కర్నూలు (అర్బన్) : ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడి నుంచి రూ.20 వేల లంచం తీసుకుంటూ కర్నూలు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయ సూపరింటెండెంట్ కె.శేఖప్ప సోమవారం ఏసీబీ అధికారులకు చిక్కారు. వివరాల్లోకి వెళ్తే.. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ నియామకానికి సంబంధించిన ఫైలును కలెక్టర్‌కు పంపే విషయంలో కర్నూలుకు చెందిన గ్రీన్ యానిమల్ సేవర్ సొసైటీ నిర్వాహకుడు టి.ధర్మరాజు నుంచి శేఖప్ప రూ.50 వేలు డిమాండ్ చేశారు. ముందుగా రూ.20 వేలు, పని పూర్తయ్యాక రూ.30 వేలు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. కాగా ధర్మరాజు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచన మేరకు సోమవారం ఉదయం కార్యాలయానికి వెళ్లిన ధర్మరాజు రూ.20 వేల నగదును శేఖప్పకు అందించారు. ఆ మరుక్షణమే ఏసీబీ డీఎస్‌పీ మహబూబ్‌బాషా శేఖప్పను రెడ్‌హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. దాడిలో ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు సీతారామారావు, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.