woman warden
-
నారాయణ కాలేజీలో మహిళా వార్డెన్ ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్ అయ్యప్ప సోసైటిలో నారాయణ కళాశాలలో పనిచేస్తున్న వార్డెన్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి గ్రామానికి చెందిన భవాని అదే కాలేజీలో డిగ్రీ చదువుతూ అసిస్టెంట్ వార్డెన్‌గా పనిచేస్తోంది. అయితే కాలేజీ గదిలో ఆమె ఫ్యాన్‌కు ఉరివేసుకుని సూసైడ్ చేసుకుంది. మాదాపూర్ నారాయణ కళాశాల సరస్వతి క్యాంపస్‌లో భవాని నెల క్రితమే హాస్టల్ వార్డెన్‌గా చేరినట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భవాని మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: హైటెక్ సిటీ: ప్రాణం తీసిన అతివేగం.. యువతి మృతి -
సాంఘిక సంక్షేమంలో శాడిస్ట్ అధికారి
సాక్షి, కర్నూలు : జిల్లా సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన ఓ అధికారి ప్రవర్తన వివాదాస్పదమైంది. మహిళా వార్డెన్లతో సెల్ఫోన్లో అసభ్యకరంగా మాట్లాడుతూ మానసిక వేధింపులకు గురి చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అలాగే తనిఖీల పేరుతో మహిళా వార్డెన్లు ఉన్న వసతి గృహాలకు ప్రత్యేకంగా వెళ్తూ వారి పట్ల వెకిలి చేష్టలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మనసులో దురుద్దేశాన్ని పెట్టుకొని ఏకవచనంతో సంభాషించడం, రికార్డులు సక్రమంగా లేవంటూ కోపగించుకోవడం, కార్యాలయానికి వచ్చి కలవాలని ఆదేశాలు జారీ చేయడం ఆయనకు పరిపాటిగా మారింది. తాజాగా ఆదోని డివిజన్లోని ఓ మహిళా వార్డెన్ పట్ల ఆయన ప్రవర్తించిన తీరు వివాదాస్పదమైంది. తీవ్ర మనస్తాపానికి గురైన బాధితురాలు ఆత్మహత్యకు యత్నించినట్లు సమాచారం. దీంతో ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు మాజీ ఎంపీ బుట్టా రేణుక ద్వారా కలెక్టర్‌కు తెలియజేయాలనే భావించారు. ఈ విషయం సహచర వార్డెన్లకు తెలియడంతో సదరు అధికారిని కాపాడేందుకు రంగంలోకి దిగారు. బాధితురాలి కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి.. పత్తికొండ నియోజకవర్గంలోని ఓ వసతి గృహంలో ఈ నెల 2వ తేదీన పంచాయితీ పెట్టించారు. ఈ పంచాయితీకి ఆదోని డివిజన్‌కు చెందిన పలువురు వసతి గృహ సంక్షేమాధికారులు, సదరు అధికారితో పాటు ఒకరిద్దరు అధికారులు కూడా హాజరైనట్లు సమాచారం. ఈ సందర్భంగా మహిళా వార్డెన్ భర్త.. వేధింపులకు గురి చేసిన అధికారిపై చేయి చేసుకునే ప్రయత్నం చేయడంతో అక్కడున్న వారు వారించినట్లు తెలిసింది. ఇక మీదట ఎలాంటి తప్పు చేయబోనని, మహిళా వార్డెన్లను ఏకవచనంతో పిలవనంటూ సదరు అధికారి క్షమాపణ కోరినట్లు తెలిసింది. ఈ విషయంపై జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు యు.ప్రసాదరావును వివరణ కోరగా.. తనకు ఎలాంటి ఫిర్యాదూ అందలేదని, ఒకవేళ ఫిర్యాదు అందితే విచారణ చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
మద్యం మత్తులో విద్యార్థిని వేధించిన మహిళా వార్డెన్
నారాయణఖేడ్ (మెదక్): బాధ్యత మరిచిన ఓ మహిళా వార్డెన్ మద్యం మత్తులో ఓ విద్యార్థినిని వేధించిన ఘటన మెదక్ జిల్లా నారాయణఖేడ్ బాలల సదనంలో వెలుగు చూసింది. పోలీసులు, విద్యార్థినుల కథనం ప్రకారం... మనూర్ మండలం ముగ్ధంపూర్ గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని నారాయణఖేడ్‌లోని మహిళావృద్ధి, శిశు సంక్షేమ శాఖకు చెందిన బాలల సదనంలో ఉంటూ 9వ తరగతి చదువుతోంది. ఇక్కడి వసతిగృహం వార్డెన్‌గా పనిచేస్తున్న చంద్రకళ తన భర్త జగదీశ్వర్, ముగ్ధంపూర్ గ్రామానికి చెందిన రామకృష్ణ అనే మరో వ్యక్తితో కలసి వసతి గృహానికి వచ్చి అక్కడే మద్యం తీసుకోవడం మూడు నెలలుగా జరుగుతోంది. మద్యం మత్తులో రామకృష్ణను పెళ్లి చేసుకోవాలంటూ వార్డెన్ చంద్రకళ సదరు విద్యార్థిని వేధిస్తోంది. దీనిపై విద్యార్థినులు ఏఐఎస్ఎఫ్ నాయకులకు తెలుపడంతో వారు మంగళవారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారొచ్చి బాధిత విద్యార్థిని నుంచి వాంగ్మూలం తీసుకున్నారు.