వీడిన మహిళ హత్యకేసు మిస్టరీ | police chases the woman murder mystery | Sakshi
Sakshi News home page

వీడిన మహిళ హత్యకేసు మిస్టరీ

Published Sun, Jun 15 2014 12:38 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

వీడిన మహిళ హత్యకేసు మిస్టరీ - Sakshi

వీడిన మహిళ హత్యకేసు మిస్టరీ

ప్రియుడు, ప్రియురాలి అరెస్టు
 
చేవెళ్ల రూరల్: ఓ మహిళ హత్య కేసులో పోలీసులు ప్రియుడు, ప్రియురాలిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. తనతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తి మరో మహిళతోనూ సంబంధం పెట్టుకోవడంతో కక్షగట్టిన ఆమె ప్రియుడితో కలిసి చంపించింది. చేవెళ్ల మండలం ధర్మసాగర్  సమీపంలో ఈనెల 2న వెలుగుచూసిన మహిళ హత్య మిస్టరీని పోలీసులు ఛేదించారు. శనివారం చేవెళ్ల ఠాణాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ నాగేశ్వర్‌రావు కేసు వివరాలు వెల్లడించారు. శంకర్‌పల్లి మండలం ఎల్వర్తి గ్రామానికి చెందిన కె. యాదమ్మ కొన్నాళ్ల క్రితం భర్తను వదిలేసింది. ఐదేళ్లుగా చేవెళ్ల సీపీఐ కాలనీలో నివాసముంటోంది. ఇటీవలే ఆమె అదే కాలనీలో ఓ ఇల్లు కొనుగోలు చేసింది.
 
ఓ గదిని సుగుణమ్మ(42)కు అద్దెకు ఇచ్చింది. ఇదిలా ఉండగా యాదమ్మకు చేవెళ్ల మండలంలోని ధర్మసాగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ వెంకటేశ్ తో వివాహేతర సంబంధం ఉంది. తరచూ యాదమ్మ ఇంటికి వచ్చే అతడికి సుగుణమ్మతో కూడా పరిచయమై ‘సంబంధం’ ఏర్పడింది. వారిద్దరు చనువుగా ఉండడం యాదమ్మ జీర్ణించుకోలేకపోయింది. వెంకటేశ్ తనకు కాకుండా పోతాడని ఆందోళనకు గురైంది. ఎలాగైనా సుగుణమ్మను చంపాలని ఆమె నిర్ణయించుకుంది. ఈక్రమంలో సుగుణమ్మ తనతో అకారణంగా గొడవపడుతోందని, లేనిపోని అభాండాలు వేసి వెంకటేశ్‌కు చెప్పింది.
 
ఇద్దరూ కలిసి సుగుణమ్మను హత్య చేయాలని పథకం వేశారు. ఈక్రమంలో ఈనెల 1న చేవెళ్ల బస్‌స్టేషన్ సమీపంలో వారు తరుచూ కలుసుకునే ప్రాంతంలో యాదమ్మ ప్రియుడిని కలిసింది. సుగుణమ్మకు యాదమ్మ ఫోన్ చేసి తాను దావత్ ఇస్తాను అని చెప్పింది. దీంతో సాయంత్రం సుగుణమ్మ కల్లు దుకాణం వద్దకు వచ్చింది. అక్కడ కల్లు తాగి ఓ ఆటోలో ధర్మసాగర్ సమీపంలోకి వెళ్లారు. పథకం ప్రకారం వెంకటేష్ అక్కడికి ముందే వెళ్లి వేచి చూస్తున్నాడు. ముగ్గురూ కలిసి మద్యం తాగారు. సుగుణమ్మకు కాస్తా ఎక్కువగా మద్యం తాగించారు. మత్తులో ఉన్న ఆమె చెంపపై యాదమ్మ బలంగా కొట్టింది. దీంతో సుగుణమ్మ కిందపడింది.
 
వెంకటేశ్ సుగుణమ్మను గట్టిగా పట్టుకున్నాడు. యాదమ్మ సుగుణమ్మ చీరకొంగుతోనే మెడకు గట్టిగా బిగించింది. ఇద్దరూ కలిసి ఉరిబిగించి సుగుణమ్మను చంపేశారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరుసటి రోజు స్థానికుల సమాచారంతో సీఐ నాగేశ్వర్, ఎస్‌ఐ ఖలీల్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సుగుణమ్మ ఇంటి యజమాని యాదమ్మపై అనుమానం రావటంతో ఆమెను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు అంగీకరించింది. ఆమె ఫోన్‌ను పరిశీలించగా హత్య జరిగిన రోజు సుగుణమ్మతో మాట్లాడినట్లుగా ఉంది. వెంకటేశ్ నంబర్ కూడా ఉండడంతో అతడినీ అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించాడు. ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు. సమావేశంలో ఎస్‌ఐలు లక్ష్మీరెడ్డి, ఎండీ. ఖలీల్ కూడా ఉన్నారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement