కందుకూరు: ఓ మహిళ హత్య మిస్టరీని కందుకూరు పోలీసులు ఛేదించారు. మాజీ ప్రియుడే ఆమెను హత్య చేసినట్లు గుర్తించి అతడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. మండల పరిధిలోని తిమ్మాపూర్‌లో ఈనెల 8 రాత్రి అదే గ్రామానికి చెందిన మంజుల హత్య వెలుగుచూసిన విషయం తెలిసిందే. గురువారం సీఐ గిరికుమార్ కేసు వివరాలను విలేకరులకు తెలిపారు. తిమ్మాపూర్‌కు చెందిన ఆర్ల నర్సింహ కుమారై మంజుల(30)ను 2005లో ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడుకు చెందిన బాలయ్య వివాహం చేసుకున్నాడు.
కొడుకు శివకుమార్(7) పుట్టిన తర్వాత మంజుల భర్త అనారోగ్యంతో మృతి చెందాడు. ఆ తర్వాత రెండేళ్లకు ఇబ్రహీంపట్నం మండలం రాయపోలుకు చెందిన యాదయ్యతో తల్లిదండ్రులు ఆమెకు ద్వితీయ వివాహం చేశారు. కాగా ఐదు నెలలు కాపురం చేసిన అనంతరం మంజుల కుమారుడితో సహా తల్లిదండ్రుల వద్దకు వచ్చేసింది. ఈనెల 5న సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన ఆమె గ్రామ సమీపంలో మాదాపూర్ వెళ్లే రహదారిలో ఎల్లమ్మ వాగు వద్ద చెట్ల పొదల్లో 8వ తేదీన రాత్రి మృతదేహంగా కనిపించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. గ్రామస్తుల సమాచారం, మంజుల ఫోన్ కాల్ డాటా ఆధారంగా నిందితుడు అదే గ్రామానికి చెందిన టిప్పర్ డ్రైవర్ గుల్వి శ్రీను(35)గా గుర్తించి అరెస్టు చేశారు. మద్యానికి బానిసైన మంజుల చెడు తిరుగుడు తిరిగేది.
ఈక్రమంలో గతంలో శ్రీనుకు ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది.
శ్రీను తనకు పెళ్లైన తర్వాత ఆమెతో ఐదేళ్లుగా దూరంగా ఉంటున్నాడు. కాగా గత కొన్ని రోజులుగా ఆమె అతనికి ఫోన్ చేసి తనను కలవాలంటూ వేధిస్తోంది. ఈక్రమంలో ఈ నెల 5న సాయంత్రం 4.30 గంటల నుంచి 5.50 వరకు 42 సార్లు ఫోన్ చేసిన మంజుల శ్రీనును గ్రామ శివారుకు రప్పించుకుంది. సాయంత్రం ఇద్దరూ ఎల్లమ్మ వాగు సమీపంలో మద్యం తాగారు. అనంతరం మంజుల తనను ఎందుకు పట్టించుకోవడం లేదంటూ శ్రీనుతో వాగ్వాదానికి దిగింది. నన్నైనా చంపు.. లేదా నేనైనా నిన్ను చంపుతానంటూ బెదిరించింది. దీంతో ఆగ్రహానికి గురైన శ్రీను మంజుల మెడకు చీరతో బిగించి ఉరివేసి చంపేశాడు. ఆమె సెల్‌ఫోన్ నుంచి సిమ్ కార్డు తీసి అక్కడే పడేసి ఫోన్‌తో ఉడాయించాడు.
ఇలా పట్టుబడ్డాడు..
కాగా 8న సాయంత్రం మంజుల, శ్రీను గ్రామ శివారుకు వెళ్లడం తాము చూశామని కొందరు గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు హతురాలి ఫోన్‌కాల్ డేటాను సేకరించారు. అదే రోజు సాయంత్రం సమయంలో 42 సార్లు మంజుల శ్రీనుతో 5011 సెకన్లపాటు మాట్లాడినట్లు గుర్తించారు.అనుమానంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించి పైవిషయాలు తెలిపాడు. అతడిపై కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం రిమాండుకు తరలించారు. కేసును త్వరగా ఛేదించిన ఎస్‌ఐ మల్లికార్జున్‌తో పాటు కానిస్టేబుళ్లు బి.చిరంజన్, వి.సురేష్, జి.శ్రీధర్, ఎ.యాదయ్యలను సీఐ ప్రత్యేకంగా అభినందించారు.
మాజీ ప్రియుడే హంతకుడు
Published Thu, Feb 12 2015 11:14 PM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement