ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు నెగ్గిన తొలి భారత ప్లేయర్‌గా ఘనత
10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో కాంస్యం
సరబ్‌జోత్‌తో కలిసి మూడో స్థానం సొంతం
ఆగస్టు 2న మూడో ఈవెంట్ బరిలో మనూ భాకర్
పారిస్ వేదికగా మంగళవారం భారత మహిళా షూటర్ మనూ భాకర్ కొత్త చరిత్రను లిఖించింది. గతంలో ఏ భారత ప్లేయర్‌కూ సాధ్యంకాని ఘనతను మనూ సాధించి చూపించింది. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా ఈ హరియాణా అమ్మాయి అద్భుతాన్ని ఆవిష్కరించింది.
ఆదివారం మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం గెలిచిన 22 ఏళ్ల మనూ భాకర్... మంగళవారం అదే వేదికపై సహచరుడు సరబ్‌జోత్ సింగ్‌తో కలిసి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. తద్వారా ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచిన భారత ప్లేయర్‌గా ఆమె చరిత్రకెక్కింది.
తాను పోటీపడ్డ రెండు ఈవెంట్లలోనూ పతకాలు నెగ్గిన మనూకు మూడో పతకం సాధించే అవకాశం కూడా ఉంది. ఆగస్టు 2న ఆమె 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ క్వాలిఫయింగ్‌లో బరిలోకి దిగుతుంది. క్వాలిఫయింగ్‌లో రాణించి ఫైనల్‌కు చేరితే ఆగస్టు 3న మూడో పతకంపై మనూ గురి పెడుతుంది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత క్వాలిఫయింగ్‌లో త్రుటిలో ఫైనల్ స్థానాన్ని చేజార్చుకున్న సరబ్‌జోత్... మనూతో కలిసి ‘మిక్స్‌డ్’లో కాంస్యం నెగ్గి కెరీర్‌లోనే చిరస్మరణీయ ప్రదర్శన నమోదు చేశాడు.
పారిస్: రెండు రోజుల క్రితం పతకం సాధించిన విశ్వాసంతో భారత మహిళా యువ షూటర్ మనూ భాకర్ మరోసారి అదరగొట్టింది. పూర్తి సంయమనంతో, చెక్కు చెదరని ఏకాగ్రతతో లక్ష్యం దిశగా బుల్లెట్‌లు సంధించిన మనూ ఈ క్రమంలో కొత్త చరిత్రలో భాగమైంది. స్వాతంత్య్రం వచ్చాక ఒలింపిక్స్ క్రీడల్లో ఏ భారతీయ క్రీడాకారుడు సాధించని ఘనతను మనూ అందుకుంది. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచిన తొలి భారత ప్లేయర్‌గా మనూ భాకర్ రికార్డు నెలకొల్పింది.
మంగళవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో మనూ భాకర్–సరబ్‌జోత్ సింగ్ (భారత్) జోడీ కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. కాంస్య పతక మ్యాచ్‌లో మనూ–సరబ్‌జోత్ ద్వయం 16–10 పాయింట్ల తేడాతో జిన్ ఓయె–లీ వన్‌హో (దక్షిణ కొరియా) జోడీపై గెలిచింది. సోమవారం జరిగిన క్వాలిఫయింగ్‌లో మనూ–సరబ్‌జోత్ 580 పాయింట్లతో మూడో స్థానంలో, జిన్ ఓయె–లీ వన్‌హో 579 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచి కాంస్య పతక పోరుకు అర్హత సాధించారు.
తర్హాన్ సెవల్ ఇల్యాదా–యూసుఫ్ డికెచ్ (టర్కీ) జోడీ 582 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో... జొరానా అరునోవిచ్–దామిర్ మికెచ్ (సెర్బియా) ద్వయం 581 పాయింట్లతో రెండో ర్యాంక్‌లో నిలిచి స్వర్ణ–రజత పతక పోరుకు అర్హత పొందారు. మంగళవారం జరిగిన ఫైనల్లో జొరానా–దామిర్ ద్వయం 16–14తో తర్హాన్–యూసుఫ్ జంటను ఓడించి స్వర్ణ పతకాన్ని గెల్చుకుంది. తర్హాన్–యూసుఫ్ జోడీకి రజత పతకం లభించింది. 1900 పారిస్ ఒలింపిక్స్ అథ్లెటిక్స్‌లో బ్రిటిష్ ఇండియాకు ప్రాతినిధ్యం వహించిన నార్మన్ ప్రిచర్డ్ పురుషుల 200 మీటర్లు, 200 మీటర్ల హర్డిల్స్‌లో రెండు రజత పతకాలు సాధించాడు. అయితే ఈ ఘనత భారత్‌కు స్వాతంత్య్రంరాక ముందు నమోదైంది.
గత టోక్యో ఒలింపిక్స్‌లో సౌరభ్ చౌదరీతో కలిసి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో బరిలోకి దిగిన మనూ భాకర్ క్వాలిఫయింగ్‌లో ఏడో స్థానంలో నిలిచి మెడల్ రౌండ్‌కు అర్హత పొందలేకపోయింది. అయితే ఈసారి సరబ్‌జోత్‌తో జత కట్టిన మనూ క్వాలిఫయింగ్‌లోనే కాకుండా కాంస్య పతక మ్యాచ్‌లోనూ నిలకడగా స్కోరు చేసి తన ఖాతాలో రెండో పతకాన్ని వేసుకుంది. మరోవైపు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగం క్వాలిఫయింగ్‌లో 577 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత పొందలేకపోయిన బాధను మర్చిపోయి సరబ్‌జోత్ ‘మిక్స్‌డ్’ ఈవెంట్‌లో గురి తప్పని లక్ష్యంతో పాయింట్లు సాధించి తన ఒలింపిక్ పతకం కలను నిజం చేసుకున్నాడు.
మిక్స్‌డ్ ఈవెంట్ పతక మ్యాచ్‌లో రెండు జోడీల్లో తొలుత 16 పాయింట్లు స్కోరు చేసిన జంటను విజేతగా ప్రకటిస్తారు. ఒక్కో అవకాశంలో రెండు జట్లలోని ఇద్దరేసి షూటర్లు లక్ష్యం దిశగా రెండు షాట్‌ల చొప్పున సంధిస్తారు. రెండు జోడీల్లో ఎక్కువ పాయింట్లు సాధించిన జంటకు 2 పాయింట్లు, తక్కువ స్కోరు చేసిన జోడీకి 0 పాయింట్లు కేటాయిస్తారు. 13 సిరీస్‌లపాటు జరిగిన కాంస్య పతక మ్యాచ్‌లో తొలి సిరీస్‌లో కొరియా జోడీ నెగ్గగా... ఆ తర్వాత వరుసగా నాలుగు సిరీస్‌లలో భారత జంట గెలిచి 8–2తో ఆధిక్యంలోకి వెళ్లింది.
ఆ తర్వాత ఆరో సిరీస్‌లో కొరియా ద్వయం... ఏడో సిరీస్‌లో భారత జోడీ పైచేయి సాధించాయి. ఎనిమిదో సిరీస్‌లో కొరియా గెలుపొందగా... తొమ్మిది, పది సిరీస్‌లను భారత జోడీ సొంతం చేసుకొని 14–6తో విజయానికి చేరువైంది. అయితే 11వ సిరీస్‌లో, 12వ సిరీస్‌లో కొరియా ద్వయం పైచేయి సాధించి ఆధిక్యాన్ని 10–14కి తగ్గించింది. అయితే 13వ సిరీస్‌లో మనూ–సరబ్‌జోత్ జోడీ 19.6 స్కోరు చేయగా... కొరియా జంట 18.5 స్కోరు సాధించింది. దాంతో భారత జంట మొదటగా 16 పాయింట్లను అందుకొని విజయంతోపాటు కాంస్య పతకాన్ని దక్కించుకుంది.
పతకం గెలవగానే నా మనసులో ఎన్నో చిన్ననాటి ఆలోచనలు వచ్చాయి. ఇన్నేళ్లుగా నాన్న, తాత నాకు అండగా నిలిచిన వైనం, తొలి రెండేళ్లు కోచింగ్ కోసం బస్సులో అంబాలాకు వెళ్లిన రోజులు గుర్తుకొచ్చాయి. ఈవెంట్‌కు ముందు రేంజ్‌లోకి అడుగు పెట్టే సమయంలో కొంత ఒత్తిడిని ఎదుర్కొన్నా. వ్యక్తిగత విభాగంలో వైఫల్యం తర్వాత నా కుటుంబసభ్యులు, కోచ్‌లు ఓదార్చి నాలో మళ్లీ స్ఫూర్తిని నింపారు. ఎక్కడ తప్పు జరిగిందో సరిదిద్దుకునే ప్రయత్నం చేశాను. నా విజయంలో ఆరి్థకపరంగా అండగా నిలిచిన భారత ప్రభుత్వ పాత్ర కూడా ఎంతో ఉంది. –సరబ్‌జోత్ సింగ్
మనందరం గర్వపడే క్షణాలను మన షూటర్లు మళ్లీ అందించారు. మనూ, సరబ్‌జోత్‌లకు అభినందనలు. ఇద్దరూ చక్కటి ప్రదర్శన కనబర్చారు. భారత్ ఎంతో సంతోషిస్తోంది. –నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
వరుసగా రెండో ఒలింపిక్ పతకం సాధించడం మనూ భాకర్ నిలకడైన ప్రదర్శనను, అంకితభావాన్ని చూపిస్తోంది. కాంస్యం గెలిచిన మనూ, సరబ్‌జోత్‌లకు శుభాకాంక్షలు. వారు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలి. –ద్రౌపది ముర్ము, రాష్ట్రపతి
మనూ, సరబ్‌జోత్... గతంలో ఏ భారత జోడీ సాధించని ఘనతను మీరు అందుకున్నారు. షూటింగ్‌లో ఇది భారత్‌కు తొలి టీమ్ మెడల్. ఈ క్షణాలను ఆస్వాదించండి. –అభినవ్ బింద్రా
ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించి మనూ, సరబ్‌జోత్ దేశం గర్వపడేలా చేశారు. ఇతర క్రీడాకారులకు మీ ప్రదర్శన స్ఫూర్తిగా నిలుస్తుంది. –వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం
3 స్వాతంత్య్రం వచ్చాక ఒలింపిక్స్ క్రీడల్లో రెండు పతకాలు సాధించిన మూడో భారత ప్లేయర్ మనూ భాకర్. గతంలో రెజ్లర్ సుశీల్ కుమార్ (2008 బీజింగ్–కాంస్యం; 2012 లండన్–రజతం), షట్లర్ పీవీ సింధు (2016 రియో–రజతం; 2020 టోక్యో–కాంస్యం) ఈ ఘనత సాధించారు.
6 ఒలింపిక్స్ క్రీడల్లో పతకం గెలిచిన ఆరో భారతీయ షూటర్‌గా సరబ్‌జోత్ సింగ్ గుర్తింపు పొందాడు. గతంలో రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ (డబుల్ ట్రాప్; రజతం–2004 ఏథెన్స్), అభినవ్ బింద్రా (10 మీటర్ల ఎయిర్ రైఫిల్; స్వర్ణం–2008 బీజింగ్), విజయ్ కుమార్ (25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్; రజతం–2012 లండన్), గగన్ నారంగ్ (10 మీటర్ల ఎయిర్ రైఫిల్; కాంస్యం–2012 లండన్), మనూ భాకర్ (2024 పారిస్; 2 కాంస్యాలు) ఈ ఘనత సాధించారు.
ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలుస్తానని నేను అనుకోలేదు. ఈ అనుభూతి కొత్తగా ఉంది. దేశం తరఫున సాధ్యమైనన్ని ఎక్కువ పతకాలు గెలవాలని కోరుకుంటా. టోక్యోలో వైఫల్యం చూశాను కాబట్టి ఆ పతకాల విలువ ఏమిటో నాకు ఇప్పుడు ఇంకా బాగా అర్థమవుతోంది. ప్రస్తుతానికి మరో మెడల్ సాధించడం పట్ల చాలా ఆనందంగా ఉన్నా. తర్వాతి ఈవెంట్‌లో ఎలా ఆడతానో చెప్పలేను. నా శాయశక్తులా ప్రయతి్నస్తా. ఒకవేళ విఫలమైతే అభిమానులు నిరాశపడరనే అనుకుంటున్నా. నాపై కురుస్తున్న ఈ ప్రేమాభిమానులు ఇలాగే కొనసాగాలి. –మనూ భాకర్
Comments
Please login to add a commentAdd a comment