మను మురిపించె... | Indian shooter Manu Bhakar won the bronze medal | Sakshi
Sakshi News home page

మను మురిపించె...

Published Mon, Jul 29 2024 3:57 AM | Last Updated on Mon, Jul 29 2024 6:58 AM

Indian shooter Manu Bhakar won the bronze medal

కాంస్య పతకం గెలిచిన భారత షూటర్‌ మనూ భాకర్‌

ఒలింపిక్స్‌లో పతకం నెగ్గిన తొలి భారతీయ మహిళా షూటర్‌గా రికార్డు

10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఫైనల్లో మూడో స్థానం

పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ పతకాల బోణీ

నేడు మరో రెండు పతకాల రేసులో భారత షూటర్లు రమిత, అర్జున్‌  

గత రెండు ఒలింపిక్స్‌ క్రీడల్లో మూగబోయిన  భారతీయ తుపాకీ ‘పారిస్‌’లో గర్జించింది. మూడేళ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్‌లో భారీ అంచనాలతో  బరిలోకి దిగి కనీసం ఫైనల్‌ చేరుకోకుండానే వెనుదిరిగిన మనూ భాకర్‌... ‘పారిస్‌’లో మాత్రం చిరస్మరణీయ  ప్రదర్శనతో దేశం మొత్తాన్ని మురిపించింది. 

చెక్కు చెదరని ఏకాగ్రతతో... గురి తప్పని లక్ష్యంతో... ఒక్కో బుల్లెట్‌ను 10 మీటర్ల ముందున్న వృత్తంలోకి పంపిస్తూ... మూడో స్థానాన్ని సంపాదించి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో మనూ కొత్త చరిత్రను లిఖించింది. ఒలింపిక్స్‌ క్రీడల్లో పతకం నెగ్గిన తొలి  భారతీయ మహిళా షూటర్‌గా ఈ హరియాణా అమ్మాయి  గుర్తింపు పొందింది.  

పారిస్‌: గత చేదు అనుభవాలను వెనక్కి నెట్టి పారిస్‌ వేదికగా భారత మహిళా షూటర్‌ మనూ భాకర్‌ కొత్త చరిత్రను లిఖించింది. ఒలింపిక్స్‌ క్రీడల్లో పతకం గెలిచిన తొలి భారతీయ మహిళా షూటర్‌గా చరిత్రకెక్కింది. ఆదివారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఫైనల్లో 22 ఏళ్ల మనూ భాకర్‌ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. మనూ భాకర్‌ 221.7 పాయింట్లు సాధించి కాంస్య పతకాన్ని సాధించింది. దక్షిణ కొరియాకు చెందిన జిన్‌ ఓయె (243.2 పాయింట్లు) స్వర్ణం నెగ్గగా... కిమ్‌ యెజీ (241.3 పాయింట్లు) రజతం గెలిచింది.  
  
ఫైనల్‌ సాగిందిలా... 
ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్‌ పద్ధతిలో ఫైనల్‌ జరిగింది. ముందుగా స్టేజ్‌–1లో ఎనిమిది మంది షూటర్లు 10 షాట్‌లు సంధించారు. 12వ షాట్‌ తర్వాత స్టేజ్‌–2లో ఎలిమినేషన్‌ మొదలైంది. 12 షాట్‌ల తర్వాత తక్కువ పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉన్న వెరోనికా మాయో (హంగేరి–114 పాయింట్లు) ని్రష్కమించింది. అప్పటికి మనూ 121.2 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. 

14వ షాట్‌ తర్వాత తర్హాన్‌ (టర్కీ –135.6 పాయింట్లు), 16వ షాట్‌ తర్వాత రాన్‌జిన్‌ జియాంగ్‌ (చైనా–156.5 పాయింట్లు), 18వ షాట్‌ తర్వాత జుయ్‌ లీ (చైనా–178.3 పాయింట్లు) వెనుదిరిగారు. 20వ షాట్‌ తర్వాత త్రిన్‌ తు విన్‌ (వియత్నాం–198.6 పాయింట్లు) నాలుగో స్థానంతో ని్రష్కమించడంతో వరుసగా జిన్‌ ఓయె, కిమ్‌ యెజీ, మనూ భాకర్‌ పతకాల రేసులో నిలిచారు. 

22వ షాట్‌ తర్వాత మనూ భాకర్‌ 221.7 పాయింట్లతో మూడో స్థానంలో... కిమ్‌ యెజీ 221.8 పాయింట్లతో రెండో స్థానంలో, జిన్‌ ఓయె 222.6 పాయింట్లతో తొలి స్థానంలో ఉన్నారు. 0.1 పాయింట్‌ తేడాతో కిమ్‌ యెజీకంటే మనూ వెనుకబడి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. చివరి రెండు షాట్‌లలో జిన్‌ ఓయె 10, 10.6 పాయింట్లు... కిమ్‌ యెజీ 9.7, 9.8 పాయింట్లు స్కోరు చేశారు. దాంతో జిన్‌ ఓయె 243.2 పాయింట్లతో స్వర్ణాన్ని ఖాయం చేసుకోగా, కిమ్‌ యెజీ 241.3 పాయింట్లతో రజతం నెగ్గింది. 

క్వాలిఫయింగ్‌లో మెరిసి...
పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ క్వాలిఫయింగ్‌లో అర్జున్‌ బబూతా... మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ క్వాలిఫయింగ్‌లో రమితా జిందాల్‌ టాప్‌–8లో నిలిచి ఫైనల్స్‌కు అర్హత సాధించారు. 49 మంది షూటర్లు పోటీపడ్డ క్వాలిఫయింగ్‌లో అర్జున్‌ బబూతా 630.1 పాయింట్లు స్కోరు చేసి ఏడో స్థానంలో నిలిచి ఫైనల్‌ బెర్త్‌ను దక్కించుకున్నాడు. 

టాప్‌–8లో నిలిచిన వారు ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. 43 మంది షూటర్లు పోటీపడ్డ మహిళల క్వాలిఫయింగ్‌లో రమితా జిందాల్‌ 631.5 పాయింట్లు సాధించి ఐదో స్థానంలో నిలిచి ఫైనల్లోకి అడుగు పెట్టింది. ఈ విభాగంలోనూ టాప్‌–8లో నిలిచిన వారు ఫైనల్‌కు అర్హత సాధిస్తారు.  

7 ఒలింపిక్స్‌ క్రీడల్లో భారత్‌కు పతకం అందించిన ఏడో మహిళా క్రీడాకారిణిగా మనూ భాకర్‌ నిలిచింది. ఈ జాబితాలో కరణం మల్లీశ్వరి (వెయిట్‌లిఫ్టింగ్‌; కాంస్యం–2000 సిడ్నీ), సైనా నెహా్వల్‌ (బ్యాడ్మింటన్‌; కాంస్యం–2012 లండన్‌), మేరీకోమ్‌ (బాక్సింగ్‌; కాంస్యం–2012 లండన్‌), పీవీ సింధు (బ్యాడ్మింటన్‌; రజతం–2016 రియో, కాంస్యం–2020 టోక్యో), సాక్షి మలిక్‌ (రెజ్లింగ్‌; కాంస్యం–2016 రియో), లవ్లీనా బొర్గొహైన్‌ (బాక్సింగ్‌; కాంస్యం–2020 టోక్యో) ఉన్నారు.  

5 ఒలింపిక్స్‌ క్రీడల్లో పతకం గెలిచిన ఐదో  భారతీయ షూటర్‌గా, తొలి మహిళా షూటర్‌గా మనూ భాకర్‌ గుర్తింపు పొందింది. గతంలో రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాథోడ్‌ (డబుల్‌ ట్రాప్‌; రజతం–2004 ఏథెన్స్‌), అభినవ్‌  బింద్రా (10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌; స్వర్ణం–2008 బీజింగ్‌), విజయ్‌ కుమార్‌ (25 మీటర్ల ర్యాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌; రజతం–2012 లండన్‌), గగన్‌ నారంగ్‌ (10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌; కాంస్యం–2012 లండన్‌) ఈ ఘనత సాధించారు. 
  
టోక్యో ఒలింపిక్స్‌ తర్వాత నేను తీవ్రంగా నిరాశపడ్డాను. దాని నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. ఇప్పుడు కాంస్యం సాధించడం పట్ల సంతోషంగా ఉన్నా. దీనిని మాటల్లో  చెప్పలేను. వచ్చే సారి ఇంతకంటే మెరుగైన పతకం గెలుస్తానేమో. చాలా కాలం తర్వాత భారత్‌కు  షూటింగ్‌లో మెడల్‌ రావడం కూడా గొప్పగా అనిపిస్తోంది. ఫైనల్లో ఆఖరి షాట్‌లో కూడా ఎంతో  ప్రయత్నించా. 

ఒక దశలో రజతం సాధించగలనని భావించా. నేను భగవద్గీత చదువుతాను. నేను చేయాల్సింది చేసి ఫలితాన్ని భగవంతునికే వదిలేస్తాను. మీకు ఏం రాసిపెట్టి ఉందో అదే జరుగుతుంది. జరగబోయేది మన చేతుల్లో ఉండదు. మన ప్రయత్నం చేస్తూ అత్యుత్తమ ప్రదర్శన మాత్రమే ఇవ్వగలం. ఈ పతకం కోసం మేం చాలా కష్టపడ్డాం. నాకు అండగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు. –మనూ భాకర్‌  

చారిత్రక విజయం! పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ తరఫున తొలి పతకం గెలిచిన మనూ భాకర్‌కు అభినందనలు. షూటింగ్‌లో ఈ ఘనత సాధించిన తొలి మహిళ కావడం మరింత గర్వకారణం.–నరేంద్ర మోదీ, ప్రధాని

భారత పతకాల బోణీ చేసిన భాకర్‌కు శుభాకాంక్షలు. ఈ విజయం మరింత మంది మహిళలకు స్ఫూర్తినిస్తుంది. మనూ మరిన్ని ఘనతలు సాధించాలి.  
–ద్రౌపది ముర్ము, రాష్ట్రపతి  


ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారత మహిళా షూటర్‌గా రికార్డు సృష్టించావు. మనూ... నీ ప్రదర్శనతో దేశం మొత్తం గర్వించేలా చేశావు.  
–వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎం

నీ అంకితభావం, శ్రమ ఫలించాయి. ప్రతీ షాట్‌తో భారత్‌ గర్వపడేలా చేశావు. నీ పట్టుదలకు ఈ పతకం ఉదాహరణ.  –అభినవ్‌ బింద్రా   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement