నా లీ నిష్ర్కమణ
మూడో రౌండ్‌లో ఓడిన రెండో సీడ్
సిబుల్కోవా, వీనస్ కూడా ఇంటిముఖం
ప్రిక్వార్టర్స్‌లో జొకోవిచ్
లండన్: తొలి నాలుగు రోజులు సాఫీగా సాగిన వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల విభాగంలో శుక్రవారం రెండు సంచలనాలు నమోదయ్యాయి. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్, రెండో సీడ్ నా లీ (చైనా)... అదే టోర్నీలో రన్నరప్, పదో సీడ్ సిబుల్కోవా (స్లొవేకియా) మూడో రౌండ్‌లో నిష్ర్కమించారు.
హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో అన్‌సీడెడ్ బార్బరా జహలోవా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్) 7-6 (7/5), 7-6 (7/5)తో నా లీని బోల్తా కొట్టించగా... లూసీ సఫరోవా (చెక్ రిపబ్లిక్) 6-4, 6-2తో సిబుల్కోవాను ఓడించింది. మరో మ్యాచ్‌లో ఆరో సీడ్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్) 5-7, 7-6 (7/2), 7-5తో ఐదుసార్లు చాంపియన్, 30వ సీడ్ వీనస్ విలియమ్స్ (అమెరికా)ను ఓడించింది.
ఇతర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో మూడో సీడ్ సిమోనా హలెప్ (రుమేనియా) 6-3, 4-6, 6-4తో సురెంకో (ఉక్రెయిన్)పై, నాలుగో సీడ్ అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలండ్) 6-2, 6-0తో లార్చర్ డి బ్రిటో (పోర్చుగల్)పై గెలిచారు.
పురుషుల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా), 14వ సీడ్ సోంగా (ఫ్రాన్స్), 15వ సీడ్ జనోవిచ్ (పోలండ్) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. మూడో రౌండ్‌లో జొకోవిచ్ 6-4, 6-2, 6-4తో సిమోన్ (ఫ్రాన్స్)పై, సోంగా 6-2, 6-2, 7-5తో వాంగ్ (చైనీస్ తైపీ)పై, జనోవిచ్ 7-5, 6-4, 6-7 (7/9), 4-6, 6-3తో 2002 చాంపియన్ లీటన్ హెవిట్ (ఆస్ట్రేలియా)పై గెలిచారు. ఇతర మ్యాచ్‌ల్లో 19వ సీడ్ ఫాగ్‌నిని (ఇటలీ) 6-4, 4-6, 6-2, 2-6, 1-6తో అండర్సన్ (దక్షిణాఫ్రికా) చేతిలో; 30వ సీడ్ గ్రానోలెర్స్ (స్పెయిన్) 6-4, 6-7 (2/7), 6-1, 1-6, 5-7తో గిరాల్డో (కొలంబియా) చేతిలో ఓడిపోయారు. గురువారం ఆలస్యంగా ముగిసిన రెండో రౌండ్ మ్యాచ్‌లో నాలుగో సీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) 6-3, 7-5, 6-3తో గైల్స్ ముల్లర్ (లక్సెంబర్గ్)ను ఓడించాడు.