అతనికి కొరడా దెబ్బలు.. ఆమెకు మరణశిక్ష!
రియాద్: వివాహేతర సంబంధం కలిగి ఉందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ మహిళను రాళ్లతో కొట్టి చంపాలంటూ సౌదీ అరేబియా కోర్టు తీర్పునిచ్చింది. ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తికి మాత్రం కేవలం 100 కొరడా దెబ్బల శిక్ష విధించింది. శ్రీలంకకు చెందిన 45 ఏళ్ల మహిళ 2013 నుంచి రియాద్‌లో పనిమనిషిగా పనిచేస్తున్నది. ఆమె తన దేశానికి చెందిన ఓ వ్యక్తితో లైంగిక సంబంధం పెట్టుకుంది. ఈ వ్యవహారంలో సౌదీ అరేబియాలోని షరియా కోర్టు గత ఆగస్టులో తీర్పు ఇచ్చింది. వివాహిత అయిన ఆమె తన భర్తను మోసం చేసి, మరో వ్యక్తితో లైంగిక సంబంధం పెట్టుకుందని పేర్కొంటూ.. ఆమె చనిపోయేవరకు రాళ్లతో కొట్టాలని తీర్పును వెలువరించింది.
అయితే, ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకున్న వ్యక్తి ఆ సమయంలో బ్రాహ్మచారి కావడంతో అతనికి కేవలం వంద కొరడా దెబ్బల శిక్షతో సరిపెట్టింది. ఈ తీర్పుపై ఆందోళన వ్యక్తం చేసిన శ్రీలంక.. ఆమెకు క్షమాభిక్ష పెట్టాలని సౌదీ దేశాన్ని కోరనున్నట్టు ప్రకటించింది. అదేవిధంగా ఉన్నత స్థానంలో అప్పీలు చేసేందుకు ఒక ప్రత్యేక న్యాయవాదిని నియమిస్తున్నట్టు ప్రకటించింది. సౌదీ అరేబియాలో ఇస్లామిక్ చట్టమైన షరియా చట్టాన్ని అమలు చేస్తున్నారు. అక్రమ సంబంధాలు, డ్రగ్స్ స్మగ్లింగ్, క్షుద్రపూజలు వంటి నేరాలకే ఈ చట్టం ప్రకారం మరణశిక్ష విధిస్తుండటంతో అంతర్జాతీయ మానవహక్కుల సంస్థలు దీనిని తీవ్రంగా తప్పుబడుతున్నాయి.