'కింగ్ మేకర్' అవుతానని..!
అసోం ఎన్నికల్లో కింగ్ మేకర్ రోల్ ప్లే చేస్తానన్న సెంటు దిగ్గజం మౌలానా బద్రుద్దీన్ అజ్మల్ భారతీయ జనతా పార్టీ జోరుకు నిలబడలేక పోయారు. అసోంలో పోలింగ్ పూర్తయిన తర్వాత ఆల్ ఇండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫండ్ (ఏఐయూడీఎఫ్) సాయం లేకుండా ఏ పార్టీ అధికారంలోకి రాదని ఆయన అన్నారు. పార్టీని నిలబెట్టడం మాట అటుంచి తానే గెలవలేక చతికిలపడ్డారు.
ఎన్నికల ఫలితాల్లో పార్టీ కేవలం 13 సీట్లకు మాత్రమే పరిమితం కావడంతో ఏఐయూడీఎఫ్ ఆశలు అడియాసలయ్యాయి. 2005లో పార్టీని స్థాపించిన నాటి నుంచి ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రభావం చూపింది. అప్పటినుంచి ప్రతి ఎన్నికలో విజయం సాధిస్తూ వస్తోన్న అజ్మల్ ఈ ఎన్నికల్లో తొలి ఓటమి రుచి చూశారు. తన సమీప కాంగ్రెస్ అభ్యర్ధి వాజెద్ అలీ చౌదరి చేతిలో 16,723 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఎన్నికల ఫలితాల అనంతరం మాట్లాడిన అజ్మల్ ప్రజల తీర్పును పాటిస్తామని.. ప్రతిపక్ష పాత్రలో నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తామని అన్నారు. ఏఐయూడీఎఫ్ ఓటమికి కాంగ్రెస్ పార్టీయే ముఖ్యకారణమని ఆయన ఆరోపించారు. ఏఐయూడీఎఫ్ సూచించినట్లు మహాకూటమిగా ఏర్పడి ఉంటే గెలిచి తీరేవాళ్లమని అన్నారు.