అలెర్టోవా (చెక్)పై; 10వ సీడ్ కెర్బర్ (జర్మనీ) 7-5, 6-2తో పాల్వెంచుకోవా (రష్యా)పై; 13వ సీడ్ రద్వాన్‌స్కా (పోలెండ్) 6-0, 6-2తో అజిలా టోమ్జానోవిచ్ (ఆస్ట్రేలియా)పై; 15వ సీడ్ బాసిన్‌స్కీ (స్విట్జర్లాండ్) 6-2, 6-1తో ఈస్సోనిసా (స్పెయిన్)పై; డెల్లాక్వా (ఆస్ట్రేలియా) 7-6 (3), 6-3తో 17వ సీడ్ ఎలినా స్వితోలినా (ఉక్రెయిన్)పై; 18వ సీడ్ లిసికి (జర్మనీ) 2-6, 7-5, 6-1తో మెక్ హాలే (అమెరికా) పై; 21వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా) 6-4, 7-6 (3)తో కులిచ్కోవా (రష్యా)పై; 28వ సీడ్ జంకోవిచ్ (సెర్బియా) 6-7 (4), 6-1, 6-3తో రోడినా (రష్యా)పై గెలిచి మూడోరౌండ్‌కు చేరారు. రెండోరౌండ్లో సానియా జోడి భారత స్టార్ ప్లేయర్ సానియా మీర్జా-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడి మహిళల డబుల్స్‌లో రెండోరౌండ్లోకి ప్రవేశించింది. తొలిరౌండ్లో టాప్‌సీడ్ సానియా-హింగిస్ 6-2, 6-2తో జరినా దియాస్ (కజకిస్తాన్)-సాయ్‌సాయ్ జెంగ్ (చైనా) లపై విజయం సాధించారు. మ్యాచ్ మొత్తం పూర్తి ఆధిపత్యం ప్ర దర్శించిన భారత్-స్విస్ ద్వయం ఎనిమిది బ్రేక్ పాయింట్లలో నా లుగింటిని సద్వినియోగం చేసుకుంది. మరోవైపు దియాస్-జెంగ్ జంట... ఆరు అవకాశాల్లో ఒక్కదాన్ని కూడా ఉపయోగించుకోలేకపోయింది. రెండోరౌండ్లో సానియా జోడి... కిమికో-షియావోన్లతో తలపడుతుంది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో మహేశ్ భూపతి-జాంకో టిప్సరెవిచ్ (సెర్బియా) 3-6, 3-6, 2-6తో లిండ్స్టెడెట్ (స్వీడన్)-మెల్జెర్ (ఆస్ట్రియా) చేతిలో ఓడారు. సర్వీస్‌లో ఎక్కువ పాయింట్లు సాధించిన లిండ్స్టెడెట్ జోడి 10 ఏస్‌లు సంధించింది. అయితే మ్యాచ్ మొత్తంలో భూపతి ద్వయం ఒకే ఒక్క ఏస్‌తో సరిపెట్టుకుంది. -
సానియా జోడి ఓటమి
మూడో రౌండ్లో పేస్ జంట వింబుల్డన్ టోర్నీ లండన్: ప్రతిష్టాత్మక వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు లభించాయి. మహిళల డబుల్స్‌లో సానియా మీర్జా (భారత్)-కారా బ్లాక్ (జింబాబ్వే) జోడి రెండో రౌండ్లో నిష్ర్కమించగా... లియాండర్ పేస్ (భారత్)-రాడెక్ స్టెపానెక్ (చెక్ రిపబ్లిక్) ద్వయం మూడో రౌండ్లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన మహిళల డబుల్స్‌లో నాలుగో సీడ్ సానియా-కారా బ్లాక్ (జింబాబ్వే) జోడి 6-2, 6-7 (7/9), 4-6 తేడాతో అన్‌సీడెడ్ పావ్లీచెంకోవా (రష్యా)-సఫరోవా (చెక్ రిపబ్లిక్) జంట చేతిలో ఓడింది. ఈ సీజన్ గ్రాండ్‌స్లామ్‌లలో సానియాకు ఇదే చెత్త ప్రదర్శన. అయితే ఆమెకు మిక్స్డ్ డబుల్స్‌లో ఆశలు ఇంకా మిగిలే ఉన్నాయి. రుమేనియా ఆటగాడు హోరియా టెకావుతో కలిసి సోమవారం సానియా తమ తొలిరౌండ్ మ్యాచ్ ఆడనుంది. మరోవైపు ఐదోసీడ్‌గా బరిలోకి దిగిన పేస్-స్టెపానెక్ జోడి రెండో రౌండ్లో 3-6, 6-1, 3-6, 6-3, 11-9 తేడాతో సాంటియాగో గొంజాలెజ్ (మెక్సికో)- స్కాట్ లిప్స్కీ (అమెరికా) జంటపై చెమటోడ్చి నెగ్గింది. వింబుల్డన్ టోర్నీలో తొలి ఆదివారం విశ్రాంతి దినం. సోమవారం పురుషుల, మహిళల సింగిల్స్ విభాగాలలో మూడో రౌండ్, నాలుగో రౌండ్ మ్యాచ్‌లు జరుగుతాయి. -
సెరెనాకు షాక్
మూడో రౌండ్లోనే ఓటమి ప్రిక్వార్టర్స్‌లో నాదల్ లండన్: వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్లో పెను సంచలనం నమోదైంది. మహిళల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ సెరెనా విలియమ్స్ (అమెరికా) మూడో రౌండ్లోనే నిష్ర్కమించింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో అలైజ్ కార్నెట్ (ఫ్రాన్స్) 1-6, 6-3, 6-4తో సెరెనాను బోల్తా కొట్టించింది. మరోవైపు వరుసగా మూడో మ్యాచ్‌లో తొలిసెట్ ఓటమి నుంచి తేరుకున్న స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ ఈ టోర్నమెంట్లో తన జోరు కొనసాగిస్తున్నాడు. పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో రెండోసీడ్ నాదల్ 6-7 (4/7), 6-1, 6-1, 6-1తో మిఖైల్ కుక్‌ష్కిన్ (కజకిస్థాన్)పై గెలిచి ప్రిక్వార్టర్స్‌లోకి అడుగుపెట్టాడు. మ్యాచ్ ప్రారంభమైన 15 నిమిషాలకే వర్షం అంతరాయం కలిగించింది. దాదాపు రెండున్నర గంటలకు పైగా సాగిన ఈ మ్యాచ్‌లో స్పెయిన్ ప్లేయర్ తొలిసెట్‌ను చేజార్చుకున్నాడు. అయితే రెండోసెట్లో 1-1 నుంచి నాలుగోసెట్లో 3-0 స్కోరు వరకు నాదల్ 15 గేమ్‌ల్లో 14 గెలిచాడు. నాలుగో సెట్లో స్కోరు 2-0 ఉన్నప్పుడు తొలి బ్రేక్ పాయింట్‌ను ఎదుర్కొన్నాడు. కుక్‌ష్కిన్ నుంచి పెద్దగా ప్రతిఘటన లేకపోవడంతో చివరి మూడుసెట్లలో నాదల్ ఆధిపత్యమే కొనసాగింది. ఓవరాల్‌గా 12 అనవసర తప్పిదాలు చేసిన మాజీ చాంపియన్ 41 విన్నర్స్‌తో మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. మహిళల సింగిల్స్ మూడోరౌండ్లో ఐదోసీడ్ షరపోవా (రష్యా) 6-3, 6-0తో అలిసన్ రిస్కి (అమెరికా)పై నెగ్గింది. వర్షం కారణంగా శనివారం చాలా మ్యాచ్‌లు రద్దయ్యాయి. -
నా లీ నిష్ర్కమణ
మూడో రౌండ్లో ఓడిన రెండో సీడ్ సిబుల్కోవా, వీనస్ కూడా ఇంటిముఖం ప్రిక్వార్టర్స్‌లో జొకోవిచ్ లండన్: తొలి నాలుగు రోజులు సాఫీగా సాగిన వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల విభాగంలో శుక్రవారం రెండు సంచలనాలు నమోదయ్యాయి. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్, రెండో సీడ్ నా లీ (చైనా)... అదే టోర్నీలో రన్నరప్, పదో సీడ్ సిబుల్కోవా (స్లొవేకియా) మూడో రౌండ్లో నిష్ర్కమించారు. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో అన్‌సీడెడ్ బార్బరా జహలోవా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్) 7-6 (7/5), 7-6 (7/5)తో నా లీని బోల్తా కొట్టించగా... లూసీ సఫరోవా (చెక్ రిపబ్లిక్) 6-4, 6-2తో సిబుల్కోవాను ఓడించింది. మరో మ్యాచ్‌లో ఆరో సీడ్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్) 5-7, 7-6 (7/2), 7-5తో ఐదుసార్లు చాంపియన్, 30వ సీడ్ వీనస్ విలియమ్స్ (అమెరికా)ను ఓడించింది. ఇతర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో మూడో సీడ్ సిమోనా హలెప్ (రుమేనియా) 6-3, 4-6, 6-4తో సురెంకో (ఉక్రెయిన్)పై, నాలుగో సీడ్ అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలండ్) 6-2, 6-0తో లార్చర్ డి బ్రిటో (పోర్చుగల్)పై గెలిచారు. పురుషుల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా), 14వ సీడ్ సోంగా (ఫ్రాన్స్), 15వ సీడ్ జనోవిచ్ (పోలండ్) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. మూడో రౌండ్లో జొకోవిచ్ 6-4, 6-2, 6-4తో సిమోన్ (ఫ్రాన్స్)పై, సోంగా 6-2, 6-2, 7-5తో వాంగ్ (చైనీస్ తైపీ)పై, జనోవిచ్ 7-5, 6-4, 6-7 (7/9), 4-6, 6-3తో 2002 చాంపియన్ లీటన్ హెవిట్ (ఆస్ట్రేలియా)పై గెలిచారు. ఇతర మ్యాచ్‌ల్లో 19వ సీడ్ ఫాగ్నిని (ఇటలీ) 6-4, 4-6, 6-2, 2-6, 1-6తో అండర్సన్ (దక్షిణాఫ్రికా) చేతిలో; 30వ సీడ్ గ్రానోలెర్స్ (స్పెయిన్) 6-4, 6-7 (2/7), 6-1, 1-6, 5-7తో గిరాల్డో (కొలంబియా) చేతిలో ఓడిపోయారు. గురువారం ఆలస్యంగా ముగిసిన రెండో రౌండ్ మ్యాచ్‌లో నాలుగో సీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) 6-3, 7-5, 6-3తో గైల్స్ ముల్లర్ (లక్సెంబర్గ్)ను ఓడించాడు.