కార్మికుల చట్టాలను కాలరాయొద్దు
సమ్మెను జయప్రదం చేయాలంటూ బైక్ ర్యాలీ
శంషాబాద్ : కార్మికుల చట్టాలను కేంద్ర ప్రభుత్వం కాలరాసే యత్నం చేస్తోందని టీఆర్ఎస్ కార్మిక విభాగం రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్చార్జీ పానుగంటి ఆనంద్ ఆరోపించారు. కార్మికుల డిమాండ్ల పరిష్కారం కోసం సెప్టెంబరు 2 దేశవ్యాప్తంగా నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలంటూ మంగళవారం సీఐటీయూతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికుల శ్రేయస్సుకు సంబంధించిన 12 డిమాండ్లను కేంద్ర సర్కారు వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రతి కార్మికుడికి ఉద్యోగ భద్రతను కల్పించడంతో పాటు కనీస వేతనాన్ని రూ. 18 వేలకు పెంచాలని కోరారు. ఈఎస్ఐ, బోనస్‌లు ప్రకటించాలన్నారు.
కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందిని వెంటనే క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. కార్మిక చట్టాల సవరణతో కార్పొరేట్ సంస్థలు లాభపడుతున్నాయన్నారు. సార్వత్రిక సమ్మెలో కార్మికులందరూ విధిగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్మికుల చట్టాలను ప్రభుత్వాలు విస్మరిస్తుండడంతో పరిశ్రమల యజమానులు, కార్పొరేట్ సంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని సీఐటీయూ రాజేంద్రనగర్ జోన్ నాయకులు నీరటి మల్లేష్ ఆరోపించారు. శంషాబాద్‌లో మొదలైన బైక్ ర్యాలీ సాతంరాయి, గగపహాడ్ పారిశ్రామిక వాడల మీదుగా కాటేదాన్ చేరుకుంది. ర్యాలీలో టీఆర్ఎస్కేవీ జిల్లా ఉపాధ్యక్షుడు దామోదర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు మల్లేష్, శ్రీధర్, అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.