woman murder mystery
-
భర్తే హంతకుడు
ఏలూరు టౌన్: ఏలూరు రూరల్ పోలీసు స్టేషన్లో ఏలూరు డీఎస్పీ డాక్టర్ ఓ.దిలీప్‌కిరణ్ శుక్రవారం విలేకరుల సమావేశంలో ఈ కేసు వివరాలు వెల్లడించారు. ఆయనతోపాటు రూరల్ సీఐ ఏ.శ్రీనివాసరావు ఉన్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. పెదపాడు మండలం వడ్డిగూడెం గ్రామానికి చెందిన ఘంటసాల ఉదయకుమార్ రాజుకు, కృష్ణాజిల్లా మండవల్లి మండలం పెనుమాకలంక గ్రామానికి చెందిన ఘంటసాల చంటితో 2013లో వివాహమైంది. వారికి ఇద్దరు సంతానం ఉన్నారు. భర్త ఉదయకుమార్ రాజు వివాహేతర సంబంధాల నేపథ్యంలో ఇరువురికీ తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో 2018 మార్చి 30న అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరగటంతో ఉదయకుమార్ రాజు తన భార్య చంటిని రాడ్డుతో తలపై బలంగా కొట్టటంతో ఆమె చనిపోయింది. అప్పట్లో మృతురాలి తండ్రి మోరు రామకృష్ణ పెదపాడు పోలీసులకు తన కుమార్తె ప్రమాదవశాత్తు చనిపోలేదనీ, అనుమానం ఉందని ఫిర్యాదు చేశారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. కానీ దర్యాప్తు చేయకుండా ఫైలు పక్కనబెట్టేశారు. మిస్టరీ వెలుగులోకి.. పెదపాడు పోలీసు స్టేషన్లో పాత కేసులను పరిశీలిస్తున్న ఏలూరు రూరల్ సీఐ శ్రీనివాసరావుకు ఈ అనుమానాస్పద మృతికేసు ఫైలు కనిపించింది. దీంతో మృతురాలు చంటి హత్య వెనుక అసలు మిస్టరీ బయటపడింది. ఆమె మరణాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఆమె రాసినట్లు ఒక ఉత్తరాన్ని భర్త ఉదయకుమార్ రాజు రాశాడు. మెడకు తాడు బిగించి ఫ్యాన్‌కు ఉరివేసుకున్నట్లు చూపించాలని ప్రయత్నించాడు. కానీ ఆమె చెవిలో నుంచి రక్తం కారుతూ ఉండడంతో మళ్లీ మృతదేహాన్ని కిందికి దింపి బాత్రూమ్లో కాలుజారి ప్రయాదవశాత్తు పడిపోయి తలకు బలమైన గాయం తగిలి మరణించినట్లు చిత్రీకరించాడు. పోస్టుమార్టం రిపోర్ట్‌ను పరిశీలించిన పోలీసు అధికారులు కేసు మిస్టరీపై దృష్టి సారించారు. ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లెటర్, మృతురాలి మెడకు ఉరివేసినట్లు గాయం, తలలో బలమైన గాయం, లివర్ సైతం దెబ్బతిన్నట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. ఇవన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు హత్య కేసుగా నిర్ధారణకు వచ్చారు. కాగా హత్య చేసిన భయంతో గత మూడు నెలలుగా గ్రామంలో లేకుండా తిరుగుతున్న నిందితుడు ఉదయకుమార్ రాజును మాటువేసిన పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితుడు చెప్పిన నిజాలు పోలీసులను విస్తుగొలిపేలా చేశాయి. హత్య తానే చేశానని ఒప్పుకోవడంతో అతడ్ని అరెస్టు చేసి జైలుకు తరలించారు. కేసు ఛేదించటంలో ప్రతిభ చూపిన హెచ్‌సీ హమీద్, పీసీలు సతీష్, కిషోర్, నరేష్‌లను జిల్లా ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవల్ అభినందించారు. -
12 గంటల్లో.. వీడిన మిస్టరీ
బరంపురం : నగర శివారు హల్దియాపదర్ ప్రాంతంలోని రళబ గ్రామ పోలిమేరల్లో మంగళవారం పోలీసులు గుర్తించిన మహిళ సంజూ బెహరా హత్య కేసుకు సబంధించిన నిందితుని 12 గంటలు తిరక్కుండానే హత్య కేసును ఛేదించి నిందితుని అరెస్ట్ చేసి విజయం సాధించినట్లు బరంపురం ఎస్పీ పినాకి మిశ్రా చెప్పారు. బరంపురం ఎస్పీ కార్యాలయంలో బరంపురం పోలీసు జిల్లా ఆధ్వర్యంలో బుధవారం విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ పినాకి మిశ్రా మాట్లాడుతూ గోళంతరా పోలీస్‌స్టేషన్ పరిధిలో గల హల్దియాపదర్, రళవ కేవుటి వీధికి చెందిన 40 ఏళ్ల మహిళ సంజూ బెహరా మృతదేహాన్ని పోలీసులు మంగళవారం కనుగొన్నట్లు చెప్పారు. మహిళా సంజూ బెహరా హత్య కేసుపై ఆమె సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు అధారంగా ప్రత్యేకపోలీసు బృందంగా ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టామని చెప్పారు. సంజు బెహరా హత్య జరిగిన సంఘటనా స్థలంలో నిందితుని మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని దాని ఆధారంగా దర్యాప్తు ముందుకు సాగించగా పలు నిజాలు వెలుగులోకి వచ్చినట్లు చెప్పారు. నిందితుడితో వివాహేతర సంబంధం హల్దియాపదర్, రళవ కేవుటి వీధికి చెందిన 40 ఏళ్ల సంజూ బెహరా బరంపురం గేట్ బజార్ చేపల మార్కెట్లో చేపల వ్యాపారం చేస్తున్నట్లు చెప్పారు. ఇదే గేట్ బజార్లో చేపల మార్కెట్ దగ్గర టున్నా డకువా అనే యువకుడు సెలూన్ షాప్ నడుపుతున్నాడు. వీరిద్దరి మధ్య గత నాలుగేళ్లుగా ప్రేమ వ్యవహారం ఉన్నట్లు తెలుసుకున్నామన్నారు. అయితే సంజుబెహరా వివిధ ప్రేమ వ్యవహారాలు కలిగి ఉన్నట్లు టున్నా డకువా అనుమానించేవాడు. ఈ నేపథ్యంలో 17వ తేదీ రాత్రి హల్దియాపదర్ ప్రాంతంలోని రళబ దగ్గరకి టున్నా బెహరా వెళ్లి సంజు బెహరాను ఫోన్ చేసి పిలిచాడు. ఇద్దరు సైకిల్‌పై రళబ పోలిమేర శివారు ఆశ్రమం వెనుకకు వెళ్లి వారితో పాటు తీసుకువెళ్లిన బీరు బాటిల్స్ తాగారు. బీరు బాటిల్స్ పగలగొట్టి హత్య అనంతరం సంజు బెహరా ప్రేమవ్యవహారాలపై టున్నా డుక్కువ ప్రశ్నించగా వీరిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం తాగిన ఖాళీ బీరు బాటిల్స్ టున్నా పగుల గొట్టి సంజుబెహరాను పొడిచి హత్య చేశాడు. వారిద్దరి పెనుగులాటలో టున్నా డకువాకి కూడా గాయాలయ్యాయి. ఆ పెనుగులాటలో టున్నా డకువా మొబైల్ ఫోన్ పడిపోయినట్లు ఎస్పీ చెప్పారు. నిందితుడి మొబైల్‌ఫోన్‌ను పట్టుకుని దర్యాప్తు చేపట్టగా సంఘటన అంతా వెలుగులోకి వచ్చిందని ఎస్పీ పినాకి మిశ్రా వివరించారు. స్వల్ప గాయాలైన టున్నా డకువా సిటీ అస్పత్రికి వెళ్లి చికిత్సలు చేయించుకుని ఏమీ ఎరగనట్లు ఉన్నాడు. దర్యాప్తు అనంతరం నిందితుడు టున్నా డకువాని అతని నివాసంలో బుధవారం పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఎస్పీ వివరించారు. హత్యకు వాడిన పలిగిన బీరు బాటిల్ గాజు ముక్కలు, సంఘటనా స్థలంలో రక్తపు నమూనా మట్టి అనవాళ్లు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ పినాకి మిశ్రా తెలియజేశారు. -
తారను చంపింది స్నేహితుడే
బనశంకరి: బెంగళూరు కమర్షియల్ స్ట్రీట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సంగమ్ రోడ్డులోని ఓ ఇంటిలో కుళ్లిపోయిన స్థితిలో లభించిన మహిళ మృతదేహానికి సంబంధించిన కేసు మిస్టరీ వీడింది. బాకీ చెల్లించాలని కోరినందుకు స్నేహితుడే ఆమెను హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. మృతురాలు తార అనే మహిళగా నిర్ధారించారు. పోలీసుల కథనం మేరకు వివరాలు.. హెచ్ఏఎల్లో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్న గోపీనాథ్.. తార కుటుంబానికి ఆత్మీయస్నేహితుడు. ఇటీవల గోపినాథ్.. ఆమె వద్ద రూ.11 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. డబ్బు చెల్లించాలని తార కోరుతున్నా గోపినాథ్ పట్టించుకునేవాడు కాదు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆమెపై కక్ష పెంచుకున్న గోపినాథ్.. తారను చాకుతో పొడిచి దిండుతో గొంతునులిమి హత్యచేసి ఇంటికి తాళం వేశాడు. పోలీసులు గోపినాథను మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా హత్య చేసినట్లు అంగీకరించాడు. -
మాజీ ప్రియుడే హంతకుడు
కందుకూరు: ఓ మహిళ హత్య మిస్టరీని కందుకూరు పోలీసులు ఛేదించారు. మాజీ ప్రియుడే ఆమెను హత్య చేసినట్లు గుర్తించి అతడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. మండల పరిధిలోని తిమ్మాపూర్‌లో ఈనెల 8 రాత్రి అదే గ్రామానికి చెందిన మంజుల హత్య వెలుగుచూసిన విషయం తెలిసిందే. గురువారం సీఐ గిరికుమార్ కేసు వివరాలను విలేకరులకు తెలిపారు. తిమ్మాపూర్‌కు చెందిన ఆర్ల నర్సింహ కుమారై మంజుల(30)ను 2005లో ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడుకు చెందిన బాలయ్య వివాహం చేసుకున్నాడు. కొడుకు శివకుమార్(7) పుట్టిన తర్వాత మంజుల భర్త అనారోగ్యంతో మృతి చెందాడు. ఆ తర్వాత రెండేళ్లకు ఇబ్రహీంపట్నం మండలం రాయపోలుకు చెందిన యాదయ్యతో తల్లిదండ్రులు ఆమెకు ద్వితీయ వివాహం చేశారు. కాగా ఐదు నెలలు కాపురం చేసిన అనంతరం మంజుల కుమారుడితో సహా తల్లిదండ్రుల వద్దకు వచ్చేసింది. ఈనెల 5న సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన ఆమె గ్రామ సమీపంలో మాదాపూర్ వెళ్లే రహదారిలో ఎల్లమ్మ వాగు వద్ద చెట్ల పొదల్లో 8వ తేదీన రాత్రి మృతదేహంగా కనిపించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. గ్రామస్తుల సమాచారం, మంజుల ఫోన్ కాల్ డాటా ఆధారంగా నిందితుడు అదే గ్రామానికి చెందిన టిప్పర్ డ్రైవర్ గుల్వి శ్రీను(35)గా గుర్తించి అరెస్టు చేశారు. మద్యానికి బానిసైన మంజుల చెడు తిరుగుడు తిరిగేది. ఈక్రమంలో గతంలో శ్రీనుకు ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. శ్రీను తనకు పెళ్లైన తర్వాత ఆమెతో ఐదేళ్లుగా దూరంగా ఉంటున్నాడు. కాగా గత కొన్ని రోజులుగా ఆమె అతనికి ఫోన్ చేసి తనను కలవాలంటూ వేధిస్తోంది. ఈక్రమంలో ఈ నెల 5న సాయంత్రం 4.30 గంటల నుంచి 5.50 వరకు 42 సార్లు ఫోన్ చేసిన మంజుల శ్రీనును గ్రామ శివారుకు రప్పించుకుంది. సాయంత్రం ఇద్దరూ ఎల్లమ్మ వాగు సమీపంలో మద్యం తాగారు. అనంతరం మంజుల తనను ఎందుకు పట్టించుకోవడం లేదంటూ శ్రీనుతో వాగ్వాదానికి దిగింది. నన్నైనా చంపు.. లేదా నేనైనా నిన్ను చంపుతానంటూ బెదిరించింది. దీంతో ఆగ్రహానికి గురైన శ్రీను మంజుల మెడకు చీరతో బిగించి ఉరివేసి చంపేశాడు. ఆమె సెల్‌ఫోన్ నుంచి సిమ్ కార్డు తీసి అక్కడే పడేసి ఫోన్‌తో ఉడాయించాడు. ఇలా పట్టుబడ్డాడు.. కాగా 8న సాయంత్రం మంజుల, శ్రీను గ్రామ శివారుకు వెళ్లడం తాము చూశామని కొందరు గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు హతురాలి ఫోన్‌కాల్ డేటాను సేకరించారు. అదే రోజు సాయంత్రం సమయంలో 42 సార్లు మంజుల శ్రీనుతో 5011 సెకన్లపాటు మాట్లాడినట్లు గుర్తించారు.అనుమానంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించి పైవిషయాలు తెలిపాడు. అతడిపై కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం రిమాండుకు తరలించారు. కేసును త్వరగా ఛేదించిన ఎస్ఐ మల్లికార్జున్‌తో పాటు కానిస్టేబుళ్లు బి.చిరంజన్, వి.సురేష్, జి.శ్రీధర్, ఎ.యాదయ్యలను సీఐ ప్రత్యేకంగా అభినందించారు. -
వీడిన మహిళ హత్యకేసు మిస్టరీ
ప్రియుడు, ప్రియురాలి అరెస్టు చేవెళ్ల రూరల్: ఓ మహిళ హత్య కేసులో పోలీసులు ప్రియుడు, ప్రియురాలిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. తనతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తి మరో మహిళతోనూ సంబంధం పెట్టుకోవడంతో కక్షగట్టిన ఆమె ప్రియుడితో కలిసి చంపించింది. చేవెళ్ల మండలం ధర్మసాగర్ సమీపంలో ఈనెల 2న వెలుగుచూసిన మహిళ హత్య మిస్టరీని పోలీసులు ఛేదించారు. శనివారం చేవెళ్ల ఠాణాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ నాగేశ్వర్రావు కేసు వివరాలు వెల్లడించారు. శంకర్పల్లి మండలం ఎల్వర్తి గ్రామానికి చెందిన కె. యాదమ్మ కొన్నాళ్ల క్రితం భర్తను వదిలేసింది. ఐదేళ్లుగా చేవెళ్ల సీపీఐ కాలనీలో నివాసముంటోంది. ఇటీవలే ఆమె అదే కాలనీలో ఓ ఇల్లు కొనుగోలు చేసింది. ఓ గదిని సుగుణమ్మ(42)కు అద్దెకు ఇచ్చింది. ఇదిలా ఉండగా యాదమ్మకు చేవెళ్ల మండలంలోని ధర్మసాగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ వెంకటేశ్ తో వివాహేతర సంబంధం ఉంది. తరచూ యాదమ్మ ఇంటికి వచ్చే అతడికి సుగుణమ్మతో కూడా పరిచయమై ‘సంబంధం’ ఏర్పడింది. వారిద్దరు చనువుగా ఉండడం యాదమ్మ జీర్ణించుకోలేకపోయింది. వెంకటేశ్ తనకు కాకుండా పోతాడని ఆందోళనకు గురైంది. ఎలాగైనా సుగుణమ్మను చంపాలని ఆమె నిర్ణయించుకుంది. ఈక్రమంలో సుగుణమ్మ తనతో అకారణంగా గొడవపడుతోందని, లేనిపోని అభాండాలు వేసి వెంకటేశ్‌కు చెప్పింది. ఇద్దరూ కలిసి సుగుణమ్మను హత్య చేయాలని పథకం వేశారు. ఈక్రమంలో ఈనెల 1న చేవెళ్ల బస్‌స్టేషన్ సమీపంలో వారు తరుచూ కలుసుకునే ప్రాంతంలో యాదమ్మ ప్రియుడిని కలిసింది. సుగుణమ్మకు యాదమ్మ ఫోన్ చేసి తాను దావత్ ఇస్తాను అని చెప్పింది. దీంతో సాయంత్రం సుగుణమ్మ కల్లు దుకాణం వద్దకు వచ్చింది. అక్కడ కల్లు తాగి ఓ ఆటోలో ధర్మసాగర్ సమీపంలోకి వెళ్లారు. పథకం ప్రకారం వెంకటేష్ అక్కడికి ముందే వెళ్లి వేచి చూస్తున్నాడు. ముగ్గురూ కలిసి మద్యం తాగారు. సుగుణమ్మకు కాస్తా ఎక్కువగా మద్యం తాగించారు. మత్తులో ఉన్న ఆమె చెంపపై యాదమ్మ బలంగా కొట్టింది. దీంతో సుగుణమ్మ కిందపడింది. వెంకటేశ్ సుగుణమ్మను గట్టిగా పట్టుకున్నాడు. యాదమ్మ సుగుణమ్మ చీరకొంగుతోనే మెడకు గట్టిగా బిగించింది. ఇద్దరూ కలిసి ఉరిబిగించి సుగుణమ్మను చంపేశారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరుసటి రోజు స్థానికుల సమాచారంతో సీఐ నాగేశ్వర్, ఎస్ఐ ఖలీల్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సుగుణమ్మ ఇంటి యజమాని యాదమ్మపై అనుమానం రావటంతో ఆమెను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు అంగీకరించింది. ఆమె ఫోన్‌ను పరిశీలించగా హత్య జరిగిన రోజు సుగుణమ్మతో మాట్లాడినట్లుగా ఉంది. వెంకటేశ్ నంబర్ కూడా ఉండడంతో అతడినీ అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించాడు. ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు. సమావేశంలో ఎస్ఐలు లక్ష్మీరెడ్డి, ఎండీ. ఖలీల్ కూడా ఉన్నారు.