ఎదురులేని ఫెడరర్
మూడో రౌండ్‌లోకి ప్రవేశం
ముర్రే, సోంగా, క్విటోవా కూడా...
మకరోవాకు షాక్
వింబుల్డన్ టెన్నిస్ టోర్నీ
లండన్: వింబుల్డన్‌లో ఎనిమిదో టైటిల్ కోసం బరిలోకి దిగిన స్విస్ స్టార్ రోజర్ ఫెడరర్ ఎదురులేకుండా దూసుకుపోతున్నాడు. తొలి రౌండ్‌లో వరుస సెట్లలో ప్రత్యర్థిని హోరెత్తించిన ఫెడెక్స్.. రెండోరౌండ్‌లోనూ అదే జోరు కనబర్చాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో రెండోసీడ్ ఫెడరర్ 6-4, 6-2, 6-2తో అన్‌సీడెడ్ సామ్ క్వెరీ (అమెరికా)పై విజయాన్ని సాధించి మూడో రౌండ్‌లోకి ప్రవేశించాడు.
గంటా 25 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఫెడరర్ పదునైన సర్వీస్‌లు, బలమైన ఫోర్‌హ్యాండ్, బ్యాక్‌హ్యాండ్ షాట్లతో పాటు బేస్‌లైన్ గేమ్‌తో ప్రత్యర్థిని కట్టడి చేశాడు. ఏడేళ్ల తర్వాత ఫెడరర్‌తో తలపడుతుండటంతో మ్యాచ్ ఆరంభంలో క్వెరీ కాస్త పోటీ ఇచ్చేటట్లు కనిపించినా తర్వాత చతికిలపడ్డాడు.
తొలిసెట్ ఆరంభంలో ఇరువురు సర్వీస్‌లను నిలబెట్టుకోవడంతో ఓ దశలో స్కోరు 4-4తో సమమైంది. అయితే తొమ్మిదో గేమ్‌లో స్కోరు 40-40 ఉన్న దశలో క్వెరీ సర్వీస్‌ను బ్రేక్ చేసి ఫెడరర్ 5-4 ఆధిక్యంలో నిలిచాడు. తర్వాతి గేమ్‌లో సర్వీస్‌ను నిలబెట్టుకుని సెట్‌ను సాధించాడు. రెండో సెట్‌లోనూ అదే జోరు కనబర్చిన ఫెడరర్ ఆరంభంలోనే క్వెరీ సర్వీస్‌ను బ్రేక్ చేసి తర్వాతి గేమ్‌లో సర్వీస్ నిలబెట్టుకుని 2-0 ఆధిక్యంలో నిలిచాడు. తర్వాత ఇరువురు సర్వీస్‌లు నిలబెట్టుకోవడంతో స్కోరు 4-2గా మారింది.
ఏడో గేమ్‌లో స్విస్ స్టార్ కాళ్ల మధ్య నుంచి కొట్టిన అద్భుతమైన షాట్‌కు క్వెరీ సమాధానం చెప్పలేక గేమ్‌ను కోల్పోయాడు. ఎనిమిదో గేమ్‌లో సర్వీస్‌ను నిలబెట్టుకుని ఫెడరర్ సెట్‌ను చేజిక్కించుకున్నాడు. ఇక మూడో సెట్‌లోనూ క్వెరీ సర్వీస్‌ను బ్రేక్ చేసి ఆధిక్యాన్ని సంపాదించిన ఫెడరర్ చివరి వరకు దాన్ని కొనసాగించాడు. స్కోరు 5-2 ఉన్న దశలో సర్వీస్‌ను కాపాడుకుని విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఓవరాల్‌గా వింబుల్డన్‌లో ఫెడరర్‌కు ఇది 75వ విజయం.
ముర్రే ముందుకు...
పురుషుల సింగిల్స్ ఇతర మ్యాచ్‌ల్లో మూడోసీడ్ ముర్రే (బ్రిటన్) 6-1, 6-1, 6-4తో రాబిన్ హాస్ (నెదర్లాండ్స్)పై; 6వ సీడ్ బెర్డిచ్ (చెక్) 6-1, 6-4, 6-4తో మహుట్ (ఫ్రాన్స్)పై; 12వ సీడ్ సిమోన్ (ఫ్రాన్స్) 6-1, 6-1, 6-7 (5), 6-1తో బ్లాజ్ కవిచ్ (స్లోవేనియా)పై; 13వ సీడ్ విల్‌ఫ్రెడ్ సోంగా (ఫ్రాన్స్) 6-3, 6-4, 6-4తో రామోస్ వినోలాస్ (స్పెయిన్)పై; 20వ సీడ్ అగుట్ (స్పెయిన్) 2-6, 4-6, 6-3, 6-3, 6-3తో బినోయిట్ పెయిర్ (ఫ్రాన్స్)పై నెగ్గి మూడోరౌండ్‌లోకి అడుగుపెట్టారు.
మకరోవాకు చుక్కెదురు
మహిళల సింగిల్స్‌లో రష్యా క్రీడాకారిణి ఎకతెరినా మకరోవా (రష్యా)కు చుక్కెదురైంది. రెండో రౌండ్‌లో రెబరికోవా (స్లోవేకియా) 6-2, 7-5తో మకరోవాపై నెగ్గి మూడోరౌండ్‌లోకి ప్రవేశించింది. ఇతర మ్యాచ్‌ల్లో రెండోసీడ్ పెట్రా క్విటోవా (చెక్) 6-2, 6-0తో కురుమి నారా (జపాన్)పై; 5వ సీడ్ వోజ్నియాకి (డెన్మార్క్) 6-1, 7-6 (6) డెనిసా అలెర్టోవా (చెక్)పై; 10వ సీడ్ కెర్బర్ (జర్మనీ) 7-5, 6-2తో పాల్వెంచుకోవా (రష్యా)పై; 13వ సీడ్ రద్వాన్‌స్కా (పోలెండ్) 6-0, 6-2తో అజిలా టోమ్‌జానోవిచ్ (ఆస్ట్రేలియా)పై; 15వ సీడ్ బాసిన్‌స్కీ (స్విట్జర్లాండ్) 6-2, 6-1తో ఈస్సోనిసా (స్పెయిన్)పై; డెల్లాక్వా (ఆస్ట్రేలియా) 7-6 (3), 6-3తో 17వ సీడ్ ఎలినా స్వితోలినా (ఉక్రెయిన్)పై; 18వ సీడ్ లిసికి (జర్మనీ) 2-6, 7-5, 6-1తో మెక్ హాలే (అమెరికా) పై; 21వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా) 6-4, 7-6 (3)తో కులిచ్‌కోవా (రష్యా)పై; 28వ సీడ్ జంకోవిచ్ (సెర్బియా) 6-7 (4), 6-1, 6-3తో రోడినా (రష్యా)పై గెలిచి మూడోరౌండ్‌కు చేరారు.
రెండోరౌండ్‌లో సానియా జోడి
భారత స్టార్ ప్లేయర్ సానియా మీర్జా-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడి మహిళల డబుల్స్‌లో రెండోరౌండ్‌లోకి ప్రవేశించింది. తొలిరౌండ్‌లో టాప్‌సీడ్ సానియా-హింగిస్ 6-2, 6-2తో జరినా దియాస్ (కజకిస్తాన్)-సాయ్‌సాయ్ జెంగ్ (చైనా) లపై విజయం సాధించారు. మ్యాచ్ మొత్తం పూర్తి ఆధిపత్యం ప్ర దర్శించిన భారత్-స్విస్ ద్వయం ఎనిమిది బ్రేక్ పాయింట్లలో నా లుగింటిని సద్వినియోగం చేసుకుంది. మరోవైపు దియాస్-జెంగ్ జంట... ఆరు అవకాశాల్లో ఒక్కదాన్ని కూడా ఉపయోగించుకోలేకపోయింది.
రెండోరౌండ్‌లో సానియా జోడి... కిమికో-షియావోన్‌లతో తలపడుతుంది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో మహేశ్ భూపతి-జాంకో టిప్సరెవిచ్ (సెర్బియా) 3-6, 3-6, 2-6తో లిండ్‌స్టెడెట్ (స్వీడన్)-మెల్జెర్ (ఆస్ట్రియా) చేతిలో ఓడారు. సర్వీస్‌లో ఎక్కువ పాయింట్లు సాధించిన లిండ్‌స్టెడెట్ జోడి 10 ఏస్‌లు సంధించింది. అయితే మ్యాచ్ మొత్తంలో భూపతి ద్వయం ఒకే ఒక్క ఏస్‌తో సరిపెట్టుకుంది.