Women Shooter
-
Olympics: ‘మను’సంతా పతకమే!
జూలై 25, 2021, టోక్యో... ఫైనల్స్‌కు కూడా అర్హత సాధించకుండా తీవ్ర నిరాశ... పని చేయని తుపాకీతో వేదనగా నిష్క్రమించిన రోజు... జూలై 28, 2024, పారిస్... ఫైనల్స్‌లో సత్తా చాటి ఒలింపిక్ కాంస్యం గెలుచుకున్న క్షణం... గర్జించిన తుపాకీని గొప్పగా ప్రదర్శించిన రోజు... అవే ఒలింపిక్స్ క్రీడలు...అదే 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్... అదే ప్లేయర్...కానీ తుది ఫలితం మాత్రం భిన్నం...విజయాలు కొత్త కాదు... మూడేళ్ల క్రితం మనూ భాకర్ టోక్యో ఒలింపిక్స్‌లో బరిలోకి దిగింది. 19 ఏళ్ల ఒక అమ్మాయి మెగా ఈవెంట్లో మొదటిసారి... అదీ మూడు ఈవెంట్లలో పోటీ పడటం చిన్న విషయం కాదు. కానీ అసాధారణ ప్రతిభతో దూసుకొచి్చన ఈ షూటర్ అలాంటి అవకాశం సృష్టించుకుంది. నిజానికి అప్పటి వరకు ఆమె సాధించిన ఘనతలే భాకర్‌పై అంచనాలు భారీగా పెంచేశాయి. చివరకు అదే ఒత్తిడి ఆమెను చిత్తు చేసింది. టోక్యో ఒలింపిక్స్‌కు ముందు వరకు పెద్ద సంఖ్యలో పతకాలు గెలుచుకుంది. జూనియర్ వరల్డ్ కప్‌లో రెండు స్వర్ణాలు, యూత్ ఒలింపిక్స్‌లో స్వర్ణం, కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం, ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో రెండు స్వర్ణాలు, వరల్డ్ కప్‌లలో ఏకంగా తొమ్మిది స్వర్ణాలు... ఇలా ఈ జాబితా చాలా పెద్దది. దాంతో ఇదే జోరులో ఒలింపిక్ పతకం కూడా దక్కుతుందని అంతా ఆశించారు. కానీ అది సాధ్యం కాలేదు. ఇదేదో ఆటలో ఓటమిలా కాదు! క్వాలిఫయింగ్ పోటీల్లో కీలక సమయంలో భాకర్ పిస్టల్ సాంకేతిక సమస్యల కారణంగా పని చేయలేదు. దానిని సరిచేసుకొని వచ్చేసరికి ఆరు నిమిషాల కీలక సమయం వృథా అయింది. అయినా సరే 60 షాట్ల ద్వారా 575 పాయింట్లు సాధించడం విశేషం. చివరకు కేవలం రెండు పాయింట్ల తేడాతో ఫైనల్ అవకాశం కోల్పోయిన మను కన్నీళ్లపర్యంతమైంది. ఈ ప్రభావం మరో రెండు ఈవెంట్లపై పడి ఆమె కనీస ప్రదర్శన కూడా ఇవ్వలేకపోయింది. మళ్లీ మొదలు... ఒలింపిక్ పతకం ప్రతిభ ఉంటేనే కాదు... ధైర్యవంతులకే దక్కుతుంది! శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండటంతో పాటు ఓటమి భారంతో కుంగిపోయిన దశ నుంచి మళ్లీ పైకి లేవడం ఎంతో ధైర్యం ఉంటే తప్ప సాధ్యం కాదు. గొప్ప గొప్ప ఆటగాళ్లు కూడా ఇలాంటి పరాజయం తర్వాత కుప్పకూలిపోతారు. టోక్యో ఒలింపిక్స్ వైఫల్యం తర్వాత ఇతర షూటర్లు అపూర్వీ చండీలా, అభిషేక్ వర్మ, మిక్స్డ్ ఈవెంట్లో ఆమె సహచరుడు సౌరభ్ చౌదరీ మళ్లీ కెరీర్లో ముందుకు వెళ్లలేక దాదాపుగా షూటింగ్‌కు దూరమయ్యారు. ఒకదశలో మనూ కూడా అలాగే ఆలోచించింది. షూటింగ్ తనలో ఆసక్తి రేపడం లేదని, ఇక ఆటకు గుడ్‌బై చెప్పి సివిల్ సర్వీసెస్‌కు సన్నద్ధమవ్వాలని నిర్ణయించుకుంది. కానీ సన్నిహితుల కారణంగా ‘చివరిసారిగా మళ్లీ ప్రయతి్నద్దాం’ అనే ఆలోచన మళ్లీ షూటింగ్లో కొనసాగేలా చేసింది. ఈసారి కూడా అంతే స్థాయిలో కఠోర సాధన చేసింది. ఏకాగ్రత చెదరకుండా ఒకే లక్ష్యానికి గురి పెట్టింది. దాంతో మళ్ళీ ఫలితాలు వచ్చాయి. జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో నాలుగు స్వర్ణాలు, ఆసియా క్రీడల్లో స్వర్ణం, వరల్డ్ కప్‌లలో రెండు కాంస్యాలు, వరల్డ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ, కాంస్యాలు దక్కాయి. అయితే పారిస్ క్రీడలకు ముందు గత రికార్డులను ఆమె పట్టించుకోలేదు. తనపై అంచనాలు లేకపోవడమే మంచిదని భావించి ప్రశాంతంగా ఎలాంటి ఒత్తిడి లేకుండా మెగా ఈవెంట్లోకి అడుగు పెట్టి పతకంతో తన విలువను ప్రదర్శించింది. కానీ ఈ మూడు సంవత్సరాల మూడు రోజుల వ్యవధి ఒక చాంపియన్ ప్లేయర్ కెరీర్లో ఎన్నో మార్పులు తీసుకొచి్చంది... ఓటముల నుంచి పాఠాలు నేర్చుకొని గెలుపు వైపు ఎలా సాగాలో చూపించింది. 22 ఏళ్ల వయసులో మనూ భాకర్ ఇప్పుడు ఒలింపిక్ పతక విజేతగా తానేంటో నిరూపించుకుంది. గత ఒలింపిక్స్ చేదు జ్ఞాపకాలను చెరిపేస్తూ సగర్వంగా నిలిచింది. –సాక్షి క్రీడా విభాగంనాన్న అండతో... హరియాణాలోని ఝఝర్ జిల్లా గోరియా మనూ భాకర్ స్వస్థలం. తండ్రి రామ్‌కిషన్ భాకర్ మర్చంట్ నేవీలో చీఫ్ ఇంజినీర్. చిన్నప్పటి నుంచి ఆయన తన కూతురు ఆసక్తి కనబర్చిన ప్రతీ చోటా ప్రోత్సహించాడు. టెన్నిస్, స్కేటింగ్, మార్షల్ ఆర్ట్స్...ఇలా అన్నీ ఆడించాడు. ఒకదశలో బాక్సింగ్‌పై బాగా ఆసక్తి కనబర్చి ఎక్కువ సమయం ఈ గేమ్‌పై దృష్టి పెట్టింది. కానీ 14 ఏళ్ల వయసు వచ్చేసరికి ఇదీ నచ్చలేదు. చివరకు తండ్రికి చెప్పి షూటింగ్ వైపు మరలగా... ఆయన ఇక్కడా వద్దనలేదు. కేవలం రెండేళ్ల శిక్షణ, సాధనతో షూటింగ్లో మనూ దూసుకుపోవడం విశేషం. 15 ఏళ్ల వయసులో జాతీయ సీనియర్ చాంపియన్íÙప్లో అగ్రశ్రేణి షూటర్ హీనా సిద్ధూను ఓడించి సంచలనం సృష్టించడంతో పాటు ఈ టోరీ్నలో ఏకంగా తొమ్మిది స్వర్ణాలు సాధించడంతో అందరి దృష్టి భాకర్‌పై పడింది. ఆ తర్వాత 16 ఏళ్ల వయసులో మెక్సికోలో జరిగిన వరల్డ్ కప్‌లో స్వర్ణం గెలుచుకొని పిన్న వయసులో ఈ ఘనత సాధించిన షూటర్‌గా నిలిచిన తర్వాత మనూ కెరీర్ బుల్లెట్లా దూసుకుపోయింది. –సాక్షి క్రీడా విభాగం -
మను మురిపించె...
గత రెండు ఒలింపిక్స్ క్రీడల్లో మూగబోయిన భారతీయ తుపాకీ ‘పారిస్’లో గర్జించింది. మూడేళ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్‌లో భారీ అంచనాలతో బరిలోకి దిగి కనీసం ఫైనల్ చేరుకోకుండానే వెనుదిరిగిన మనూ భాకర్... ‘పారిస్’లో మాత్రం చిరస్మరణీయ ప్రదర్శనతో దేశం మొత్తాన్ని మురిపించింది. చెక్కు చెదరని ఏకాగ్రతతో... గురి తప్పని లక్ష్యంతో... ఒక్కో బుల్లెట్‌ను 10 మీటర్ల ముందున్న వృత్తంలోకి పంపిస్తూ... మూడో స్థానాన్ని సంపాదించి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో మనూ కొత్త చరిత్రను లిఖించింది. ఒలింపిక్స్ క్రీడల్లో పతకం నెగ్గిన తొలి భారతీయ మహిళా షూటర్‌గా ఈ హరియాణా అమ్మాయి గుర్తింపు పొందింది. పారిస్: గత చేదు అనుభవాలను వెనక్కి నెట్టి పారిస్ వేదికగా భారత మహిళా షూటర్ మనూ భాకర్ కొత్త చరిత్రను లిఖించింది. ఒలింపిక్స్ క్రీడల్లో పతకం గెలిచిన తొలి భారతీయ మహిళా షూటర్‌గా చరిత్రకెక్కింది. ఆదివారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో 22 ఏళ్ల మనూ భాకర్ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. మనూ భాకర్ 221.7 పాయింట్లు సాధించి కాంస్య పతకాన్ని సాధించింది. దక్షిణ కొరియాకు చెందిన జిన్ ఓయె (243.2 పాయింట్లు) స్వర్ణం నెగ్గగా... కిమ్ యెజీ (241.3 పాయింట్లు) రజతం గెలిచింది. ఫైనల్ సాగిందిలా... ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో ఫైనల్ జరిగింది. ముందుగా స్టేజ్–1లో ఎనిమిది మంది షూటర్లు 10 షాట్లు సంధించారు. 12వ షాట్ తర్వాత స్టేజ్–2లో ఎలిమినేషన్ మొదలైంది. 12 షాట్ల తర్వాత తక్కువ పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉన్న వెరోనికా మాయో (హంగేరి–114 పాయింట్లు) ని్రష్కమించింది. అప్పటికి మనూ 121.2 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. 14వ షాట్ తర్వాత తర్హాన్ (టర్కీ –135.6 పాయింట్లు), 16వ షాట్ తర్వాత రాన్‌జిన్ జియాంగ్ (చైనా–156.5 పాయింట్లు), 18వ షాట్ తర్వాత జుయ్ లీ (చైనా–178.3 పాయింట్లు) వెనుదిరిగారు. 20వ షాట్ తర్వాత త్రిన్ తు విన్ (వియత్నాం–198.6 పాయింట్లు) నాలుగో స్థానంతో ని్రష్కమించడంతో వరుసగా జిన్ ఓయె, కిమ్ యెజీ, మనూ భాకర్ పతకాల రేసులో నిలిచారు. 22వ షాట్ తర్వాత మనూ భాకర్ 221.7 పాయింట్లతో మూడో స్థానంలో... కిమ్ యెజీ 221.8 పాయింట్లతో రెండో స్థానంలో, జిన్ ఓయె 222.6 పాయింట్లతో తొలి స్థానంలో ఉన్నారు. 0.1 పాయింట్ తేడాతో కిమ్ యెజీకంటే మనూ వెనుకబడి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. చివరి రెండు షాట్లలో జిన్ ఓయె 10, 10.6 పాయింట్లు... కిమ్ యెజీ 9.7, 9.8 పాయింట్లు స్కోరు చేశారు. దాంతో జిన్ ఓయె 243.2 పాయింట్లతో స్వర్ణాన్ని ఖాయం చేసుకోగా, కిమ్ యెజీ 241.3 పాయింట్లతో రజతం నెగ్గింది. క్వాలిఫయింగ్‌లో మెరిసి...పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ క్వాలిఫయింగ్‌లో అర్జున్ బబూతా... మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ క్వాలిఫయింగ్‌లో రమితా జిందాల్ టాప్–8లో నిలిచి ఫైనల్స్‌కు అర్హత సాధించారు. 49 మంది షూటర్లు పోటీపడ్డ క్వాలిఫయింగ్‌లో అర్జున్ బబూతా 630.1 పాయింట్లు స్కోరు చేసి ఏడో స్థానంలో నిలిచి ఫైనల్ బెర్త్‌ను దక్కించుకున్నాడు. టాప్–8లో నిలిచిన వారు ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. 43 మంది షూటర్లు పోటీపడ్డ మహిళల క్వాలిఫయింగ్‌లో రమితా జిందాల్ 631.5 పాయింట్లు సాధించి ఐదో స్థానంలో నిలిచి ఫైనల్లోకి అడుగు పెట్టింది. ఈ విభాగంలోనూ టాప్–8లో నిలిచిన వారు ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. 7 ఒలింపిక్స్ క్రీడల్లో భారత్‌కు పతకం అందించిన ఏడో మహిళా క్రీడాకారిణిగా మనూ భాకర్ నిలిచింది. ఈ జాబితాలో కరణం మల్లీశ్వరి (వెయిట్‌లిఫ్టింగ్; కాంస్యం–2000 సిడ్నీ), సైనా నెహా్వల్ (బ్యాడ్మింటన్; కాంస్యం–2012 లండన్), మేరీకోమ్ (బాక్సింగ్; కాంస్యం–2012 లండన్), పీవీ సింధు (బ్యాడ్మింటన్; రజతం–2016 రియో, కాంస్యం–2020 టోక్యో), సాక్షి మలిక్ (రెజ్లింగ్; కాంస్యం–2016 రియో), లవ్లీనా బొర్గొహైన్ (బాక్సింగ్; కాంస్యం–2020 టోక్యో) ఉన్నారు. 5 ఒలింపిక్స్ క్రీడల్లో పతకం గెలిచిన ఐదో భారతీయ షూటర్‌గా, తొలి మహిళా షూటర్‌గా మనూ భాకర్ గుర్తింపు పొందింది. గతంలో రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ (డబుల్ ట్రాప్; రజతం–2004 ఏథెన్స్), అభినవ్ బింద్రా (10 మీటర్ల ఎయిర్ రైఫిల్; స్వర్ణం–2008 బీజింగ్), విజయ్ కుమార్ (25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్; రజతం–2012 లండన్), గగన్ నారంగ్ (10 మీటర్ల ఎయిర్ రైఫిల్; కాంస్యం–2012 లండన్) ఈ ఘనత సాధించారు. టోక్యో ఒలింపిక్స్ తర్వాత నేను తీవ్రంగా నిరాశపడ్డాను. దాని నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. ఇప్పుడు కాంస్యం సాధించడం పట్ల సంతోషంగా ఉన్నా. దీనిని మాటల్లో చెప్పలేను. వచ్చే సారి ఇంతకంటే మెరుగైన పతకం గెలుస్తానేమో. చాలా కాలం తర్వాత భారత్‌కు షూటింగ్లో మెడల్ రావడం కూడా గొప్పగా అనిపిస్తోంది. ఫైనల్లో ఆఖరి షాట్లో కూడా ఎంతో ప్రయత్నించా. ఒక దశలో రజతం సాధించగలనని భావించా. నేను భగవద్గీత చదువుతాను. నేను చేయాల్సింది చేసి ఫలితాన్ని భగవంతునికే వదిలేస్తాను. మీకు ఏం రాసిపెట్టి ఉందో అదే జరుగుతుంది. జరగబోయేది మన చేతుల్లో ఉండదు. మన ప్రయత్నం చేస్తూ అత్యుత్తమ ప్రదర్శన మాత్రమే ఇవ్వగలం. ఈ పతకం కోసం మేం చాలా కష్టపడ్డాం. నాకు అండగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు. –మనూ భాకర్ చారిత్రక విజయం! పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ తరఫున తొలి పతకం గెలిచిన మనూ భాకర్‌కు అభినందనలు. షూటింగ్లో ఈ ఘనత సాధించిన తొలి మహిళ కావడం మరింత గర్వకారణం.–నరేంద్ర మోదీ, ప్రధానిభారత పతకాల బోణీ చేసిన భాకర్‌కు శుభాకాంక్షలు. ఈ విజయం మరింత మంది మహిళలకు స్ఫూర్తినిస్తుంది. మనూ మరిన్ని ఘనతలు సాధించాలి. –ద్రౌపది ముర్ము, రాష్ట్రపతి ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారత మహిళా షూటర్‌గా రికార్డు సృష్టించావు. మనూ... నీ ప్రదర్శనతో దేశం మొత్తం గర్వించేలా చేశావు. –వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎంనీ అంకితభావం, శ్రమ ఫలించాయి. ప్రతీ షాట్‌తో భారత్ గర్వపడేలా చేశావు. నీ పట్టుదలకు ఈ పతకం ఉదాహరణ. –అభినవ్ బింద్రా -
నినో... నీకు సలాం!
ఒలింపిక్స్‌కు ఒక్కసారి అర్హత సాధించడమే గొప్ప అనుకుంటుంటే... వరుసగా పదోసారి విశ్వక్రీడల్లో పోటీ పడటాన్ని ఏమనాలి! జార్జియాకు చెందిన 55 ఏళ్ల మహిళా షూటర్ నినో సాలుక్వాద్జె ఇలాంటి అసాధారణ ఘనత సాధించింది. 1988 సియోల్ ఒలింపిక్స్ ద్వారా విశ్వక్రీడల్లో అరంగేట్రం చేసిన నినో... తొలి ప్రయత్నంలో 25 మీటర్ల పిస్టల్‌లో స్వర్ణం, 10 మీటర్ల విభాగంలో రజతం సాధించి అదరగొట్టింది. ఇక అప్పటి నుంచి వరుసగా అన్నీ ఒలింపిక్స్‌లో పాల్గొన్న నినో... తాజాగా పారిస్ క్రీడల ద్వారా వరుసగా పదోసారి గేమ్స్ లో పాల్గొన్న క్రీడాకారిణిగా రికార్డు నెలకొలి్పంది. శనివారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో నినో బరిలోకి దిగి 562 పాయింట్లు స్కోరు చేసి 38వ స్థానంలో నిలిచింది. కెనడాకు చెందిన ఈక్వె్రస్టియాన్ ఇయాన్ మిల్లర్ కూడా 10 ఒలింపిక్స్‌లో పాల్గొన్నా... అతడు 1980 మాస్కో ఒలింపిక్స్‌కు దూరంగా ఉన్నాడు. 2016 రియోలో కుమారుడు సోట్నే మచావరియానితో కలిసి పోటీపడటం ద్వారా.. విశ్వక్రీడల్లో బరిలోకి దిగిన తొలి తల్లీ తనయులుగా నినో రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు మూడు పతకాలు సాధించిన నినో... తండ్రి చివరి కోరిక మేరకే పదో ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నట్లు పేర్కొంది. -
ప్రపంచ రికార్డు... అయినా పతకానికి దూరం
ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ రిథమ్ సాంగ్వాన్ కొత్త ప్రపంచ రికార్డును సృష్టించింది. అజర్‌బైజాన్‌లోని బాకులో జరుగుతున్న ఈ పోటీల్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో రిథమ్ 595 పాయింట్లు స్కోరు సాధించి రికార్డును నమోదు చేసింది. అయితే ఈ పోటీల క్వాలిఫయింగ్ ఈవెంట్లో ఆమె ఈ కొత్త ఘనతను ప్రదర్శించింది. రికార్డు స్కోరుతో ఫైనల్ చేరిన రిథమ్ అసలు సమరంలో మాత్రం విఫలమైంది. సత్తా చాటలేకపోయిన ఆమె చివరగా ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది. ఇదే ఈవెంట్ క్వాలిఫయింగ్ ఇతర భారత షూటర్లు ఇషాసింగ్, మను భాకర్ వరుసగా 13వ, 27వ స్థానాల్లో నిలిచి ఆరంభంలోనే ని్రష్కమించారు. పురుషుల 50 మీటర్ల 3 పొజిషన్ రైఫిల్ ఈవెంట్లో కూడా భారత షూటర్లెవరూ ఫైనల్స్‌కు అర్హత సాధించలేకపోయారు. -
మహిళా షూటర్‌పై అత్యాచారం
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఓ జాతీయ స్థాయి మహిళా షూటర్‌పై సహచర ఆటగాడే అత్యాచారం చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఆ అర్జున అవార్డీ షూటర్ చివరికి మోసం చేసి పరారయ్యాడు. దీంతో మహిళా షూటర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఒలింపిక్స్‌లోనూ పాల్గొన్న ఈ షూటర్ రెండేళ్ల నుంచి తెలుసని... భారత స్పోర్ట్స అథారిటీ (సాయ్) షూటింగ్ రేంజిలో జాతీయ చాంపియన్‌షిప్స్ కోసం జరిగిన శిక్షణ సందర్భంగా పరిచయం అయ్యాడని మహిళా షూటర్ తన ఫిర్యాదులో పేర్కొంది. వివాహం చేసుకుంటానని నమ్మించి, గత నెలలో పానీయంలో మత్తు మందు కలిపి అత్యాచారం చేశాడని తెలిపింది. వైద్యపరీక్షల నిమిత్తం ఆమెను ఆస్పత్రికి తరలించగా.. అత్యాచారం జరిగినట్టు నిర్ధారణ అయిందని పోలీసులు తెలిపారు. నిందితుడిని విచారణకు హాజరుకావాలని ఆదేశించినట్టు చెప్పారు. మరోవైపు ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరమని భారత జాతీయ రైఫిల్ సంఘం (ఎన్ఆర్ఏఐ) పేర్కొంది. అయితే మీడియా ద్వారానే ఈ విషయం తెలుసుకున్నామని, ఢిల్లీ పోలీసుల నుంచి పూర్తి వివరాలు అందాక తదుపరి చర్యలు తీసుకుంటామని ఎన్ఆర్ఏఐ కార్యదర్శి రాజీవ్ భాటియా తెలిపారు.