సత్సంగ్‌లో మృత్యుకేళి.. 116 మంది భక్తుల దుర్మరణం
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హత్రాస్ జిల్లా ఫూల్రాయ్ గ్రామంలో మాటలకు అందని తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 116 మంది భక్తులు మృత్యువాత పడ్డారు. వీరిలో 108 మంది మహిళలు, ఏడుగురు చిన్నారులు ఉన్నారు. సత్సంగ్ ముగిశాక బయటకు వచ్చే క్రమంలో ఒకరిపై ఒకరు పడిపోవడంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ఇటీవలి కాలంలో జరిగిన ఘోరమైన సంఘటన ఇదే కావడం గమనార్హం.మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తొక్కిసలాటలో ఏకంగా 116 మంది మరణించడం పట్ల రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తదితరులు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బాధిత కుటుంబాలకు, క్షతగాత్రులకు ప్రధానమంత్రి కార్యాలయం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పరిహారం ప్రకటించాయి.హత్రాస్: అప్పటిదాకా భోలే బాబా ప్రవచనాలు, భక్తుల కీర్తనలు, ఆధ్యాత్మిక శోభతో కళకళలాడిన సత్సంగ్ నిమిషాల వ్యవధిలోనే శోక సముద్రంగా మారిపోయింది. ప్రవచనాలు వినేందుకు వచి్చన బాబా భక్తులు విగతజీవులయ్యారు. సత్సంగ్ ముగిసిన తర్వాత ఇళ్లకు వెళ్లే తొందరలో జనమంతా టెంట్ నుంచి ఒక్కసారిగా బయటకు రావడంతో తొక్కిసలాట జరిగింది. ఒకరిపై ఒకరు పడిపోయారు. ఊపిరాడక 116 మంది కన్నుమూశారు. మృతుల్లో 108 మంది మహిళలు, ఏడుగురు చిన్నారులు ఉన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హత్రాస్ జిల్లా ఫూల్రాయ్ గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. దేశంలో ఇటీవలి కాలంలో జరిగిన ఘోరమైన సంఘటన ఇదే కావడం గమనార్హం. పలువురు క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 89 మంది ఘటనా స్థలంలోనే కన్నుమూశారు. మరికొందరు ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అసలేం జరిగింది? ఉత్తరప్రదేశ్‌తోపాటు వివిధ రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో భక్తులున్న సాకార్ విశ్వ హరి భోలే బాబా ఫూల్రాయ్ గ్రామంలో సత్సంగ్ నిర్వహించేందుకు స్థానిక సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ నుంచి అనుమతి తీసుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం భక్తులకు గంటన్నరకు పైగా ఆధ్యాత్మిక బోధ చేశారు. టెంట్ లోపల నిర్వాహకులే ఏర్పాట్లు చేసుకున్నారు. టెంట్ బయట స్థానిక పోలీసులు భద్రత కలి్పంచారు. సత్సంగ్ పూర్తయిన తర్వాత వీరంతా ఒకేసారి బయటకు వచ్చేందుకు ప్రయత్నించడంతో తొక్కిసలాట జరిగింది. అయితే కార్యక్రమం పూర్తయ్యాక తన వాహనం వద్దకు తిరిగి వెళ్తున్న బాబా ఆశీస్సులు తీసుకొనేందుకు, ఆయన అడుగులు వేసిన చోట పవిత్రమైన మట్టిని సేకరించేందుకు భక్తులు ఎగబడడంతో తొక్కిసలాట జరిగిందని సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ రవీంద్ర కుమార్ వెల్లడించారు. సత్సంగ్ జరిగిన ప్రాంతం బురదమయంగా ఉండడంతో భక్తులు జారిపడ్డారని, దాంతో తొక్కిసలాట జరిగిందని నిర్వాహకులు చెబుతున్నారు. సరైన ఏర్పాట్లు చేయలేదని, అందుకే ఈ దుర్ఘటన చోటుచేసుకుందని భక్తులు ఆరోపించారు. దర్యాప్తు బృందం ఏర్పాటు తొక్కిసలాట సమాచారం అందుకున్న వెంటనే అధికారులు రంగంలోకి దిగారు. క్షతగాత్రులను, మృతదేహాలను వాహనాల్లో హత్రాస్ మెడికల్ సెంటర్‌తోపాటు సమీపంలోని ఎటాహ్ జల్లా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో విసిరేసినట్లుగా పడి ఉన్న శవాలు, వాటి చుట్టూ కూర్చొని రోదిస్తున్న కుటుంబ సభ్యుల హృదయ విదారక దృశ్యాలు కలచివేశాయి. పెద్ద సంఖ్యలో క్షతగాత్రులు ఉన్నారని, వారికి చికిత్స అందించడం లేదని స్థానికులు మండిపడ్డారు. ఆసుపత్రిలో ఒకే ఒక్క డాక్టర్ ఉన్నారని, ఆక్సిజన్ సదుపాయం లేదని ఆరోపించారు.ఫూల్రాయ్ తొక్కిసలాటపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకోసం ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. 24 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని పేర్కొంది. సత్సంగ్ నిర్వాహకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. సత్సంగ్‌కు 80 వేల మంది హాజరవుతారన్న అంచనాతో నిర్వాహకులు అనుమతి తీసుకున్నారని యూపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చెప్పారు. కానీ, అంతకంటే ఎక్కువ మంది హాజరయ్యారని తెలిపారు. భోలే బాబా పరారీలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సంతాపం తెలిపిన ప్రధాని మోదీ హత్రాస్ తొక్కిసలాటపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మంగళవారం లోక్‌సభలో ఆయన ఈ అంశంపై మాట్లాడారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ప్రధానమంత్రి కార్యాలయం పరిహారం ప్రకటించింది. యూపీ సర్కారు కూడా అంతే మొత్తం పరిహారం ఇస్తుందని సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు.కాల్వలో ఒకరిపై ఒకరు పడిపోయారుప్రత్యక్ష సాక్షుల కథనం హాత్రాస్: తొక్కిసలాట ఘటన వివరాలను కొందరు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ‘‘ సత్సంగ్ అయిపోగానే అందరూ ఒక్కసారిగా ప్రాంగణం నుంచి బయటికి బయల్దేరారు. ప్రాంగణం బయట రోడ్డు ఎత్తులో నిర్మించారు. దాని కింద మురికి కాల్వ ఉంది. దూసుకొచి్చన జనం అందులో పడ్డారు. ఒకరిపై మరొకరు పడుతూనే ఉన్నారు. కింద ఉన్న వాళ్లు కూరుకుపోయి కన్నుమూశారు’’ అని శకుంతల అనే ప్రత్యక్ష సాక్షి చెప్పారు. ‘‘ సత్సంగ్‌ను రోడ్డు చివర నిలబడి ఉన్న వాళ్లను ప్రాంగణంలో కిక్కిరిసిన జనం తోసేశారు. దీంతో కొనకు ఉన్న వాళ్లు కాల్వలో పడిపోయారు.అలా అప్పటికప్పుడు ఒక పాతిక మంది ప్రాణాలుకోల్పోయారు’ అని మరో ప్రత్యక్ష సాక్షి ఆ భయానక ఘటనను గుర్తుచేసుకున్నారు. సత్సంగ్ ఆర్గనైజింగ్ కమిటీ సభ్యుడు మహేశ్ చంద్ర సైతం కార్యక్రమం నిర్వహణ విధానాన్ని తప్పుబట్టారు. ‘‘ సరైన నిర్వహణ లేకే ఈ దారుణం జరిగింది. బురదలో పడ్డ వాళ్లను జనం పరుగెడుతూ తొక్కుకుంటూ వెళ్లారు. వాళ్లను ఎవరూ అదుపుచేయలేకపోయారు. దీంతో పడిపోయిన వాళ్లు ప్రాణాలు కోల్పోయారు’’ అని ఆయన అన్నారు. గతంలోనూ...⇒ 2005 జనవరి 25న మహారాష్ట్రలోని సతారా జిల్లాలో మంధరాదేవి ఆలయ వేడుకల్లో తొక్కిసలాట జరిగింది. 340 మందికిపైగా భక్తులు విగత జీవులయ్యారు. ⇒ 2008 సెపె్టంబర్ 30న రాజస్తాన్‌లోని జోద్పూర్ సిటీలో చాముండాదేవి ఆలయ ఉత్సవాలకు జనం భారీగా తరలివచ్చారు. తొక్కిసలాట జరగడంతో 250 మంది వఅగీురణించారు. 60 మందికిపైగా గాయపడ్డారు.⇒ 2008 ఆగస్టు 3న హిమాచల్‌ప్రదేశ్‌లోని బిలాస్పూర్ జిల్లాలో నైనాదేవి ఆలయంలో మత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తొక్కిసలాట చోటుచేసుకుంది. 162 మంది భక్తుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ⇒ 2013 అక్టోబర్ 13న మధ్యప్రదేశ్‌లోని రతన్‌గఢ్ ఆలయంలో నవరాత్రి వేడుకల సందర్భంగా తొక్కిసలాట జరిగింది. 115 మంది మృతిచెందారు. ⇒ 2011 జనవరి 14న కేరళలోని ఇడుక్కి జిల్లాలో శబరిమల ఆలయం సమీపంలో తొక్కిసలాటలో 104 మంది అయ్యప్ప భక్తులు కన్నుమూశారు. ⇒ 2010 మార్చి 4న ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో రామ్‌జానకి ఆలయంలో తొక్కిసలాటలో 63 మంది మృతిచెందారు. ⇒ 2003 అగస్టు 27న మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో కుంభమేళాలో తొక్కిసలాటలో 39 మంది మరణించారు. 140 మంది గాయపడ్డారు.