సాక్షి, కర్నూలు : జిల్లా సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన ఓ అధికారి ప్రవర్తన వివాదాస్పదమైంది. మహిళా వార్డెన్లతో సెల్‌ఫోన్‌లో అసభ్యకరంగా మాట్లాడుతూ మానసిక వేధింపులకు గురి చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అలాగే తనిఖీల పేరుతో మహిళా వార్డెన్లు ఉన్న వసతి గృహాలకు ప్రత్యేకంగా వెళ్తూ వారి పట్ల వెకిలి చేష్టలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మనసులో దురుద్దేశాన్ని పెట్టుకొని ఏకవచనంతో సంభాషించడం, రికార్డులు సక్రమంగా లేవంటూ కోపగించుకోవడం, కార్యాలయానికి వచ్చి కలవాలని ఆదేశాలు జారీ చేయడం ఆయనకు పరిపాటిగా మారింది. తాజాగా ఆదోని డివిజన్‌లోని ఓ మహిళా వార్డెన్ పట్ల ఆయన ప్రవర్తించిన తీరు వివాదాస్పదమైంది. తీవ్ర మనస్తాపానికి గురైన బాధితురాలు ఆత్మహత్యకు యత్నించినట్లు సమాచారం. దీంతో ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు మాజీ ఎంపీ బుట్టా రేణుక ద్వారా కలెక్టర్‌కు తెలియజేయాలనే భావించారు. ఈ విషయం సహచర వార్డెన్లకు తెలియడంతో సదరు అధికారిని కాపాడేందుకు రంగంలోకి దిగారు.
బాధితురాలి కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి.. పత్తికొండ నియోజకవర్గంలోని ఓ వసతి గృహంలో ఈ నెల 2వ తేదీన పంచాయితీ పెట్టించారు. ఈ పంచాయితీకి ఆదోని డివిజన్‌కు చెందిన పలువురు వసతి గృహ సంక్షేమాధికారులు, సదరు అధికారితో పాటు ఒకరిద్దరు అధికారులు కూడా హాజరైనట్లు సమాచారం. ఈ సందర్భంగా మహిళా వార్డెన్ భర్త.. వేధింపులకు గురి చేసిన అధికారిపై చేయి చేసుకునే ప్రయత్నం చేయడంతో అక్కడున్న వారు వారించినట్లు తెలిసింది. ఇక మీదట ఎలాంటి తప్పు చేయబోనని, మహిళా వార్డెన్లను ఏకవచనంతో పిలవనంటూ సదరు అధికారి క్షమాపణ కోరినట్లు తెలిసింది. ఈ విషయంపై జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు యు.ప్రసాదరావును వివరణ కోరగా.. తనకు ఎలాంటి ఫిర్యాదూ అందలేదని, ఒకవేళ ఫిర్యాదు అందితే విచారణ చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment