ఆడవాళ్ల నుంచి నేర్చుకోవాల్సిన 5 విషయాలు...
నేర్చుకుందాం... మార్చుకుందాం
ఆడవాళ్లు, మగవాళ్లు వేరు వేరు గ్రహాల నుంచి వచ్చారని చెప్పుకుంటున్నా... ఒకే గ్రహంలో, ఒకే భూమి మీద, ఒకే కప్పు కింద ఉండాలి కాబట్టి... మన నుంచి వాళ్లు, వాళ్ల నుంచి మనం ఎంతో కొంత నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మన నుంచి వాళ్లు ఏం నేర్చుకుంటారు? అనేది పక్కన పెడితే, వాళ్ల నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు కొన్ని... హడావిడి నిర్ణయాలు తీసుకోరు. పదిమందితో మాట్లాడిగానీ ఒక నిర్ణయానికి రారు.
మనలో కొందరు: ఒకరి సలహా తీసుకోవడం ఏమిటి? నాకు ఆ మాత్రం తెలియదా? అనే అహం మనసులో ఏ మూలో ఉంటుంది.
* ఎన్ని పనులు నెత్తి మీద ఉన్నా... గందరగోళానికి, ఒత్తిడికి గురి కారు. ‘ఒత్తిడి’ ‘అరుపులు’ అనేవి పనికి కావలసిన ఇంధనం కాదు అనే విషయం వారికి తెలుసు. పెదవుల మీద చెరగని చిరునవ్వే వారి బలం.
మ. కొ: రోజూ చేస్తున్న పనికి అదనంగా ఒక పని తోడైతే చాలు! ఆకాశం నుంచి ఆరువందల కేజీల బరువు నెత్తి మీద పడ్డట్లు ఫీలవుతారు. కోపం, అసహనం అనే ఇంధనంతో ‘పని బండి’ని నడపాలనుకుంటారు.
నెలకు ఎంత జీతం వస్తుంది...ఎంత ఖర్చు చేయాలి? ఎంత పొదుపు చేయాలి? అనేదాని గురించి వారికి స్పష్టత ఉంటుంది. అనవసర ఖర్చులు, ఆర్భాటపు ఖర్చులు చేయరు.
మ. కొ: స్నేహితుల ముందు గొప్ప కోసం, ‘డబ్బు లెక్క చేయడు’ అనే పేరు కోసం ఎడా పెడా ఖర్చు చేస్తారు. ఇబ్బందుల్లో పడిపోతారు.
ఖాళీ సమయం ఉంటే కొత్త వంటకమో, కొత్త అల్లికలో నేర్చుకుంటారు. పిల్లలకు ట్యూషన్ చెబుతారు.
మ. కొ: మగాడు ఖాళీగా ఇంట్లో కూర్చోవడం మర్యాద కాదనుకుంటారు తప్ప, ఇంట్లో ఉండి నేర్చుకునే విషయాలు ఎన్నో ఉన్నాయి అనే విషయాన్ని గ్రహించరు. ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి బార్పాలై దుర్వినియోగమవుతారు.
మల్టీ టాస్క్ అండ్ బాలెన్స్: ఒక సమయంలో అనేక రకాల పనులు చేసినా అన్నిటి మధ్య సమన్వయం ఉండేలా చూసుకుంటారు. ఒకదానికొకటి అడ్డు రాకుండా జాగ్రత్త పడతారు. ఒకవేళ ఏదైనా తప్పు జరిగినా ఆ తప్పు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.
మ.కో: ఒకటికంటే ఎక్కువ పనులు చేయాల్సివచ్చినప్పుడు ‘గందరగోళం’ అనుకోని అతిథిగా వస్తుంది. దీంతో తప్పు మీద తప్పు చేస్తాం. తప్పును సవరించుకోకపోగా ‘రెండు పడవల మీద ప్రయాణం కష్టం’ అనే సిద్ధాంతాన్ని నమ్మి రథాన్ని వెనక్కి మళ్లిస్తాం.