లండన్: ఈ ఏడాది తన అద్వితీయ ఆటతీరు కొనసాగిస్తూ సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఆరోసారి చాంపియన్‌గా నిలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ జొకోవిచ్ 3 గంటల 24 నిమిషాల్లో 6–7 (4/7), 6–4, 6–4, 6–3తో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ బెరెటిని (ఇటలీ)పై గెలుపొందాడు. తద్వారా తన కెరీర్‌లో 20వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సాధించాడు.
ఈ క్రమంలో పురుషుల టెన్నిస్ చరిత్రలో అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారులుగా ఫెడరర్ (స్విట్జర్లాండ్), రాఫెల్ నాదల్ (స్పెయిన్–20 చొప్పున) పేరిట ఉన్న రికార్డును జొకోవిచ్ సమం చేశాడు. విజేతగా నిలిచిన జొకోవిచ్‌కు 17 లక్షల పౌండ్లు (రూ. 17 కోట్ల 61 లక్షలు), రన్నరప్ బెరెటినికి 9 లక్షల పౌండ్లు (రూ. 9 కోట్ల 32 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఈ సీజన్‌లో ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్‌లోనూ చాంపియన్‌గా నిలిచిన 34 ఏళ్ల జొకోవిచ్ సెప్టెంబర్‌లలో జరిగే యూఎస్ ఓపెన్‌లోనూ గెలిస్తే రాడ్ లేవర్ (1969లో) తర్వాత ‘క్యాలెండర్ గ్రాండ్‌స్లామ్’ ఘనత సాధించిన ప్లేయర్‌గా రికార్డు సృష్టిస్తాడు.
తొలి సెట్ కోల్పోయినా...
కెరీర్‌లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడుతున్న బెరెటిని ఆరంభంలో తడబడ్డాడు. కెరీర్‌లో 30వ గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడుతున్న జొకోవిచ్ నాలుగో గేమ్‌లో బెరెటిని సర్వీస్‌ను బ్రేక్ చేసి అదే జోరు కొనసాగించి 5–2తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అయితే నెమ్మదిగా తేరుకున్న బెరెటిని వరుసగా మూడు గేమ్‌లు గెలిచి స్కోరును 5–5తో సమం చేశాడు. ఆ తర్వాత ఇద్దరూ తమ సర్వీస్‌లను నిలబెట్టుకోవడంతో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో బెరెటిని పైచేయి సాధించి తొలి సెట్‌ను సొంతం చేసుకున్నాడు. తొలి సెట్ కోల్పోయినా అపార అనుభవజ్ఞుడైన జొకోవిచ్ ఒత్తిడికి లోనుకాకుండా సహజశైలిలో ఆడాడు. వరుసగా మూడు సెట్‌లను సొంతం చేసుకొని బెరెటిని ఆశలను వమ్ము చేశాడు.
జొకోవిచ్ 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్
ఆస్ట్రేలియన్ ఓపెన్ (9): 2008, 2011, 2012, 2013, 2015, 2016, 2019, 2020, 2021
ఫ్రెంచ్ ఓపెన్ (2): 2016, 2021: వింబుల్డన్ (6): 2011, 2014, 2015, 2018, 2019, 2021
యూఎస్ ఓపెన్ (3): 2011, 2015, 2018
Comments
Please login to add a commentAdd a comment